
'ఆసరా'లో అక్రమాలు వాస్తవమే: ఈటెల
సామాజిక పింఛన్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. నిజాయితీగల అధికారులతో సామాజిక ఆడిట్ నిర్వహిస్తే పింఛన్లకు 20 శాతానికిపైగా అనర్హులవుతారని చెప్పారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అధికారులతో తాగునీరు, పింఛన్లు, విద్య, వాటర్‌గ్రిడ్, సన్నబియ్యం, హరితహారం, ఎస్సీ కార్పొరేషన్ నిధులు వంటి అంశాలపై సుధీర్ఘంగా సమీక్షించారు. ఎంతో గొప్ప ఆశయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఆసరాలో తప్పటడుగులు దొర్లాయని, సీఎం ఆశయం నెరవేరలేదన్నారు.
అనర్హులకు పింఛన్లు మంజూరు చేసిన బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు సైతం తమకు పోషణ కరువైందంటూ పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. పాఠశాలల్లో సన్నబియ్యం భోజన పథకం విజయవంతమైతే అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ ప్రవేశపెడతామన్నారు. దళితుల భూమి కొనుగోలు అంశంపై ప్రత్యేక కమిటీలు వేసి భూ పంపిణీని వేగవంతం చేస్తామన్నారు.