సాక్షి, గుంటూరు: అమరావతిలో పేదల భూముల ఆర్5 జోన్ వివాదంతో సుప్రీం కోర్టుకు వెళ్లడం దారుణమైన విషయమని, అయినా కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో పార్టీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ..
ఆర్5 జోన్‌పై వివాదం తేవటం దారుణం. టీడీపీ శక్తులు పాతకాలపు అభిప్రాయాలతో కోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు కోర్టుకు వెళ్లటం మరీ బరితెగించిన విషయం. ప్రభుత్వం చేతికి వచ్చిన భూమిని ఎలా వినియోగించాలో ప్రభుత్వనే నిర్ణయం తీసుకుంటుంది. అసలు కోట్లు ఖర్చు పెట్టి పెద్దపెద్ద లాయర్లను పెట్టుకుని కోర్టులకు వెళ్లటం ఏంటి?. నిజంగా వాళ్లంతా రైతులా?. రియల్ ఎస్టేట్ వ్యాపారులే అలా చేయగలరు అంటూ సజ్జల వ్యాఖ్యానించారు.
మా స్వర్గంలో మేమే ఉండాలి అనే అభిప్రాయంలో టీడీపీ ఉంది. పేదలు కూడా సొంత ఇళ్లతో ఆత్మగౌరవం కల్పించటానికి మేము ప్రయత్నిస్తున్నాం. కానీ, రైతుల పొట్ట కొట్టి వేల కోట్లు దండుకోవాలని వారు చూస్తున్నారు. అసలు ఏ ముఖం పెట్టుకుని పేదల దగ్గర రేపు ఓట్లు అడుగుతారు వాళ్లు.
టీడీపీ నేతల లక్షల కోట్ల బిజినెస్ మీద దెబ్బ తగిలింది. రాజకీయ నేతలుగా కాదు కదా.. కనీసం మనుషులుగా కూడా టీడీపీ వారికి అర్హతలేదు. వాళ్ల నిజ స్వరూపం ఇప్పుడు మళ్ళీ బట్టబయలు అయింది. పేదలను మేము పట్టించుకునేదిలేదనేలాగ ఉంది వాళ్ల వ్యవహారం.
రాష్ట్రంలో తొలిసారిగా కొత్తగా గ్రామాలనే క్రియేట్ చేస్తున్నాం. అందరికీ ఒకచోట స్థలాలు ఇస్తే ఓర్చుకోలేక పోతున్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా వితండవాదం చేస్తున్నారు. టీవీలో చర్చకు మాత్రమే పనికొచ్చేలా వారు మాట్లాడుతున్నారని అన్నారాయన.
పవన్ కల్యాణ్ ఆరోపణలు అర్ధరహితం
సీఎం జగన్ తెచ్చిన పథకాలు ఎవరికి ఉపయోగ పడ్డాయో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తెలుసుకోవాలని సజ్జల హితవు పలికారు. పవన్ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని అన్నారాయన. కరోనా కష్టాలు వచ్చినా కూడా తాను చేయాలనుకున్న సంక్షేమాన్ని పేదల చెంతకు జగన్ తెచ్చారని గుర్తుచేశారాయన. మరోవైపు కమ్యూనిస్టులు కూడా వారి సిద్దాంతం ఏంటో తెలుసుకోవాలన్నారు సజ్జల.
విద్యారంగం మీద ఎంత పెట్టుబడి పెడుతున్నామో తెలుసా?. ఇదంతా పేదలకు ఎంతగా ఉపయోగమో తెలుసుకోవాలి. జీవో నెంబర్ 01 అనేది ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే.. చంద్రబాబు తల ఎక్కడో పెట్టుకోవాలి. కందుకూరు, గుంటూరులో ప్రజల్ని చంపారు. జీవో కాదు.. దీనిమీద ఈసారి చట్టం తెస్తాం. ప్రజలను పరిరక్షించడమే ప్రభుత్వ లక్ష్యం అని సజ్జల ఉద్ఘాటించారు.
చంద్రబాబును ప్రజలు ఏనాడో రాజకీయంగా చెత్తబుట్టలో పడేశారన్న సజ్జల.. రానున్న రోజుల్లో చంద్రబాబు ఇంకా దారుణాలకు పాల్పడతారని, కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment