►సీఎం జిల్లా పర్యటన రద్దు
►గోల్కొండ కోటలోనే భూ పంపిణీ
►జిల్లా నుంచి ఐదుగురికే అవకాశం
►జిల్లా కేంద్రంలో మరో పదిమందికి..
ముకరంపుర : పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా జిల్లాలోని 15 మంది లబ్ధిదారులకు మొదటి విడతగా భూ పంపిణీ సరిపెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే జిల్లా నుంచి ఐదుగురిని ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ఆదేశాలందాయి. రాత్రికిరాత్రే లబ్ధిదారులను ఎంపిక చేయాలని వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఉన్నతాధికారులు, ఆర్డీవోలు, తహశీల్దార్లను ఆదేశించారు. మరో 10 మందికి జిల్లాకేంద్రంలోని వేడుకల్లో మంత్రి ఈటెల రాజేందర్ చేతుల మీదుగా పట్టాలు అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రెవెన్యూ డివిజన్‌కు ఒకరు చొప్పున ఐదుగురికి రాజధానిలోని గోల్కొండ కోటలో జరిగే పంద్రాగస్టు వేడుకల్లో పట్టాలందించేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. దీంతో ఆయన జిల్లా పర్యటనపై ఆశలు ఆవిరయ్యాయి. అచ్చొచ్చిన జిల్లా, తాత స్వగ్రామమైన ముస్తాబాద్ మండలం మోహినికుంటలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారని భావించినా.. పర్యటన రద్దుకావడంతో దళితులకు నిరాశే ఎదురైనట్లయ్యింది.
భూ పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం భూములను గుర్తించేందుకు తీవ్ర కసరత్తు చేసింది. ప్రభుత్వ భూములు లేకుంటే ప్రైవేట్ భూములు కొనాలని ఆదేశించడం.. సాగుకు యోగ్యమైన భూములే చూడాలని నిబంధన విధించడంతో భూములు అమ్ముకునేందుకు ఇతర రైతులెవరూ ముందుకు రాలేదు. దీంతో భూ సేకరణ ఇబ్బందిగా మారింది.
ముందుగా మండలానికో గ్రామాన్ని గుర్తించాలని అనుకున్నా.. భూముల కొరతతో నియోజకవర్గానికో గ్రామాన్ని పరిమితం చేశారు. కరీంనగర్, మంథని మినహా అన్ని నియోజకవర్గాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేశారు. గుర్తించిన గ్రామాల్లో 451 ఎకరాలు అవసరం కాగా.. అందుబాటులో మాత్రం 155 ఎకరాలు ఉండడంతో మిగిలిన 296 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేయాలని భావించారు. తాజాగా ఆగమేఘాల మీద లబ్ధిదారుల జాబితా పంపించాలని ఆదేశించడంతో.. ఇన్నాళ్లూ కొలిక్కిరాని ప్రక్రియ ఒక్క రాత్రిలో ఎలా సాధ్యమవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ డివిజన్ల వారీగా ఒక్కో లబ్ధిదారుడిని, మూడెకరాల భూమికి రిజిస్ట్రేషన్ పత్రాలను సిద్ధం చేసే పనిలో ఆయా నియోజకవర్గాల అధికారులు రాత్రంతా బిజీ అయ్యాయి.
ఎంపిక చేసిన గ్రామాలివే..
బెజ్జంకి మండలం పారువెల్ల, ముస్తా బాద్ మండలం మోయినికుంట, జమ్మికుంట మండలం పాతర్లపల్లి, హుస్నాబాద్ మండ లం రేగొండ, వేములవాడ మండలం చెక్క పల్లి, రామగుండం మండలం అక్కెనపల్లి, శ్రీరాంపూర్ మండలం పెద్దరాతపల్లి, ధర్మారం మండలం కానంపల్లి, రాయికల్ మండలం దామన్‌పల్లి, మల్లాపూర్ మండలం అడవి మాదాపూర్, మల్యాల మండలం గొర్రెగుండం గ్రామాలను ఎంపిక చేశారు.
‘15’తో సరి
Published Thu, Aug 14 2014 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 11:50 AM
Advertisement
Advertisement