హైదరాబాద్: కోయలు, గోండులు, చెంచులు, ఎరుకల, పెంట కులస్తుల స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక నివేదికనిస్తానని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో పందుల పెంపకానికి ఎరుకల కులస్తులకు ఉపయోగపడే విధంగా ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మంగళవారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం(టీపీవైఎస్) ఆధ్వర్యంలో 35మంది ఎరుకల కులస్తులకు ఏకలవ్య అవార్డులను ఆయన ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరుకల కులస్తుల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. ఎస్సీ, ఎస్టీ, కమిషన్‌లో 27,033 కేసులు పెండింగ్‌లో ఉండగా వాటిలో 26వేల కేసులను పరిష్కరించామన్నారు. అణగారిన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూతాడి కుమార్, ప్రధాన కార్యదర్శి లోకిని రాజు, నాయకులు వి.రమణ, రమేశ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment