
సెక్స్ వర్కర్లకు చేయూతనందిస్తాం
సెక్స్ వర్కర్లు అర్ధికాభివృద్ధికి ఎస్సీ కార్పొరేషన్ చేయూత అందిస్తుందని ఎస్సీ కార్పొరేషన్ సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్ అన్నారు.
కోటగుమ్మం (రాజమండ్రి) : సెక్స్ వర్కర్లు అర్ధికాభివృద్ధికి ఎస్సీ కార్పొరేషన్ చేయూత అందిస్తుందని ఎస్సీ కార్పొరేషన్ సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్ అన్నారు. స్థానిక కోర్లమ్మపేటలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్‌లో నారీ సాక్ష్యం (రాజమండ్రి) ఆధ్వర్యంలో ఎస్సీ, కార్పొరేషన్ రుణాలు, పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ప్రసాద్ మాట్లాడుతూ జాతీయ మహిళా అభివృద్ధి సాధికారత సంస్థ సెక్స్ వర్కర్లను, లింగమార్పిడి చేసుకున్నవారిని, స్వలింగ సంపర్కులను సమాజంలో మమేకం చేయాలనే లక్ష్యంతో ‘సామాజిక విలీనం’ అనే ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, మణిపూర్ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్టు తెలిపారు.
సెంటర్ ఫర్ అడ్బకసి అండ్ రిసెర్చ్ దీనికి సాంకేతిక సహాకారం అందిస్తున్నట్టు వివరించారు. 2012 అక్టోబర్ నుంచి రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు అమలులో ఉందన్నారు. ప్రభుత్వానికి, కమ్యూనిటీ ఆధారిత సంస్ధలకు మధ్య నిరంతరం భాగస్వామ్యం, పధకాలు అమలు నాణ్యత పెంచుటకు జిల్లాలో ఉన్న 5 సీబీఓలు (నారీ సాక్ష్యం, వెలుగు రేఖ, ఉదయ భాను, ఆశాజ్యోతి, వైజ్) ఒక వారధిని కాకినాడలో ఏర్పాటు చేసుకున్నట్టు తెలిపారు.
ఈ ఐదు సీబీఓల నుంచి ఒక్కొక్క ప్రతినిధి కమ్యూనిటీ కో-ఆర్డినేటర్‌లుగా ఈ వారిధికి పనిచేస్తున్నట్టు తెలిపారు. సెక్స్ వర్కర్లలో ఎస్సీ వర్గానికి చెందిన, వ్యాపారం చేయదలచినవారికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందజేస్తామన్నారు. నారీ సాక్ష్యం ప్రెసిడెంట్ సుజాత మాట్లాడుతూ సెక్స్ వర్కర్ల ఆర్థికాభివృద్ధి కోసం సీబీఓ అన్ని ప్రభుత్వ శాఖలతో కలసి పనిచేస్తుందన్నారు. సెక్స్‌వర్కర్ నిర్మల మాట్లాడుతూ తాను సంవత్సరం క్రితం రుణం కోసం దరఖాస్తు చేయగా ఇంతవరకూ ఏ విధమైన సమాచారం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 50 మంది సెక్స్ వర్కర్లు పాల్గొన్నారు.