జోరుగా ఇళ్ల నిర్మాణం | Works worth Rs 10 crore per day in Jagananna colonies at present | Sakshi
Sakshi News home page

జోరుగా ఇళ్ల నిర్మాణం

Published Tue, Jul 20 2021 3:33 AM | Last Updated on Tue, Jul 20 2021 3:33 AM

Works worth Rs 10 crore per day in Jagananna colonies at present - Sakshi

సాక్షి, అమరావతి: ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున చేపట్టిన వైఎస్సార్‌–జగనన్న కాలనీల్లో పేదల ఇళ్ల నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఇప్పటికే పది లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు శంకుస్థాపనలు పూర్తిచేశారు. అంతకుముందు ఇళ్ల శంకుస్థాపనలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం మెగా గ్రౌండింగ్‌ మేళాను నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రోజుకు రూ.పది కోట్ల విలువైన ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ధారించిన గడువులోగా తొలిదశ నిర్మాణాలను పూర్తిచేయాలని అధికార యంత్రాంగం పట్టుదలతో కృషిచేస్తోంది. దీంతో రెండు నెలల్లో రూ.597.94 కోట్ల విలువైన పనులు జరిగాయి. మరోవైపు.. తొమ్మిది లక్షలకు పైగా ఇళ్ల పనులు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. ఇందుకు స్టీలు, సిమెంట్, ఇసుక, కూలీలకు మాత్రమే ప్రస్తుతం వ్యయమవుతోంది. బేస్‌మెంట్‌ స్థాయి దాటితే రోజు వారీ వ్యయం మరింత పెరుగుతుందని గృహ నిర్మాణ శాఖ చెబుతోంది.

పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్‌–జగనన్న కాలనీల్లో సాగుతున్న ఇళ్ల నిర్మాణ పనులు, శ్రీకాకుళం జిల్లాలో పనులను పరిశీలిస్తున్న అధికారులు 

కాలనీల వద్దే నిర్మాణ సామగ్రి గోదాములు
ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన సామగ్రిని గృహ నిర్మాణ శాఖ కాలనీలకు సమీపంలోనే అందుబాటులో ఉంచడంతో లబ్ధిదారులు ఉత్సాహంగా ఇళ్ల నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. గ్రామ, మండల స్థాయిల్లో గోదాములను అద్దెకు తీసుకుని వీటిని నిల్వ ఉంచారు. అలాగే..
► పేదల ఇళ్ల నిర్మాణాల నిమిత్తం ఇప్పటికే 1.57 లక్షల మెట్రిక్‌ టన్నుల సిమెంట్‌ను కొనుగోలు చేయడమే కాకుండా 89,379.30 మెట్రిక్‌ టన్నుల సిమెంట్‌ను గోదాములకు తరలించి లబ్ధిదారులకు అందుబాటులో ఉంచారు. 
► 24,022.68 మెట్రిక్‌ టన్నుల స్టీలు కొనుగోలు చేసి 3,930.557 మెట్రిక్‌ టన్నులను గోదాముల్లో ఉంచారు. 
► ఇక 1,09,774 మెట్రిక్‌ టన్నుల ఇసుకను నిల్వ ఉంచారు. దీంతో జాప్యం లేకుండా ఇళ్ల నిర్మాణ సామగ్రిని లబ్ధిదారులకు సరఫరా చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలను నిర్ధారించిన గడువులో పూర్తిచేసేందుకు సీఎం జగన్‌ జిల్లాకో జేసీని ప్రత్యేకంగా నియమించిన విషయం తెలిసిందే. వీరు క్షేత్రస్థాయిలో పనులు వేగంగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 
సెప్టెంబర్‌ 15కల్లా బేస్‌మెంట్లు పూర్తి
సీఎం ఆదేశాల మేరకు సెప్టెంబర్‌ 15కల్లా బేస్‌మెంట్‌ స్థాయికి ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం రోజుకు రూ.పది కోట్ల విలువగల పనులు జరుగుతున్నాయి. బేస్‌మెంట్‌ స్థాయి దాటిన తరువాత రోజుకు రూ.50 కోట్ల పనులు జరుగుతాయి. 
    – అజయ్‌ జైన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్‌      

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement