ఓటీఎస్‌ ద్వారా రూ.10 వేల కోట్ల రుణాలు మాఫీ | Rs 10,000 crore loan waiver through OTS | Sakshi
Sakshi News home page

ఓటీఎస్‌ ద్వారా రూ.10 వేల కోట్ల రుణాలు మాఫీ

Published Thu, Dec 2 2021 4:40 AM | Last Updated on Thu, Dec 2 2021 4:40 AM

Rs 10,000 crore loan waiver through OTS - Sakshi

సాక్షి, అమరావతి: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్‌) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 వేల కోట్ల మేరకు పేదల రుణాలను మాఫీ చేస్తోందని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ తెలిపారు. బుధవారం విజయవాడలో సంస్థ ఎండీ భరత్‌ గుప్తతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1983 నుంచి 2011 వరకూ గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణాలు తీసుకొని ఇళ్లు నిర్మించుకున్న వారి అసలు, వడ్డీ కలిపి రూ.14 వేల కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఓటీఎస్‌ రూపంలో పేదలకు వడ్డీ, అసలు రెండింటికీ రాయితీ ఇచ్చి నిర్ణీత మొత్తాలు చెల్లించిన వారికి ఆస్తులపై సంపూర్ణ హక్కులు కల్పిస్తోందని వివరించారు. 22–ఏ లిస్ట్‌లో ఉన్న స్థలాలను ఆ జాబితా నుంచి తొలగించి, ఎలాంటి యూజర్, స్టాంప్‌ చార్జీలు లేకుండా రిజిస్ట్రేషన్‌ చేస్తున్నట్టు తెలిపారు.

సాధారణంగా ఆస్తుల రిజిస్ట్రేషన్‌ సమయంలో విలువపై 7.5% చెల్లించాలని, రిజిస్ట్టర్‌ కార్యాలయాల దగ్గర పడిగాపులు కాయాల్సి ఉంటుందన్నారు. ఇప్పుడు 7.5% చార్జీలు లేకుండా, ఎక్కడా వేచి ఉండాల్సిన అవసరం లేకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తుందన్నారు. డీ పట్టా, పొజిషన్‌ సర్టిఫికెట్‌ స్థలాలను 22–ఏ లిస్టులో నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల స్థలం, ఇంటి విలువపై 75% వరకు బ్యాంక్‌ రుణం పొందే సదుపాయం ఉంటుందన్నారు. బ్యాంక్‌లతో సంప్రదించి రుణాలు పొందడానికి వీలుగా రిజిస్ట్రేషన్‌ పత్రాలు సిద్ధం చేశామని (వెట్టింగ్‌) చెప్పారు.

గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణాలు తీసుకోని వారు 12 లక్షల మంది ఉన్నారని, వీరు కేవలం రూ.10 చెల్లిస్తే రిజిస్ట్రేషన్‌ చేస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 8 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని, 21న సీఎం లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ పత్రాలు పంపిణీ ప్రారంభిస్తామన్నారు. తొలి విడతలో వాస్తవ హక్కుదారులు, వారి వారసుల ఆధీనంలో ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్లు చేస్తున్నామన్నారు. రెండో విడతలో చేతులు మారిన ఇళ్లపై విచారణలు జరిపి, ఉత్తర్వులు అందాక రిజిస్ట్రేషన్లు చేస్తామని వివరించారు.

స్వచ్ఛందంగా వచ్చిన వారికే రిజిస్ట్రేషన్‌
స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికే ఈ పథకాన్ని వర్తింపజేస్తామని, అర్హులపై ఒత్తిళ్లు ఉండవన్నారు. ఎవరైనా హక్కులు పొందడానికి ముందుకు రాకపోతే ఎటువంటి బలవంతం చేయడంలేదని తెలిపారు. ఓటీఎస్‌కు ముందుకు రాని వారి పింఛన్లు నిలిపివేయాలని శ్రీకాకుళం జిల్లాలో సర్క్యులర్‌ జారీ చేసిన పంచాయతీ సెక్రటరీపై చర్యలు తీసుకున్నామన్నారు. ఓటీఎస్‌ వినియోగించుకోకపోతే ఇతర పథకాలు ఆగిపోతాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పథకం ప్రయోజనాలు ప్రజలకు తెలియజేయాలని, ఒత్తిడి తీసుకురావద్దని కలెక్టర్లు, జేసీలను ఆదేశించామన్నారు.

అనేక వినతులు అందాయి
చివరిసారిగా రాష్ట్రంలో 2014లో ఓటీఎస్‌ అమలు జరిగిందని అజయ్‌ జైన్‌ చెప్పారు. అనంతరం ప్రజాప్రతినిధులు, రుణ గ్రహీతల నుంచి ఓటీఎస్‌ అమలు చేయాలని అనేక వినతులు అందాయని తెలిపారు. ఈ నేపథ్యంలో 2016లో ఓటీఎస్‌ అమలుకు గృహ నిర్మాణ శాఖ కార్యవర్గం తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపిందన్నారు. అయితే అప్పటి ప్రభుత్వం అమలుపై నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం వడ్డీ, అసలు రెండింటికీ రాయితీ ఇచ్చి పథకాన్ని అమలు చేస్తోందని వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement