సాక్షి, హైదరాబాద్: అసైన్డ్ భూములను సద్వినియోగం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఆక్రమణకు గురైన అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 25 లక్షల ఎకరాలను ప్రభుత్వం పేదలకు అసైన్ చేసింది. కానీ ఈ భూముల్లో చాలావరకు ఉపయోగపడటం లేదని, అసైన్‌దారులకు బదులుగా ఆ భూములన్నీ ఇతరుల చేతుల్లోకి వెళ్లాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో అసైన్డ్ భూముల వివరాలను సేకరించేందుకు దృష్టి సారించింది.
అసైన్‌దారుల వద్దే భూమి ఉందా? ఆ భూమిలో వ్యవసాయం చేస్తున్నారా? అసలు ఆ భూమి ఎక్కడుంది? ఎంత ఉంది.. అనే వివరాలన్నీ జూన్ 30లోగా సేకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇదివరకే ఆదేశాలు జారీ చేశారు. ఈ వివరాలన్నీ అందుబాటులోకి వస్తే ఇతరుల చేతుల్లోకి వెళ్లిన భూమిని స్వాధీనం చేసుకొని తిరిగి అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. అసైన్‌దారులు సాగులో ఉంటే వారు వ్యవసాయం చేసుకునేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా పెట్టుబడి సాయం అందించాలని సీఎం ఇప్పటికే సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అన్ని జిల్లాల్లో రెవెన్యూ యంత్రాంగం అసైన్డ్ భూముల వివరాల సేకరణలో నిమగ్నమైంది. కాగా, దాదాపు 70 % భూములు అసైన్‌దారుల చేతిలో లేవని పలు జిల్లాల్లో చేపట్టిన సర్వేలతో తేలింది.
నెరవేరని లక్ష్యం..
సాగుకు పనికి రాని భూమిని, రాళ్లు రప్పలతో కూడిన భూమిని పంపిణీ చేయటంతో ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరలేదు. ఈ నేపథ్యంలో అసైన్డ్ భూములను సద్వినియోగం చేసేందుకు క్రమబద్ధీకరించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అసైన్డ్ భూముల్లో అసలైన లబ్ధిదారులు లేకున్నా.. అర్హులైన నిరుపేదలు ఉంటే వారికే ఆ భూములు అప్పగించాలని యోచిస్తోంది. ఎస్సీ లబ్ధిదారుల భూములు ఎస్సీలు, ఎస్టీల చేతుల్లో ఉంటేనే క్రమబద్ధీకరించాలని, బీసీలు, ఓసీల చేతుల్లో ఉంటే వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆలోచన చేస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు, పాఠశాలలు అసైన్డ్ భూముల్లో ఉంటే క్రమబద్ధీకరించి.. వాటిని అసైన్డ్ భూముల జాబితాల నుంచి తొలగించాలని నిర్ణయించింది. జిల్లాల వారీగా అసైన్డ్ భూముల వివరాలన్నీ వచ్చాక ఏమేం చర్యలు చేపడితే.. ఈ భూములు వినియోగంలోకి వస్తాయనే కోణంలో తుది నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ!
Published Thu, Jun 30 2016 5:00 AM | Last Updated on Mon, Sep 4 2017 3:43 AM
Advertisement
Advertisement