దళితులను దగా చేసిన కేసీఆర్ బడ్జెట్
కామారెడ్డిటౌన్: తెలంగాణలో మొట్టమొదటి టీఆర్‌ఎస్ ప్రభుత్వ బడ్జెట్ దళితుడిని దగా చేసిందని ఎమ్మార్పీఎస్, మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. గురువారం ఆయన కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. మేనిఫెస్టో ప్రకారం ఎస్ సబ్‌ప్లాన్ నిధులు కాకుండా, ఐదేళ్లలో రూ. 50 వేల కోట్ల నిధులను దళితుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, ఇపుడు బడ్జెట్‌లో అరకొర కేటాయింపులు చేసి మోసగించారని ఆరోపించారు.
ఐదేళ్లలో రూ. 50 వేల కోట్ల నిధులను ఖర్చు చేస్తేనే దళితులకు ఆర్థిక సమానత్వం సాధ్యమవుతుందన్నారు. భూ పంపిణీ పేరిట దళితులకు రూ. వెయ్యికోట్లతో భూములు కొనుగోలు చేసి అందిస్తామని కేసీఆర్ గారడీ చేస్తున్నారని విమర్శిం చారు. ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడానికి రూ. 6,500 కోట్ల విలువ గల ప్రభుత్వ భూములను అ మ్ముకోవాలని చూస్తున్నారని అన్నారు. ఇది దొరలకు మేలు కలిగించడానికేనని మండిపడ్డారు.
ప్రభుత్వ భూములనే దళితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెట్రో ప్రాజెక్టు ఎల్‌అండ్‌టీ కంపెనీ నుంచి మైహోమ్ కంపెనీకి ఎలా అంటగట్టారో ఇప్పుడు ప్రభుత్వ భూములను సొంత సామాజిక వర్గాలకు అం ట గట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. గ్రామాలకే పరిమితమవుతున్న దళితులకు నగరాలలో ఉన్న ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.
నిజాంషుగర్ ఫ్యాక్టరీ అంశంపై మోసం
అధికారంలోకి వచ్చాక రెండు నెలలలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని కేసీఆర్‌తోపాటు కేటీఆర్ , కవిత హామీ ఇచ్చి ఐదు నెలలు గడుస్తున్నా ఇప్ప టి వరకు ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. బడ్జెట్‌లో ఫ్యాక్టరీకి నయా పైసా కూడా కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. ఫ్యాక్టరీని చంద్రబాబునాయుడు గతంలో పెట్టుబడిదారులకు అంటగడితే, కేసీఆర్ కూడా అదే తోవలో నడుస్తున్నారన్నారు.
దీనిని స్వాధీనం చేసుకుంటే 10 వేల మందికి ఉపాధి దక్కుతుం దన్నారు. బడ్జెట్‌లో బీసీలకు కూడా పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నాగభూషణం, నాయకులు శ్యామ్యూల్, బా లు, ఫర్జానా, కిష్టయ్య, రమేశ్, సాయిలు, లక్ష్మణ్, శంకర్, యాదగిరి, బోకే లింగం తదితరులున్నారు.