
దాత సుబ్బారావు దంపతులతో పట్టాలు పొందిన గ్రామస్తులు
యానాం: పది రూపాయలిచ్చి లక్షలాది రూపాయల ప్రచారం చేసుకునే ఈ రోజుల్లో కూడా యానాంకు చెందిన ఓ దళితుడు నిస్వార్థంగా తనకున్న రూ.కోటి విలువ చేసే భూమిని పేదలకు పంచిపెట్టారు. కుల మతాలకు అతీతంగా 54 మందికి ఇళ్ల పట్టాలిచ్చారు. యానాం మున్సిపాలిటీ పరిధిలోని దరియాలతిప్పకు చెందిన మెల్లం సుబ్బారావు గతంలో కౌన్సిలర్‌గా పనిచేశారు. ఆ సమయంలో తన పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల మన్నన పొందారు.
సుబ్బారావుకు దరియాలతిప్పలో రెండు ఎకరాలు కొబ్బరి తోట ఉంది. ప్రస్తుతం ఆ భూమి విలువ రూ.కోటి వరకు ఉంటుంది. అయినా కూడా పేదలకు సొంత గూడు కల్పించేందుకు ఆ భూమిని ఆదివారం ఉదారంగా పంచి పెట్టాడు. 65 చదరపు మీటర్ల చొప్పున విభజించి ఎస్సీలు, మత్స్య కారులు, బ్రాహ్మణులు, కాపులు, శెట్టిబలిజకు చెందిన 54 మంది పేదలకు పంపిణీ చేశారు. కాగా, సుబ్బారావుకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. ఒక కుమారుడు చనిపోగా మిగిలిన వారు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సుబ్బారావు మాట్లాడుతూ ‘సొంత ఇళ్లు లేని పేదల కష్టాలను ప్రత్యక్షంగా చూశాను. ఎప్పటికైనా వారికి సాయపడాలని అనుకున్నాను. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇళ్లు లేని వారికి ఏదో నా వంతు సాయం చేశాననే సంతృప్తి కలిగింది’ అని పేర్కొన్నారు.