ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతాం
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ
పెనమలూరు :
మాదిగలకు న్యాయం జరిగే విధంగా ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చెప్పారు. పోరంకిలో ఆదివారం ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. కృష్ణమాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు మాదిగలు 23 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ త్వరలో వచ్చే అవకాశం ఉందని, దీనిని సాధించి తీరుతామన్నారు. వచ్చే నెల 20వ తేదీన ఎస్సీ వర్గీకరణ కోసం ధర్మయుద్ధ మహాసభను హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తామన్నారు. దీనికి మాదిగలు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణకు తమ సహకారం ఇస్తానని హామీ ఇచ్చిన వారు నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎవరు కుట్రలు పన్నినా ఎస్సీ వర్గీకరణ సాధిస్తామన్నారు. ఇందుకు నిదర్శనంగా ఢిల్లీలో 21 రోజుల పాటు చేసిన దీక్షకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వచ్చి హామీ ఇచ్చారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ధర్మయుద్ధ మహాసభలో మాదిగలు తమ ఐక్యతను, సత్తాను చాటాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి దొండపాటి సుధాకర్ మాదిగ, జిల్లా అధికార ప్రతినిధి మానికొండ సుధాకర్ మాదిగ, రాష్ట్ర కార్యదర్శి నూకపోగు ఏసు మాదిగ, నేతలు బంకా గంగాధర్ మాదిగ, దేవరపల్లి సతీష్ మాదిగ, శీలం బుచ్చిబాబు మాదిగ పాల్గొన్నారు.