
బాబు పర్యటనకు నిరసనగా రాస్తారోకో: కృష్ణమాదిగ
కరీంనగర్: తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటించనున్న నేపథ్యంలో బాబు పర్యటనను నిరసిస్తూ మాదిగల రాస్తారోకో నిర్వహించనున్నట్టు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాదిగలను మోసం చేసిన చంద్రబాబుకు నిరసన బలంగా తెలియజేస్తామన్నారు. కరీంనగర్‌లో రేపు జరగబోయే టీడీపీ సభకు పోటీగా నిరసన సభను నిర్వహిస్తామని మందకృష్ణ మాదిగ చెప్పారు.
నిరసన తెలిపే అవకాశం పోలీసులే కల్పించాల్సిందిగా ఆయన కోరారు. ఎమ్మార్పీస్ సభకు పోలీసులు అనుమతివ్వకుండా ప్రశ్నించే హక్కును కాలరాస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు నిరసన తెలిపే ప్రయత్నంలో జరగబోయే పరిణామాలకు పోలీసులు, టీడీపీ నేతలే బాధ్యలు వహించాలని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు.