దళితులకు భూ పంపిణీ
సాక్షి, మహబూబ్‌నగర్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం దళితులకు మూడెకరాల భూపంపిణీ చేసింది. ఈ కార్యక్రమాన్ని పంద్రాగస్టు సందర్భంగా జిల్లాకేంద్రంలోని పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన వేడుకలకు అతిథిగా విచ్చేసిన పంచాయతీరాజ్, సమాచార, సాంకేతికరంగ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించింది. జిల్లాలోని ఆయా ప్రాంతాలకు చెందిన అర్హులైన 20 మంది దళితులకు ఆయన చేతుల మీదుగా పట్టాలు అందజేశారు.
అచ్చంపేట మండలం పులిజాలకు చెందిన ఎం.లక్ష్మమ్మ, ఆర్.నారమ్మ, అలంపూర్ మండలం కోయిల్‌దిన్నెకి చెందిన హెచ్.లక్ష్మీదేవి, హెచ్.మేరియమ్మ, హెచ్.భాగ్యమ్మ, హెచ్.ప్రమీలమ్మలు పట్టాలు అందుకున్నారు. అలాగే దేవరకద్ర నియోజకవర్గం కరివెన గ్రామానికి చెందిన కప్పెట నాగమ్మ, బొడ్రాతి మూర్తమ్మ, గొరిట మాసమ్మ, షాద్‌నగర్ నియోజకవర్గం వెంకిర్యాలకి చెందిన కె.లక్ష్మమ్మ, టి.నర్సమ్మ, వి.సుక్కమ్మ, జడ్చర్ల నియోజకవర్గం కొత్తూరు గ్రామానికి చెందిన బి.రేవతమ్మ, ఎం.లక్ష్మమ్మ, వై.మంజులకు పట్టాలు పంపిణీ చేయగా, మిగిలిన వారు హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టాలను తీసుకున్నారు.
జీవితాంతం రుణపడి ఉంటాం
మిడ్జిల్ : ‘నిరుపేదలను గుర్తించి భూమి ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వానికి, కేసీఆర్ సార్‌కు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. మాలాంటోళ్లకు పిలిచి భూమి ఇచ్చిన సర్కార్ ఇదొక్కటే. సంతోషంగా ఉంది. క లలో కూడా పట్టాదారులమవుతామని అనుకోలేదు. తీసుకున్న భూమిలో పంటలు సాగుచేసి వాటితో పిల్లల్ని బాగా చదివించుకుంటాం’ అని భూములు పొందిన లబ్ధిదారులు చెప్పిన మాటలివి. శుక్రవారం జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మిడ్జిల్ మండలం కొత్తూర్‌కు చెందిన ముగ్గురు నిరుపేద రైతులకు మంత్రి కేటీఆర్ పట్టాలు అందజేశారు. వీరిలో లక్ష్మమ్మకు సర్వే నం.384/ఈలో, పార్వతమ్మకు 384/అ లో, మంజులకు 384/ఆ లో మూడెకరాల చొప్పున పంపిణీ చేశారు.