Home Place
-
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం
సాక్షి, అమరావతి : అర్హత గల ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం కేటాయించాలన్నదే సర్కారు ధ్యేయమని, ఇందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉగాది పర్వదినం సందర్భంగా అర్హతగల ప్రతి కుటుంబానికి నివాస స్థల పట్టా అందించాలని సూచించారు. బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని ఎన్ని కుటుంబాలకు ఇల్లు, ఇంటి జాగా లేదో పరిశీలించి అర్హులను ఖరారు చేయాలన్నారు. వారందరికీ నివాస స్థలాలు ఇవ్వడానికి ఎంత భూమి అవసరం అవుతుందో.. ప్రభుత్వ భూమి ఎంత అందుబాటులో ఉందో అంచనా వేయాలని ఆదేశించారు. ఎలాంటి లోపాలు లేకుండా అత్యంత కచ్చితత్వంతో సమగ్ర భూ సర్వేకు ఆధునిక పరికరాలు వినియోగించాలని చెప్పారు. భూ వివాదాల కట్టడి, భూ రికార్డుల మ్యుటేషన్, భూ యజమానులకు శాశ్వత భూ హక్కుల కల్పన కోసం అత్యంత కచ్చితత్వంతో భూములు రీసర్వే చేయాలని ఆదేశించారు. ఉగాదికి నెల రోజుల ముందే భూమిని సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. గ్రామాల్లో 20,800 ఎకరాలు, పట్టణ ప్రాంతాల్లో 2,580 ఎకరాలు అందుబాటులో ఉందని, ఇందులో ఎంత భూమి ఇళ్ల స్థలాలకు అనువైనదో నిర్ధారించే కార్యక్రమం చేపట్టామని వివరించారు. గ్రామాల్లో దాదాపు 14.06 లక్షల మంది, పట్టణాల్లో 12.69 లక్షల మంది ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇందులో 15.75 లక్షల మందికి భూమిని సమకూర్చాల్సి ఉందన్నారు. లోపరహితంగా భూ రీసర్వే ఇప్పటి వరకు అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే వినియోగిస్తున్న కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్ (సీఓఆర్ఎస్.. కార్స్) టెక్నాలజీని దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రం భూముల రీసర్వేకి వినియోగించనున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతి చదరపు కిలోమీటర్‌కు రూ.1.10 లక్షలు ఖర్చవుతుందని, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, గ్రీస్ దేశాల్లో కార్స్ ద్వారా రోవర్స్‌తో ఉపగ్రహ సేవలను వినియోగించుకుని సర్వే చేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు దేశంలో మొదటిసారి మనం ఖర్చుకు వెనకాడకుండా ఈ విధానంతో సర్వేకు సన్నద్ధమవుతున్నామన్నారు. రూ.300 కోట్లతో పరికరాల కొనుగోలు రాష్ట్రంలో 670 మండలాల పరిధిలోని 17,460 రెవెన్యూ గ్రామాల్లో 2.36 లక్షల మందికి చెందిన 1.22 లక్షల చదరపు కిలోమీటర్లలో భూములను రీసర్వే చేయడానికి రూ.1,688 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని అధికారులు చెప్పారు. రూ.300 కోట్లతో పరికరాలు కొనుగోలు చేస్తున్నామన్నారు. ‘1880 – 1930 మధ్య తొలిసారి రైత్వారీ గ్రామాలపై రికార్డులు రూపొందించారు. 1960 – 80 మధ్య మరోసారి సెటిల్మెంట్ గ్రామాలపై రికార్డులు రూపొందించారు. ప్రస్తుతం అన్ని భూ సమస్యల పరిష్కారానికి రీసర్వేనే మార్గం. అందుకే 75 బేస్ స్టేషన్లు, 3,440 రోవర్స్, ఒక కంట్రోల్ సెంటర్, 1,850 లాప్టాప్స్, 700 డెస్క్ టాప్స్ వినియోగించి ఒకేసారి మూడు వేల గ్రామాల్లో రీసర్వే చేపడతాం. అన్ని శాఖలకు ఉపయోగపడేలా డేటా పక్కాగా ఉంటుంది. మూడు విడతల్లో రెండున్నరేళ్లలో సర్వే పూర్తి చేస్తాం’ అని అధికారులు సీఎంకి వివరించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్సింగ్, సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇంటిస్థలం కోసం గొడ్డళ్లతో దాడి
ఇంటి స్థలం విషయంలో జరిగిన వాగ్వాదం తీవ్రంగా మారి పరస్పరం ఇరువర్గాల వారు గొడ్డళ్లతో దాడి చేసుకున్నారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధర్మవరంలో సోమవారం వెలుగుచూసింది. గ్రామంలోని ఓ ఇంటి స్థలానికి చెందిన అంశంలో గత కొన్ని రోజులుగా ఇరువర్గాల మధ్య గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో ఈ రోజు ఇరువర్గాల వారు గొడ్డళ్లతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కారుణ్య నియామకాలకు గ్రీన్‌సిగ్నల్
* ఒక బాధిత కుటుంబం గోడు విని చలించిన సీఎం కేసీఆర్ * పెద్ద దిక్కును కోల్పోయినవారి పరిస్థితి దయనీయం * వారిని ఏళ్ల తరబడి తిప్పుకోవడం సరికాదు * పరిహారం, ఉద్యోగం, ఇంటి స్థలం.. ఏది వర్తిస్తే అది అందజేయండి * వెంటనే జాబితాలు సిద్ధం చేయండి * అర్హులైన వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: కారుణ్య నియామకాల విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని, బాధిత కుటుంబాల్లోని అర్హులకు వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. కొన్నేళ్ల కింద వరంగల్ జిల్లాలో జరిగిన నక్సల్స్ దాడి ఘటనలో ఒక కానిస్టేబుల్ సోదరుడు మరణించాడు. అప్పటి ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని మాటిచ్చినా... ఇప్పటికీ కనీసం పరిహారం కూడా అందలేదు. దిక్కూమొక్కూ లేని ఆ కుటుంబం ఇటీవల సీఎం కేసీఆర్‌ను కలసి తమ గోడు వెళ్లబోసుకుంది. దీనిపై స్పందించిన సీఎం... బాధిత కుటుంబానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏమేం వర్తిస్తాయో అవన్నీ వెంటనే అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి బాధిత కుటుంబాలు ఉన్నాయనే అంశం చర్చకు వచ్చింది. దానిపై స్పందించిన సీఎం.. అలాంటి వారందరికీ వెంటనే సాయం చేయాల్సిందిగా సూచించారు. ‘‘పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి ఇవ్వాల్సిన లబ్ధి ఏమైనా ఉంటే.. ఎప్పుడైనా ఇవ్వక తప్పదు. అలాంటప్పుడు మీనమేషాలు లెక్కించడమెందుకు..? పరిహారం, ఉద్యోగ అవకాశం, ఇంటి స్థలం.. వారికేది వర్తిస్తే అది వెంటనే అందజేసి ఆ కుటుంబానికి అండగా ఉండాలి. వారిని ఏళ్ల తరబడి తిప్పుకొంటే ప్రయోజనమేంటి?..’’ అని సీఎం కేసీఆర్ సీఎంవో అధికారులతో పేర్కొన్నారు. వెంటనే జిల్లాల వారీగా, శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాల జాబితాను తెప్పించాలని ఆదేశించారు. వెంటనే వాటిని ఎక్కడెక్కడ భర్తీ చేసే వీలుందో కసరత్తు చేయాలని సూచించారు. బాధిత కుటుంబీకుల్లో అర్హులైన వారికి వీలైనంత తొందరగా పోస్టింగ్‌లు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. దీంతో పాటు అసాంఘిక శక్తుల దాడుల్లో చనిపోయినవారి కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సాయం, పరిహారం వంటి అంశాలు పెండింగ్‌లో పెట్టకుండా చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. 1,500 మంది ఎదురుచూపులు మావోయిస్టులు, ఉగ్రవాదుల దాడుల్లో చని పోయిన వారి కుటుంబాలు, విధి నిర్వహణలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలు ప్రతి జిల్లాలో ఉన్నాయి. పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబాలను ఆదుకునేందుకు.. ఆ కుటుంబంలో అర్హతలున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే కారుణ్య నియామక విధానం అమల్లో ఉంది. కానీ ఏ శాఖలో ఉద్యోగి చనిపోయినా.. అదే శాఖలో ఉద్యోగం ఇవ్వాలని, రోస్టర్ పాయింట్ ప్రకారం ఖాళీ ఉంటేనే ఉద్యోగావకాశం కల్పించాలనే నిబంధనలు ప్రతిబంధకంగా మారాయి. దీంతో ప్రతి జిల్లాలో కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్నవారి సంఖ్య వందల్లోకి చేరింది. ఖాళీలు, స్పష్టమైన నిబంధనలు లేకపోవడం వంటి కారణాలతో.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విభాగాల పరిధిలో దాదాపు 1,500 మందికిపైగా కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్నట్లు అంచనా. కారుణ్య నియామకాలపై ముఖ్యమంత్రి స్పందించిన తీరు బాధిత కుటుంబాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. -
కుచ్చుటోపి..!
ఎవరికైనా ఇంటి స్థలం కొనుక్కోవాలనే ఆశ ఉంటుంది... కానీ ఏ పూటకు ఆ పూట శ్రమించే వారికి అది తీరని కోరిక... ఖర్చు తగ్గించుకోనైనా సరే నెలకు కొంత చెల్లించే పద్ధతి ఉంటే వారికి సులువు. ఐదేళ్లయినా ఇంటిస్థలం చేతికొస్తుందంటే కాయ కష్టం చేసైనా సరే... ఓ ప్లాటు దక్కించుకోవాలని ఉంటుంది. సరిగ్గా ఇలాంటి జనం ఆశలను సొమ్ము చేసుకునేందుకు అప్పట్లో ఎం దరో ‘రియల్ ఎస్టేట్’ వ్యాపారులు రంగంలోకి దిగారు. ఆటోడ్రైవర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, దినసరి కూలీలు.. ఇలా సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాయిదాల పద్ధతిలో ప్లాట్లు కొనేందుకు వచ్చి ఈ ‘రియల్’ వ్యాపారుల ఉచ్చులో పడ్డారు. నిజామాబాద్ నగరంలో 2008లో రియల్టర్లు ఓ దేవుడి పేరిట సంస్థను నెలకొల్పారు. 2031 మందిని సభ్యులుగా చేర్చుకున్నారు. వారి వద్ద నెలకు రూ.375 చొప్పున వసూలు చేసి.. మొహం చాటేశారు. ఏడేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ప్లాట్లు చూపడం లేదు. ఏడాది క్రితం తమకు ప్లాట్లు కావాలని బాధితులు గొడవ చేయడంతో నిజామాబాద్ బైపాస్‌రోడ్డును అనుకుని దుబ్బ సమీపంలో ఉన్న భూమిని చూపిన సంస్థ నిర్వాహకులు.. ఆ తర్వాత అందులో అసైన్డ్ భూమి ఉందని దాటవేశారు. ఇప్పటికీ ఈ వివాదం కొలిక్కి రాలేదు. సుమారు రూ.2.50 కోట్లకు పైగా సాగిన వసూళ్ల పర్వంలో జిల్లా రైసుమిలర్ల సంక్షేమ సంఘం నేత ఒకరు కీలకంగా వ్యవహరించగా.. బాధితులంతా కొత్త కలెక్టర్ యోగితా