MRPS meeting
-
ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతాం
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పెనమలూరు : మాదిగలకు న్యాయం జరిగే విధంగా ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చెప్పారు. పోరంకిలో ఆదివారం ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. కృష్ణమాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు మాదిగలు 23 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ త్వరలో వచ్చే అవకాశం ఉందని, దీనిని సాధించి తీరుతామన్నారు. వచ్చే నెల 20వ తేదీన ఎస్సీ వర్గీకరణ కోసం ధర్మయుద్ధ మహాసభను హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తామన్నారు. దీనికి మాదిగలు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణకు తమ సహకారం ఇస్తానని హామీ ఇచ్చిన వారు నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎవరు కుట్రలు పన్నినా ఎస్సీ వర్గీకరణ సాధిస్తామన్నారు. ఇందుకు నిదర్శనంగా ఢిల్లీలో 21 రోజుల పాటు చేసిన దీక్షకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వచ్చి హామీ ఇచ్చారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ధర్మయుద్ధ మహాసభలో మాదిగలు తమ ఐక్యతను, సత్తాను చాటాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి దొండపాటి సుధాకర్ మాదిగ, జిల్లా అధికార ప్రతినిధి మానికొండ సుధాకర్ మాదిగ, రాష్ట్ర కార్యదర్శి నూకపోగు ఏసు మాదిగ, నేతలు బంకా గంగాధర్ మాదిగ, దేవరపల్లి సతీష్ మాదిగ, శీలం బుచ్చిబాబు మాదిగ పాల్గొన్నారు. -
నల్లజర్లలో 144 సెక్షన్ విధింపు
నల్లజర్ల: ఎమ్మార్పీఎస్లోని రెండు వర్గాల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సోమవారం నల్లజర్లలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కార్యక్రమాన్ని అడ్డుకుంటామంటూ మందకృష్ణ వ్యతిరేక వర్గం ప్రకటించింది. దీంతో ఆయన అనుకూల, వ్యతిరేక వర్గాల నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. -
బాబు పర్యటనకు నిరసనగా రాస్తారోకో: కృష్ణమాదిగ
కరీంనగర్: తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటించనున్న నేపథ్యంలో బాబు పర్యటనను నిరసిస్తూ మాదిగల రాస్తారోకో నిర్వహించనున్నట్టు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాదిగలను మోసం చేసిన చంద్రబాబుకు నిరసన బలంగా తెలియజేస్తామన్నారు. కరీంనగర్లో రేపు జరగబోయే టీడీపీ సభకు పోటీగా నిరసన సభను నిర్వహిస్తామని మందకృష్ణ మాదిగ చెప్పారు. నిరసన తెలిపే అవకాశం పోలీసులే కల్పించాల్సిందిగా ఆయన కోరారు. ఎమ్మార్పీస్ సభకు పోలీసులు అనుమతివ్వకుండా ప్రశ్నించే హక్కును కాలరాస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు నిరసన తెలిపే ప్రయత్నంలో జరగబోయే పరిణామాలకు పోలీసులు, టీడీపీ నేతలే బాధ్యలు వహించాలని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. -
ఇద్దరు చంద్రులూ మోసగాళ్లే
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సిరికొండ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు, ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరూ మాదిగలను మోసం చేసిన వారేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాదిగల ఉద్యమాలతో ఆ వర్గానికి తప్ప సమాజంలోని మిగిలిన వారందరికీ మేలు జరిగిందని అన్నారు. దండోరా పోరాటాలతోనే ఆరోగ్యశ్రీ పథకం, వికలాంగులకు రూ.1500 పింఛన్లు అమలయ్యాయని చెప్పారు. ఇద్దరు సీఎంలు మాదిగల అండతోనే అధికారంలోకి వచ్చారని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటామన్న తెలంగాణ సీఏం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం పెట్టి చేతులు దులుపుకున్నారని, ఏపీ సీఎం చంద్రబాబు అయితే మొత్తానికే ముఖం చాటేశారని విమర్శించారు. తెలంగాణ నుంచి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని, ఏపీలో వర్గీకరణ తీర్మానం చేయాలనే డిమాండ్‌తో వచ్చే నెల 18న ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడించనున్నట్లు ప్రకటించారు. తెలంగాణకు దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మాట తప్పడమే కాకుండా మంత్రి వర్గంలో ఉన్న రాజయ్యను అకారణంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి రవికిరణ్, మండలాధ్యక్షుడు అశోక్, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పిప్పెర సంజీవ్, నాయకులు గణేష్, సాయిలు, ఎంఎస్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఫర్జానా తదితరులు పాల్గొన్నారు.