అసైన్డ్ లెక్కెంతా?
► అసైన్డ్‌భూములపై సర్వే
► ఆక్రమణదారులకు నోటీసులు జారీ
► జిల్లావ్యాప్తంగా 1.88 లక్షల ఎకరాలు పంపిణీ
► అందులో సగానికిపైగా అన్యాక్రాంతం
► నిరుపేదలకే దక్కాలని ప్రభుత్వ నిర్ణయం
► సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
ముకరంపుర : ‘రాష్ట్రంలో చాలావరకు అసైన్డ్‌భూములు అన్యాక్రాంతమయ్యాయి. వాటిని తిరిగి నిరుపేదలకే అప్పగించాలి..లేదా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.. అసైన్డ్‌భూముల వివరాలను జూన్ 30లోగా సేకరించాలి.. అసైన్డ్‌దారులే కాస్తు చేసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా వ్యవసాయం చేసుకునేందుకు ఆర్థిక సాయమందిస్తాం.. లేకుంటే తిరిగి పేదలకు పంపిణీ చేద్దాం’ ఇటీవల కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలివి.. జిల్లాలో అసైన్డ్ భూముల లెక్క తేల్చేం దుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. భూమిలేని పేదలకు పంపిణీచేసిన భూములు చేతులు మారడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనిపై పూర్తిస్థాయిలో సర్వేచేసి అన్యాక్రాంతమైన వాటిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. ఆ భూములను సొంతదారులకు(అసైన్డ్‌దారులకు), నిరుపేదలకు సొంతం చేయాలనడంతో అధికార యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. ఆక్రమణదారులకు నోటీసులు జారీచేస్తుండడంతో వారి గుండెల్లో గుబులు మొదలైంది.
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం వివిధ సందర్భాల్లో 1,88,464 ఎకరాలను లక్షా 39వేల మంది నిరుపేదలకు పంపిణీ చేసింది. ఈ భూముల చిట్టాను సేకరించేందుకు జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో సర్వేను వేగవంతంచేస్తోంది. అసైన్డ్ భూముల విషయంలో భూములు చూపించారా?.. అసైన్డ్ చేసిన వారే అనుభవిస్తున్నారా? లేక వేరే వారున్నారా?.. వేరే వారు ఉంటే వారి పరిస్థితి ఏంటి? అసైన్డ్ భూమి సాగులో ఉందా? లేకుంటే సాగుకు తీసుకోవాల్సిన చర్యలపై తహసీల్దార్లనుంచి కలెక్టర్ నీతూప్రసాద్ నివేదిక కోరారు. జిల్లాలో పంపిణీచేసిన అసైన్డ్‌భూములను సాగు యోగ్యంగా మలుచుకునేందుకు ప్రభుత్వం రుణాలూ మంజూరుచేసింది.
లబ్ధిదారుల ఆర్థికావసరాలు, భూముల విలువలు విపరీతంగా పెరగడంతో సగానికిపైగా ఇతరులకు విక్రయించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి పీవోటీ చట్టంప్రకారం అసైన్డ్ భూముల అమ్మకం, కొనుగోలు చేయరాదు. అయినా లోపాయికారీ ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లతో భూముల క్రయవిక్రయాలు భారీగానే జరిగాయి. అయితే జిల్లా రెవెన్యూయంత్రాంగం ఎంతమేర అన్యాక్రాంతమైందో ప్రాథమికంగా అంచనా గుర్తించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
నోటీసులు జారీ షురూ..
తాజాగా సర్కార్ ఆదేశాలతో అసైన్డ్ భూములను అక్రమంగా కలిగిన్న వారికి లావోణీ భూముల నిషేధం రూల్స్ 2007 కింద నోటీసులు జారీచేస్తున్నారు. ఆ భూములను ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోరాదో సమాధానం కోరుతున్నారు. క్రయవిక్రయాల్లో క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోకపోవడం, రిజిస్ట్రేషన్లలో చేతివాటంతో చాలావరకు భూములు అమ్ముకున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. కొన్ని భూమాఫియా చేతుల్లోకి వెళ్లగా.. మరికొన్ని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకోవడానికి కొనుగోలు చేశారు. రాళ్లురప్పలతో చాలావరకు సాగుయోగ్యం లేనివి పూర్తిగా అమ్ముకున్నారు. పట్టణప్రాంతాల్లో మాత్రం ఈ అసైన్డ్‌భూముల్లో నిర్మాణాలు చేసుకున్నారు. ఈ నిర్మాణాలను తొలగిస్తారా? క్రమబద్ధీకరిస్తారా? అనే విషయాలపై స్పష్టతలేదు.
అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకుని సొంతదారులకు అప్పగించాలని, లేనిపక్షంలో పీవోటీ చట్టం ప్రకారం వెనక్కి తీసుకోవాలని సర్కార్ నిర్ణయించింది. 2008లో అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం 1958 నుంచి 2008 ఫిబ్రవరి 8 వరకు అసైన్డ్‌భూములు వేరేవ్యక్తి కొంటే సదరు కుటుంబం నిరుపేదలైతే వారికే వర్తింపజేసేలా చట్టం తీసుకొచ్చారు. ఈక్రమంలో విక్రయాలు జరిగిన భూముల్లో నిరుపేదలే సాగు చేసుకుంటే వారి కుటుంబ పరిస్థితులు విచారించి వారికే అప్పగించనున్నారు. అసైన్డ్‌దారులు ఆ భూముల్లో వ్యవసాయం చేసుకునేందుకు బీసీ ఎస్సీ, ఎస్టీ, కార్పొరేషన్ల ద్వారా రుణాలు కూడా మంజూరు చేయనున్నారు.