రాణాను కలిసేందుకు సిద్ధమవుతుండడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్లాట్ల పేరిట స్కీం, మోసం నిజామాబాద్ రైస్‌మిల్లర్ల సంక్షేమ సంఘానికి చెందిన ఓ ముఖ్యనాయకుడు, మరో నలుగురు కలిసి 2008లో ‘అతి తక్కువ ధరకే ప్లాట్ల విక్రయాలు’ అన్న నినాదానికి తెర లేపారు. దుబ్బలోని బైపాస్‌రోడ్డు పక్కన నాలుగు ఎకరాల స్థలాన్ని ప్లాట్లుగా మార్చి విక్రయానికి పెట్టారు. ందుకోసం ప్రత్యేక స్కీం ఏర్పాటు చేశారు. ప్రతి నెలా రూ. 375 చెల్లించాలని నిర్ణయించారు. నగరంలోని కొందరు, జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన వారు ఈ స్కీంలో చేర్పించారు. సుమారు వెయ్యి మంది ప్రతి నెలా రూ.375 రూపాయలు చెల్లిస్తూ వస్తున్నారు. 2008 నుంచి నేటి వరకూ ఈ చెల్లింపులు కొనసాగుతున్నారుు. తీరా ప్లాట్ల విషయానికి వచ్చే సరికి ఈ సంస్థ నిర్వాహకులు చేతులెత్తేశారు. ఈ భూమిలో అసైన్మెంట్ ల్యాండ్ ఉందని.. సెటిల్మెంట్ అయిన తరువాత ప్లాట్లు అందజేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్లాట్లు కావాలని బాధితులు మొరపెట్టుకోగా.. తమకేమి తెలియదంటూ నిర్వాహకులు చేతులెత్తేశారు. దుబ్బకు చెందిన ఓ వ్యక్తి తమకు న్యాయం చేయాలంటూ గతంలో కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. సుమారు ఏడు సంవత్సరాల నుంచి సామాన్యుల వద్ద రూ.2.50 కోట్లు వసూలు చేసినట్లు అంచనా. ప్లాట్లు ఇవ్వమని బాధితులు అడిగితే మొన్నటివరకు అప్పుడు.. ఇప్పుడు అంటూ కాలం వెళ్లదీసిన రియల్టర్లు.. తాజాగా తమకేమి తెలియదని చెప్పుకొస్తున్నారు. ఈ స్కీంలో ముఖ్యనాయకుడైన సదరు రైస్‌మిల్ అసోసియేషన్ నాయకుడు మాత్రం తమను బెదిరింపులకు గురి చేస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు దీనిపై విచారణ జరిపితే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఒక్కటవుతున్న బాధితులు.. ప్లాట్ల విక్రయాల పేరిట సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ధరలను నిర్ణయించి నెలనెలా వాయిదాల పద్ధతిలో కొనసాగిన వసూళ్ల పర్వంపై బాధితులు ఏకమవుతున్నారు. నందిపేట, మోర్తాడ్, కమ్మర్పల్లి, డిచ్పల్లి, నిజామాబాద్ నగరం, నగర శివారు గ్రామాలకు చెందిన పలువురు 14 తర్వాత కొత్త కలెక్టర్ యోగితారాణాను కలిసి తమ గోడును వెళ్లబోసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం బాధితులు నిజామాబాద్‌లో సమావేశమైనట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న నిర్వాహకులు కొందరిని పిలిచి మాట్లాడినట్లు చెప్తుండగా.. మరికొందరికీ డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. సుమారు ఏడేళ్ల కిందట మొదలైన ఈ ఘరానా మోసం ఇంకా కొనసాగుతున్నా.. బాధితులకు మాత్రం ప్లాట్లు, పట్టాలు ఇవ్వడం లేదు. అత్యధికంగా ఆటోడ్రైవర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, దినసరి కూలీలు తదితర అమాయకులైన ప్రజల నుంచి జిల్లా కేంద్రంలో ప్లాట్ల విక్రయాల పేరిట ప్రతినెలా డబ్బులు వసూలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.