మహబూబ్‌నగర్ టౌన్: ప్రభుత్వం తమకు గంటెడు జాగా ఇస్తే దున్నుకొని దర్జాగా బతకవచ్చని భావించిన పేదలకు అంతలోనే నిరాశే ఎదురైంది. ఎంపికచేసిన గ్రామాల్లో అర్హులందరికీ పంపిణీచేస్తామని చెప్పిన ప్రభుత్వం.. కొందరికి మాత్రమే పంపిణీ చేయడంతో మిగతావారిలో నైరాశ్యం నెలకొంది. పంద్రాగస్టు రోజున పట్టాలు అందుకోవచ్చని ఆశించిన వారి ఆశలు ఆవిరయ్యాయి. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 14 గ్రామాలను భూపంపిణీకి ఎంపికచేశారు. ఆయా గ్రామాల్లో అర్హులను గుర్తించి వారిలో ఒక్కో కుటుంబానికి మూడెకరాల చొప్పున భూమిని పంపిణీ చేసేందుకు అధికారులు నెలరోజుల పాటు కసరత్తుచేశారు.
తీరా ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేవలం ఆరు గ్రామాల్లో 20మందికి మాత్రమే 60 ఎకరాలను పంపిణీచేసి చేతులు దులుపుకున్నారు. మిగతా ఎనిమిది నియోజకవర్గాల్లోని ఎంపికచేసిన ఆ ఎనిమిది గ్రామాల ప్రజలకు నిరాశే మిగిలింది. ఇక పంపిణీచేసిన గ్రామాల్లో కూడా అందరికీ ఇవ్వలేకపోయారు. దీంతో అర్హులు ఒకింత అసహనానికి గురయ్యారు.
నిధులు ఖాతాకే పరిమితం
ప్రభుత్వ భూములు ఉంటే సరేసరి.. లేకపోతే జిల్లాలో భూమిని కొనుగోలు చేసైనా దళితులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం జిల్లాకు రూ.24కోట్లు మంజూరుచేసింది. అయితే కేవలం రూ.1.55కోట్లు వెచ్చించి 60 ఎకరాలను కొనుగోలుచేసిన అధికారులు 20 మంది లబ్ధిదారులకు మాత్రమే పంపిణీ చేయగలిగారు. మిగతా రూ.22.45కోట్లను ఖాతాకే పరిమితంచేశారు. వీటిని కూడా వినియోగిస్తారా? లేదా? అన్నది అయోమయం నెలకొంది.
పంపిణీచేయని గ్రామాలు
జిల్లాలో ఎంపికచేసినా.. కొన్ని గ్రామాల్లో భూమిని పంపిణీ చేయలేదు. వాటిలో కొల్లాపూర్ నియోజకవర్గం ఎల్లూరు, కల్వకుర్తి మండలం వెల్దండ శేరి అప్పారెడ్డిపల్లి, తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లి, గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్ మండలం పాల్వాయి, కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం నందిపాడు, మక్తల్ నియోజకవర్గంలోని కర్నె, వనపర్తి నియోజకవర్గం పెద్దమందడి మండలం దొడగుంటపల్లి, నారాయణపేట నియోజకవర్గంలోని ధన్వాడ మండలం పెద్దచింతకుంట గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో 29 మంది లబ్ధిదారులను గుర్తించారు. కాగా, భూ పంపిణీకి సంబంధించి అధికారులు కేవలం 20 మందికి మాత్రమే పంపిణీచేసి.. మిగతావారికి ఎప్పుడు పంపిణీచేస్తారనే విషయమై మౌనం దాల్చారు.
3ఎకరాలు.. 20మందికే!
Published Sun, Aug 24 2014 4:51 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement