
పంపిణీ.. పడకే!
* ‘దళితులకు భూపంపిణీ’ లక్ష్య సాధనలో నత్తనడక
* రెండేళ్లలో 3,596 మంది లబ్ధిదారులకు 9,457 ఎకరాలే పంపిణీ
సాక్షి, హైదరాబాద్: దళితులకు భూపంపిణీ. పథకం ఆశయం ఘనం, ఆచరణ అధ్వానం. కొత్త రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకం నత్తనడకన సాగుతోంది. మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతోంది. ఏ ఏడాదికి ఆ ఏడాది నిర్దేశించుకున్న లక్ష్యాలను కూడా సాధించలేకపోతోంది. తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు 2014 ఆగస్టు 15న గోల్కొండ కోట వద్ద నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు 3,596 మంది లబ్ధిదారులకు 9,457.30 ఎకరాలు మాత్రమే పంపిణీ చేయగలిగారు.
ఈ ఏడాది అంతంత మాత్రంగానే...
ఈ పథకం కింద 2016-17లో 3,400 మందికి 10 వేల ఎకరాలు పంపిణీ చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగున్నర నెలలు గడిచినా రెండు వేల ఎకరాల మేర మాత్రమే ఇవ్వగలిగారు. కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అసలు భూపంపిణీకే శ్రీకారం చుట్టలేదు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే కొనుగోలు చేసిన భూమికి పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించకపోవడం, కొన్ని బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉండడం పథకానికి ఆటంకంగా మారాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం నేపథ్యంలో ఈ పథకం కోసం కొనుగోలు చేసే భూముల ధరలను కూడా ఎకరానికి రూ.10 లక్షల వరకు పెంచాలనే విజ్ఞప్తులు కూడా వస్తున్నాయి. కానీ, భూమి తీరును బట్టి రూ.2-7 లక్షల మధ్య ధర పెట్టాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
కొత్త జిల్లాలు, ప్రాజెక్టులతోనూ తిప్పలే..
రాష్ట్రంలో దాదాపుగా అన్ని జిల్లాల్లో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నీటిపారుదల ప్రాజెక్టులు, ఫార్మాసిటీ వంటి వివిధ పరిశ్రమల స్థాపన కోసం భూముల సేకరణ కూడా ఈ పథకానికి ఒక అవాంతరంగా మారుతోంది. దీనితోపాటు దసరాకల్లా మరో 14 జిల్లాలు ఏర్పడనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల రైతులు ఆచితూచి స్పందిస్తున్నారు. కొత్త జిల్లాల స్వరూపం,తమ భూమికి వచ్చే విలువ తదితరాలపై స్పష్టత వచ్చే వరకు వేచి చూడాలని రైతులు భావిస్తున్నారు. కొత్త జిల్లాల ప్రతిపాదనకు ముందు భూములు అమ్మేందుకు సుముఖత చూపిన వారు కూడా ఆ తర్వాత వెనక్కి తగ్గినట్లుగా అధికారవర్గాలు వెల్లడించాయి.