కూలీలు కాదు.. ఇక రైతులే
- భూ పంపిణీతో ఎస్సీ,ఎస్టీల్లో వెలుగులు
- ప్రతిష్టాత్మకంగా అమలుకు చర్యలు
- సమన్వయంతో లక్ష్యం సాధించేందుకు కృషి
- నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు
సిద్దిపేట అర్బన్: వ్యవసాయ ఆధారిత ఎస్సీ, ఎస్టీ కూలీలను రైతులుగా మార్చేందుకే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావువు అత్యంత ప్రతిష్టాత్మకంగా భూ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. భూ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సోమవారం సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ కేసీఆర్ భూ పంపిణీ పథకాన్ని ఈ నెల 15న రాష్ట్రంలో ప్రారంభిస్తారని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ముందుకెళ్లి ఎస్సీ లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
భూ పంపిణీ విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గతంలో కొనసాగిన ప్రభుత్వాలు సాగుకు యోగ్యం కానీ బంజరు భూములను లబ్ధిదారులకు అందజేసి భూ పంపిణీ చేశామనిపించారన్నారు. ప్రస్తుతం సాగుకు యోగ్యమైన భూమినే లబ్ధిదారులకు అందజేస్తామని, అందుకు అవసరమయ్యే విద్యుత్‌ను, బోరు బావిని, విద్యుత్ మోటార్‌ను, మొదటి పంటకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు తదితర పెట్టుబడులను ఉచితంగా లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలను గుర్తించి అందరికీ మూడు ఎకరాల సాగు భూమిని అందజేస్తామన్నారు. వివిధ గ్రామాల్లో ప్రభుత్వానికి అమ్మే భూములను గుర్తించి అధికారులు నివేదిక ఇవ్వాలని సూచించారు. దీంతో భూ పంపిణీ ప్రక్రియ వేగవంతమవుతుందన్నారు.
ప్రధాన మంత్రి ఢిల్లీ ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తే తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జాతీయ జెండాను ప్రథమంగా ఎగురవేయనున్నారని చెప్పారు. సమావేశంలో సిద్దిపేట ఆర్టీఓ ముత్యంరెడ్డి, తహశీల్దార్ ఎన్‌వైగిరి, నంగునూరు, చిన్నకోడూరు మండలాల తహశీల్దార్లు శ్రీహరి, వసంతలక్ష్మి, జెడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాల ఎంపీపీలు ఎర్ర యాదయ్య, కూర మాణిక్యరెడ్డి, జాపశ్రీకాంత్‌రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్లు, ఆర్‌ఐలు, వీఆర్‌ఓలు పాల్గొన్నారు.