సాక్షి, అమరావతి : అర్హత గల ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం కేటాయించాలన్నదే సర్కారు ధ్యేయమని, ఇందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉగాది పర్వదినం సందర్భంగా అర్హతగల ప్రతి కుటుంబానికి నివాస స్థల పట్టా అందించాలని సూచించారు. బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని ఎన్ని కుటుంబాలకు ఇల్లు, ఇంటి జాగా లేదో పరిశీలించి అర్హులను ఖరారు చేయాలన్నారు. వారందరికీ నివాస స్థలాలు ఇవ్వడానికి ఎంత భూమి అవసరం అవుతుందో.. ప్రభుత్వ భూమి ఎంత అందుబాటులో ఉందో అంచనా వేయాలని ఆదేశించారు.
ఎలాంటి లోపాలు లేకుండా అత్యంత కచ్చితత్వంతో సమగ్ర భూ సర్వేకు ఆధునిక పరికరాలు వినియోగించాలని చెప్పారు. భూ వివాదాల కట్టడి, భూ రికార్డుల మ్యుటేషన్, భూ యజమానులకు శాశ్వత భూ హక్కుల కల్పన కోసం అత్యంత కచ్చితత్వంతో భూములు రీసర్వే చేయాలని ఆదేశించారు. ఉగాదికి నెల రోజుల ముందే భూమిని సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. గ్రామాల్లో 20,800 ఎకరాలు, పట్టణ ప్రాంతాల్లో 2,580 ఎకరాలు అందుబాటులో ఉందని, ఇందులో ఎంత భూమి ఇళ్ల స్థలాలకు అనువైనదో నిర్ధారించే కార్యక్రమం చేపట్టామని వివరించారు. గ్రామాల్లో దాదాపు 14.06 లక్షల మంది, పట్టణాల్లో 12.69 లక్షల మంది ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇందులో 15.75 లక్షల మందికి భూమిని సమకూర్చాల్సి ఉందన్నారు.
లోపరహితంగా భూ రీసర్వే
ఇప్పటి వరకు అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే వినియోగిస్తున్న కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్ (సీఓఆర్‌ఎస్.. కార్స్) టెక్నాలజీని దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రం భూముల రీసర్వేకి వినియోగించనున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతి చదరపు కిలోమీటర్‌కు రూ.1.10 లక్షలు ఖర్చవుతుందని, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, గ్రీస్ దేశాల్లో కార్స్ ద్వారా రోవర్స్‌తో ఉపగ్రహ సేవలను వినియోగించుకుని సర్వే చేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు దేశంలో మొదటిసారి మనం ఖర్చుకు వెనకాడకుండా ఈ విధానంతో సర్వేకు సన్నద్ధమవుతున్నామన్నారు.
రూ.300 కోట్లతో పరికరాల కొనుగోలు
రాష్ట్రంలో 670 మండలాల పరిధిలోని 17,460 రెవెన్యూ గ్రామాల్లో 2.36 లక్షల మందికి చెందిన 1.22 లక్షల చదరపు కిలోమీటర్లలో భూములను రీసర్వే చేయడానికి రూ.1,688 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని అధికారులు చెప్పారు. రూ.300 కోట్లతో పరికరాలు కొనుగోలు చేస్తున్నామన్నారు. ‘1880 – 1930 మధ్య తొలిసారి రైత్వారీ గ్రామాలపై రికార్డులు రూపొందించారు. 1960 – 80 మధ్య మరోసారి సెటిల్‌మెంట్ గ్రామాలపై రికార్డులు రూపొందించారు. ప్రస్తుతం అన్ని భూ సమస్యల పరిష్కారానికి రీసర్వేనే మార్గం. అందుకే 75 బేస్ స్టేషన్లు, 3,440 రోవర్స్, ఒక కంట్రోల్ సెంటర్, 1,850 లాప్‌టాప్స్, 700 డెస్క్ టాప్స్ వినియోగించి ఒకేసారి మూడు వేల గ్రామాల్లో రీసర్వే చేపడతాం. అన్ని శాఖలకు ఉపయోగపడేలా డేటా పక్కాగా ఉంటుంది. మూడు విడతల్లో రెండున్నరేళ్లలో సర్వే పూర్తి చేస్తాం’ అని అధికారులు సీఎంకి వివరించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్, సర్వే సెటిల్‌మెంట్ డైరెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment