జిల్లాలో ఏడో విడత భూ పంపిణీకి అధికారులు సి ద్ధం అవుతున్నారు. నవంబర్‌లో పంపిణీ చేయడానికి ప్రణాళిక రూపొందించారు.
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఏడో విడత భూ పంపిణీకి అధికారులు సి ద్ధం అవుతున్నారు. నవంబర్‌లో పంపిణీ చేయడానికి ప్రణాళిక రూపొందించారు. అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులతోపాటు నిరుపేదలను గుర్తించి పట్టా లు పంపిణీ చేయనున్నారు. నవంబర్‌లో భూ పంపిణీ చేపట్టాలని ఇటీవల సీసీఎల్‌ఏ కమిషనర్ కృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులకు సూచించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 41 మండలాల్లో 1956 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరికి పంపిణీ చేసేందుకు 3,892 ఎకరాల భూమిని గుర్తించారు. మిగతా 11 మండలాలకు మొండిచేయి చూపే అవకాశం ఉంది.
257 గ్రామాల లబ్ధిదారులకు పంపిణీ
అధికారులు గుర్తించిన భూమిని ఐదు డివిజన్లలోని 41 మండలాల్లో ఉన్న 257 గ్రామాల లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్ డివిజన్‌లోని ఐదు మండలాలకు చెందిన 126 మందికి 258 ఎకరాలు, నిర్మల్ డివిజన్‌లోని పది మండలాలకు చెందిన 112 మం దికి 147 ఎకరాలు, ఉట్నూర్ డివిజన్‌లోని ఎనిమిది మండలాలకు చెందిన 305 మందికి 959 ఎకరాలు, మంచిర్యాల డివిజన్‌లోని 10 మండలాలకు చెందిన 561 మందికి 954 ఎకరాలు, ఆసిఫాబాద్ డివిజన్‌లోని ఎనిమిది మండలాలకు చెందిన 852 మందికి 1,572 ఎకరాల భూమి పంపిణీ చేసేందుకు అధికారులు గుర్తించారు. భూముల గుర్తింపు ప్రక్రియ గత మార్చి 12 నుంచి ఏప్రిల్ 10 వరకు నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో గుర్తించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. భూమి లేని అర్హులు గల వారి నుంచి సదస్సుల్లో దరఖాస్తులు స్వీకరించారు. ఈ మేరకు ప్రభుత్వ ఆసైన్డ్ భూములను సాగు చేస్తున్న వారిని ఈ సర్వే ద్వారా గుర్తించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వీరికి ఏడో విడతలో పట్టాపాసు పుస్తకాలు అందజేయనున్నారు.
వైఎస్ హయాంలో 19 వేల కుటుంబాలకు లబ్ధి
జిల్లాలోని ఐదు విడతలుగా చేపట్టిన భూ పంపిణీ కార్యక్రమం ద్వారా 19,440 మంది కుటుంబాలకు లబ్ధి చేకూరింది. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులతోపాటు భూమి లేని నిరుపేదలకు జిల్లా వ్యాప్తంగా 19,440 మందికి 45,486 ఎకరాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం ఏటా భూ పంపిణీ కార్యక్రమం చేపట్టాలని 2005 ఏప్రిల్ 14న ఈ పథకానికి దివంగత మహానేత వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. వరుసగా ఐదు విడతలు కొనసాగింది. వైఎస్సార్ మరణానంతరం పంపిణీ జరగలేదు. గతేడాది ఆరో విడత చేపట్టారు. కాగా 2010, 2011లో పంపిణీ జరగలేదు.
లబ్ధిదారుల ఎదురుచూపు..
జిల్లాలో ప్రభుత్వ భూములు కొన్నేళ్లుగా సాగు చేస్తున్న వారు వందల సంఖ్యలో ఉన్నారు. భూములు సాగు చేస్తున్న అర్హులైన లబ్ధిదారులకు గత ఆరో విడత భూ పంపిణీకి నోచుకోలేదు. ఏడో విడతలోనైనా తమకు న్యాయం చేయాలని బాధితులు అధికారులను కోరుతున్నారు.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే పంపిణీ
ఏడో విడత భూపంపిణీకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే పంపిణీ చేపడతాం. ఇప్పటివరకు పంపిణీకి ఆదేశాలు రాలేదు. ఏడో విడతలో భూ పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం.
- ఎస్‌ఎస్ రాజు, డీఆర్వో, ఆదిలాబాద్