
భూపంపిణీ @ నత్త
తూతూమంత్రంగా దళితులకు భూపంపిణీ పథకం
మే వరకూ 959 మందికి 2,524 ఎకరాల పంపిణీ
హైదరాబాద్: రాష్ట్రంలో భూమిలేని నిరుపేద దళితుల అభ్యున్నతి కోసం టీఆర్‌ఎస్ సర్కారు భూపంపిణీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు చెందిన నిరుపేద దళిత మహిళలకు మూడు ఎకరాల చొప్పున వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడంతోపాటు ఏడాదిపాటు సాగుకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలనే లక్ష్యంతో గతేడాది ఆగస్టు 15న దీన్ని ప్రారంభించింది. ఈ ఏడాది మే 21 వరకు మొత్తం 959 మంది లబ్ధిదారులకు 2,524 ఎకరాల మేర ప్రభుత్వ, ప్రైవేట్ భూమిని మంజూరు చేసి వాటిలో 640 మందికి లబ్ధిదారుల పేరిట రిజిస్టర్ చేసింది. అయితే వివిధ కారణాల వల్ల ఈ పథకం ఇంకా వేగం పుంజుకోలేదు. ముఖ్యంగా ఏ ఏడాదికి ఆ ఏడాది ఎంత మేర భూమిని పంపిణీ చేయాలన్న దానిపై లక్ష్యాలను నిర్దేశించకపోవడంతో పథకం అమలు నింపాదిగా సాగుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం దీన్ని నిరంతరం సాగే పథకంగా, భూమి అందుబాటులోకి రావడాన్ని బట్టి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని చెబుతోంది.
ఇదీ పథకం ఉద్దేశం...
వ్యవసాయ రంగంపై ఆధారపడిన భూమిలేని నిరుపేద ఎస్సీ కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఉద్దేశించిన ఈ పథకాన్ని వందశాతం సబ్సిడీపై అమలు చేస్తున్నారు. వ్యవసాయ భూమిని ఎకరానికి రూ. 2 లక్షల నుంచి రూ. 7 లక్షల మధ్యన కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందించాల్సి ఉంటుంది. అలాగే ఆ భూమిని అభివృద్ధి చేసేందుకు, నీటి వసతి, పరికరాలు, విద్యుత్ మోటార్లు, పంపులు వంటి సౌకర్యాలు అందించి కనీసం వన్‌క్రాప్ ఇయర్‌కు (విత్తనాలు, ఎరువులు,పురుగుమందులు, దున్నడం, తదితర సదుపాయాలు) అందించాలని పథకాన్ని ప్రారంభించినప్పుడే ప్రభుత్వం నిర్దేశించింది.
విడుదలకాని మార్గదర్శకాలు...
ఈ పథకం అమలుకు మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో గత తొమ్మిదిన్నర నెలలుగా జిల్లా కలెక్టర్లు, అధికారులు తోచిన విధంగా పనిచేస్తున్నారు. భూపంపిణీకి నీటి వసతి ఉన్న భూమినే కొనాలా, లేకపోయిన కొనవచ్చా అనే విషయమై ప్రభుత్వం ఇప్పటివరకూ స్పష్టత ఇవ్వలేదు. దీంతో కలెక్టర్లు మొదలుకొని రెవెన్యూ యంత్రాంగం వరకు దీనిపై మొక్కుబడిగానే వ్యవహరిస్తుండటంతో ఈ పథకం చతికిలపడింది.
నిరుపయోగంగా 800 కోట్లు
భూపంపిణీ పథకం కోసం గత బడ్జెట్‌లో ప్రభుత్వం రూ. వెయ్యి కోట్లు కేటాయించినా ఈ ఏడాది మార్చి ఆఖరు వరకు అందులో రూ. వంద కోట్లు కూడా ఖర్చుచేయకపోవడంతో (దాదాపు రూ. వంద కోట్ల వరకు స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాలకు కేటాయించారు) దాదాపు రూ. 800 కోట్లు నిరుపయోగంగా మిగిలిపోయాయి. ఈ ఏడాది మే 21 వరకు మొత్తం 959 మంది లబ్ధిదారులకు 2,524 ఎకరాల మేర మాత్రమే ప్రభుత్వ, ప్రైవేట్ భూమిని మంజూరు చేసి వాటిలో 640 మందికే లబ్ధిదారుల పేరిట రిజిస్టర్ చేయగలిగారు. అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 59.38 ఎకరాలు మంజూరు చేసి కేవలం ఏడుగురికి, రంగారెడ్డి జిల్లాలో 65.39 ఎకరాలు మంజూరుచేసి 14 మందికి, మహబూబ్‌నగర్ జిల్లాలో 87 ఎకరాలు మంజూరు చేసి 20 మందికి రిజిస్టర్ చేశారు. 2015-16 బడ్జెట్‌లోనూ రూ. వెయ్యికోట్లు కేటాయించినా భూపంపిణీ, స్వయం ఉపాధి పథకాలకు ఎంతెంత వ్యయం చేయాలనే దానిపై మార్గదర్శకాలే విడుదల కాలేదు.