అసైన్డ్.. అక్రమాల పుట్ట | Assigned lands, the government has focused on | Sakshi
Sakshi News home page

అసైన్డ్.. అక్రమాల పుట్ట

Published Mon, Jun 6 2016 2:34 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM

అసైన్డ్.. అక్రమాల పుట్ట

అసైన్డ్.. అక్రమాల పుట్ట

జిల్లాలో 4.47 లక్షల ఎకరాలు
బడాబాబుల అధీనంలో నిరుపేదల భూములు
చెరబట్టిన నేతలు, రియల్టర్లు, బడా కాంట్రాక్టర్లు
అసైన్డ్ భూములపై దృష్టి సారించిన సర్కారు

 
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :
అసైన్డ్ భూముల అక్రమాల పుట్ట పగలనుంది. భూమిలేని నిరుపేదలు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం పంపిణీ చేసిన ఈ భూములు చాలా మట్టుకు చేతులు మారాయి. ముఖ్యంగా పట్టణ పరిసర గ్రామాల్లోని రూ.కోట్లు విలువ చేసే ఈ భూములన్నీ బడాబాబుల అధీనంలోకి వెళ్లిపోయాయి. నేతలు, రియల్టర్లు, బడా కాంట్రాక్టర్లు నయానో భయానో ఈ భూములను కొనుగోలు చేసి కోట్లకు పడగలెత్తారు. అన్యాక్రాంతమైన ఈ భూములను చెరబట్టిన వారిపై తాజాగా ప్రభుత్వం దృష్టి సారించడంతో బడాబాబుల భూ బాగోతం వెలుగులోకి రానుంది.

నిరుపేదల సాగు కోసం పంపిణీ చేసిన ఈ అసైన్డ్ భూములు ఎవరి అధీనంలో ఉన్నాయి.. వాటిని సాగు చేసుకుంటున్న వారెందరు.. విక్రయాలు జరిగాయా..? లేదా వారి వారసులు సాగు చేసుకుంటున్నారా..? ఇలా ఈ భూముల వెరిఫికేషన్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా రెవెన్యూ అధికారులు ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌తో జరిగిన కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల సదస్సులో ఇది ప్రధాన అంశంగా చర్చ జరిగింది.


 పలువిడతల్లో భూ పంపిణీ
జిల్లాలో ఇప్పటి వరకు ప్రభుత్వం సుమారు 4.47 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని నిరుపేదలకు పంపిణీ చేసింది. 1.44 లక్షల మంది భూమిలేని కూలీలకు అసైన్డ్ చేసింది. ఇందులో సగానికిపైగా భూములు చేతులు మారాయి. అసైన్డ్ నిబంధనలకు విరుద్ధంగా ఈ భూములు ఇతరులకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భైంసా, బెల్లంపల్లి, మందమర్రి, కాగజ్‌నగర్ వంటి పట్టణాల సమీపంలోని అసైన్డ్ భూములన్నీ రియల్టర్లు, నేతలు, కాంట్రాక్టర్లు కొనుగోలు చేశారు. నయానో భయానో నిరుపేదలను బెదిరించి, నిబందనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు.

ఇందుకు చాలా చోట్ల రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో చేతులు కలిపి అసైన్డ్ చట్టానికి విరుద్ధంగా భూముల దందా కొనసాగింది. కేవలం పట్టణాల సమీపంలోని భూములే కాదు, తాండూరు, రెబ్బెన, ఖనాపూర్ వంటి మండల కేంద్రాల పరిసరాల్లోని అసైన్డ్ భూములు కూడా పరాధీనమయ్యాయి. ముఖ్యంగా పట్టణాల సమీపంలోని అసైన్డ్ భూములన్నీ రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా మారాయి. అసైన్డ్‌దారులను నయానో భయానో మభ్యపెట్టి తక్కువ ధరకు కొనుగోలు చేసిన రియల్టర్లు, వాటి ప్లాట్లుగా చేసి రూ.కోట్లు దండుకున్నారు. తీరా ఇప్పుడు ప్రభుత్వం ఈ అసైన్డ్ భూముల రికార్డుల దుమ్ము దులుపుతుండటంతో ఈ అసైన్డ్‌భూముల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారుకానుంది.


 పట్టణాల్లోనే అక్రమాలు..
 ముఖ్యంగా ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని మావల, బట్టిసావర్‌గాం వంటి గ్రామాల్లో వందలాది ఎకరాల్లో అసైన్డ్ భూములు వివిధ పార్టీల నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. చాలా మట్టుకు ప్లాట్లుగా చేసి, రూ.కోట్లు దండుకున్నారు. ఈ భూములు చాలా మట్టుకు చేతులు మారాయి. నిర్మల్ పట్టణ సమీపంలోని గ్రామాల పరిధిలోని భూముల్లో పలు రియల్‌వెంచర్లు వెలిశాయి. తూర్పు జిల్లా కేంద్రంగా పేరున్న మంచిర్యాలలో ఈ అసైన్డ్ భూముల దందా మూడు వెంచర్లు.. ఆరు ఎకరాలు అన్న చందంగా మారాయి. అసైన్డ్ భూముల్లో ప్లాట్ల దందా ఇప్పటికీ కొనసాగుతోంది. నస్పూర్ పంచాయతీ పరిధిలోనైతే రూ.కోట్లు విలువ చేసే అసైన్డ్‌భూములు పరాధీనంలో ఉన్నాయి. అలాగే మంచిర్యాల సమీపంలోని మందమర్రి మండల పరిధిలోకి వచ్చే గద్దెరాగడి, క్యాతన్‌పల్లి గ్రామాల పరిధిలోని అసైన్డ్ భూములు కూడా రియల్‌ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ఉన్నాయి. మంచిర్యాల టౌన్, వేంపల్లి, హాజీపూర్, ముల్కల్ల, పాత మంచిర్యాల, గుడిపేట్, దొనబండల్లో చాలాచోట్ల అసైన్డ్ భూములు రియల్‌ఎస్టేట్ ప్లాట్లుగా మారాయి. ఈ వెంచర్లలో వివిధ పార్టీల నేతలే భాగస్వాములుగా ఉండటంతో ప్రభుత్వం తలపెట్టిన చర్యలు ఏ మేరకు ఫలితాలనిస్తాయో ప్రశ్నార్థకంగా మారనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement