కారుణ్య నియామకాలకు గ్రీన్‌సిగ్నల్
* ఒక బాధిత కుటుంబం గోడు విని చలించిన సీఎం కేసీఆర్
* పెద్ద దిక్కును కోల్పోయినవారి పరిస్థితి దయనీయం
* వారిని ఏళ్ల తరబడి తిప్పుకోవడం సరికాదు
* పరిహారం, ఉద్యోగం, ఇంటి స్థలం.. ఏది వర్తిస్తే అది అందజేయండి
* వెంటనే జాబితాలు సిద్ధం చేయండి
* అర్హులైన వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: కారుణ్య నియామకాల విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని, బాధిత కుటుంబాల్లోని అర్హులకు వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.
కొన్నేళ్ల కింద వరంగల్ జిల్లాలో జరిగిన నక్సల్స్ దాడి ఘటనలో ఒక కానిస్టేబుల్ సోదరుడు మరణించాడు. అప్పటి ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని మాటిచ్చినా... ఇప్పటికీ కనీసం పరిహారం కూడా అందలేదు. దిక్కూమొక్కూ లేని ఆ కుటుంబం ఇటీవల సీఎం కేసీఆర్‌ను కలసి తమ గోడు వెళ్లబోసుకుంది. దీనిపై స్పందించిన సీఎం... బాధిత కుటుంబానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏమేం వర్తిస్తాయో అవన్నీ వెంటనే అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి బాధిత కుటుంబాలు ఉన్నాయనే అంశం చర్చకు వచ్చింది. దానిపై స్పందించిన సీఎం.. అలాంటి వారందరికీ వెంటనే సాయం చేయాల్సిందిగా సూచించారు. ‘‘పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి ఇవ్వాల్సిన లబ్ధి ఏమైనా ఉంటే.. ఎప్పుడైనా ఇవ్వక తప్పదు. అలాంటప్పుడు మీనమేషాలు లెక్కించడమెందుకు..? పరిహారం, ఉద్యోగ అవకాశం, ఇంటి స్థలం.. వారికేది వర్తిస్తే అది వెంటనే అందజేసి ఆ కుటుంబానికి అండగా ఉండాలి.
వారిని ఏళ్ల తరబడి తిప్పుకొంటే ప్రయోజనమేంటి?..’’ అని సీఎం కేసీఆర్ సీఎంవో అధికారులతో పేర్కొన్నారు. వెంటనే జిల్లాల వారీగా, శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాల జాబితాను తెప్పించాలని ఆదేశించారు. వెంటనే వాటిని ఎక్కడెక్కడ భర్తీ చేసే వీలుందో కసరత్తు చేయాలని సూచించారు. బాధిత కుటుంబీకుల్లో అర్హులైన వారికి వీలైనంత తొందరగా పోస్టింగ్‌లు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. దీంతో పాటు అసాంఘిక శక్తుల దాడుల్లో చనిపోయినవారి కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సాయం, పరిహారం వంటి అంశాలు పెండింగ్‌లో పెట్టకుండా చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు.
1,500 మంది ఎదురుచూపులు
మావోయిస్టులు, ఉగ్రవాదుల దాడుల్లో చని పోయిన వారి కుటుంబాలు, విధి నిర్వహణలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలు ప్రతి జిల్లాలో ఉన్నాయి. పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబాలను ఆదుకునేందుకు.. ఆ కుటుంబంలో అర్హతలున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే కారుణ్య నియామక విధానం అమల్లో ఉంది. కానీ ఏ శాఖలో ఉద్యోగి చనిపోయినా.. అదే శాఖలో ఉద్యోగం ఇవ్వాలని, రోస్టర్ పాయింట్ ప్రకారం ఖాళీ ఉంటేనే ఉద్యోగావకాశం కల్పించాలనే నిబంధనలు ప్రతిబంధకంగా మారాయి.
దీంతో ప్రతి జిల్లాలో కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్నవారి సంఖ్య వందల్లోకి చేరింది. ఖాళీలు, స్పష్టమైన నిబంధనలు లేకపోవడం వంటి కారణాలతో.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విభాగాల పరిధిలో దాదాపు 1,500 మందికిపైగా కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్నట్లు అంచనా. కారుణ్య నియామకాలపై ముఖ్యమంత్రి స్పందించిన తీరు బాధిత కుటుంబాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.