సబ్సిడీకి తాళం | subsidy stopped | Sakshi
Sakshi News home page

సబ్సిడీకి తాళం

Published Wed, Aug 10 2016 11:07 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయం

ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయం

ఎస్సీ కార్పొరేషన్‌ రుణ లబ్ధిదారుల సబ్సిడీకి తాళం పడింది. ఖాతాల్లో జమయిన మొత్తం కాస్తా యంత్రాంగం నిలిపేసింది. రెండేళ్లపాటు యూనిట్‌ సక్రమంగా నిర్వహించినట్టు నిర్ధారించాక దానిని కాస్తా విడుదల చేస్తామని తేల్చిచెప్పింది.

ఎస్సీ కార్పొరేషన్‌ రుణ లబ్ధిదారులకు కొత్త చిక్కు
యూనిట్‌ రెండేళ్ల నిర్వహణ అనంతరమే సబ్సిడీకి అర్హత
కొత్తగా డాక్యుమెంటేషన్‌ చేయాలని సర్కారు మెలిక
మళ్లీ అంత మొత్తం ఎలా వెచ్చించాలని లబ్ధిదారుల గోల 
977 మంది లబ్ధిదారులకు రూ. 7.02కోట్ల సబ్సిడీని నిలిపివేసిన యంత్రాంగం 
 
 
విజయనగరం కంటోన్మెంట్‌: ఎస్సీ కార్పొరేషన్‌ రుణ లబ్ధిదారుల సబ్సిడీకి తాళం పడింది. ఖాతాల్లో జమయిన మొత్తం కాస్తా యంత్రాంగం నిలిపేసింది. రెండేళ్లపాటు యూనిట్‌ సక్రమంగా నిర్వహించినట్టు నిర్ధారించాక దానిని కాస్తా విడుదల చేస్తామని తేల్చిచెప్పింది. అప్పటివరకూ సబ్సిడీనీ రుణంగానే పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే రుణం మొత్తానికే డాక్యుమెంటేషన్‌ చేయించుకున్నవారు... కొత్తగా సబ్సిడీని కలిపి చేయించాలని చెప్పడంతో లబ్ధిదారునికి ఆర్థిక భారం తప్పడంలేదు. ఎస్సీ కార్పొరేషన్‌ద్వారా రుణం పొంది యూనిట్లు నెలకొల్పేవారికి తాజా నిబంధనలు కొత్త చిక్కులు మొదలయ్యాయి. బ్యాంకు ఖాతాల్లో జమయిన సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేయడానికి ఆంక్షలు విధించింది. యూనిట్‌ రెండేళ్లపాటు నిర్వహించినట్టు నిర్థారించాకే ఆ మొత్తాన్ని విడుదల చేస్తామని, అంతవరకూ దానినీ రుణంగానే పరిగణిస్తామనీ... ఆమేరకు కొత్తగా డాక్యుమెంటేషన్‌ చేయాలని తేల్చి చెప్పింది. జిల్లాలో గతేడాది ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాల కోసం సుమారు 15వేలకు పైగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. తెలుగు తమ్ముళ్ల రాజకీయానికి అర్హులైన చాలామంది బలైపోయారు. చివరికి జన్మభూమి కమిటీలు, రాజకీయ నాయకుల సిఫార్సులకు తలొగ్గిన అధికారులు జిల్లా వ్యాప్తంగా 1106 మందిని రుణాలకు అర్హులుగా గుర్తించారు. వారిలో 977 మందికి సబ్సిడీలను ఓబీఎంఎస్‌(ఆన్‌లైన్‌ బెనిఫిషరీ మానిటరింగ్‌ సిస్టం) ద్వారా లబ్ధిదారుల అకౌంట్లకు జమ చేసింది. ఇలా ఆయా ఖాతాల్లోకి రూ.7.02 కోట్లు వచ్చి చేరాయి. ఆ సబ్సిడీని తీసుకుని తాము పెట్టుకున్న యూనిట్లను ప్రారంభిద్దామనుకున్న తరుణంలో కొత్త నిబంధనలు అధికారులు ఏకరువు పెడుతున్నారు. సబ్సిడీని రుణంతో పాటు ఇవ్వకుండా దానిని బ్యాంక్‌లో లాక్‌ చేస్తారు. రెండేళ్లపాటు ఈ నగదుకు వడ్డీ ఇవ్వరు. బ్యాంకర్‌ ఇచ్చే రుణంతో పాటు సబ్సిడీని కూడా రుణంగానే అందజేస్తారు. రెండేళ్ల పాటు యూనిట్‌ను సక్రమంగా నడిపించినట్టు ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు, బ్యాంకర్లు ప్రతీ మూడు నెలలకోసారి పరిశీలించి నివేదికలు ఇస్తేనే ఆ సబ్సిడీని విడుదల చేస్తారు. 
 
 
మళ్లీ కొత్తగా డాక్యుమెంటేషన్‌
ఇప్పటికే సబ్సిడీ మినహా రుణానికి అవసరమైన డాక్యుమెంటేషన్‌ పనులు పూర్తయ్యాయి. అవన్నీ ఇప్పుడు చెల్లుబాటు కావు. సబ్సిడీని రుణంగానే ఇస్తారు గాబట్టి... దానినీ కలిపి కొత్తగా డాక్యుమెంటేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. తొలుత యూనిట్‌ విలువ రెండు లక్షలుంటే రుణం మొత్తానికి అంటే రూ. లక్షకే డాక్యుమెంటేషన్‌ చేశారు. కానీ ఈసారి రెండు లక్షలూ రుణంగానే ఇస్తారు గాబట్టి కొత్తగా రెండులక్షలకూ డాక్యుమెంటేషన్‌ చేయాలని చెబుతున్నారు. మొదట ఓసారి డాక్యుమెంటేషన్‌కు దాదాపు రెండునుంచి మూడువేల వరకూ ఖర్చుచేశామనీ, కొత్తగా డాక్యుమెంటేషన్‌ చేయాలంటే మరో పదివేల వరకూ ఖర్చవుతుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
 
కొత్తగా డాక్యుమెంటేషన్‌ చేయించుకోవాలి: ఎం రాజు, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్‌
జిల్లాలో ఉన్న 977 మంది లబ్దిదారులకు సబ్సిడీ విడుదలయింది. వారికి సబ్సిడీ ఇప్పుడు ఇవ్వం. సబ్సిడీ మొత్తాన్ని రుణంతో పాటే మొత్తం రుణంగా చెల్లిస్తాం. ఇందుకు కొత్తగా డాక్యుమెంటేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. లబ్ధిదారులంతా గమనించి త్వరగా బ్యాంకుల వద్దకు వెళ్లి మళ్లీ డాక్యుమెంటేషన్‌ చేయించుకోవాలి. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement