ST Commission
-
గూడేనికి కొత్త గుర్తింపు
యిర్రింకి ఉమామహేశ్వరరావు, సాక్షి ప్రతినిధి: ‘‘అది.. రెండు నెలల క్రితం దాకా ఊరూ పేరూ లేని ఓ మూరుమూల గూడెం! అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం బావికాడిపల్లె పంచాయతీ శివారులో 40 మంది యానాదులు దశాబ్దాలుగా గుడిసెల్లో జీవిస్తున్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా వారి తలరాతలు మారలేదు! ప్రభుత్వ పథకాలేవీ దరి చేరలేదు! ఇప్పుడు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చొరవతో ఆ ప్రాంతంలో అభివృద్ధి కుసుమాలు వికసిస్తున్నాయి. తుప్పలను తొలగించి పారిశుధ్య పనులు చేపట్టడంతో ఇన్నాళ్లూ రవాణా సదుపాయం లేని ప్రాంతానికి దారి ఏర్పడింది. తాగునీటి కోసం మంచినీటి బోరు కూడా తవ్వారు. ఏ ఆధారంలేని వారికి ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చింది. దీంతో ఓటు హక్కు దక్కింది. రేషన్ కార్డులూ రెడీ అవుతున్నాయి. ఇదంతా ‘జగనన్న ఎస్టీ కాలనీ’లో కేవలం రెండు నెలల్లోనే జరిగిన పురోగతి. గిరిజన హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంతో మంచి ఫలితాలు సాకారమవుతున్నాయి. వేర్వేరు కమిషన్ల ఏర్పాటు.. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి భిన్న స్థితిగతులు, సమస్యలు ఉంటాయి. గతంలో వారిని ఒకే కమిషన్ పరిధిలో కొనసాగించడంతో సత్వర న్యాయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీన్ని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎస్సీ ఎస్టీలకు వేర్వేరు కమిషన్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) కమిషన్ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే కుంభ రవిబాబు 2021 మార్చి 4న నియమితులయ్యారు. రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కమిషన్ చైర్మన్‌గా న్యాయవాది, దళిత ఉద్యమ నాయకుడైన మారుమూడి విక్టర్ ప్రసాద్‌ను 2021 ఆగస్టు 24న ప్రభుత్వం నియమించింది. ఈ రెండు కమిషన్లు ఎప్పటికప్పుడు ఎస్సీ ఎస్టీల సమస్యలపై స్పందిస్తూ న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని సమన్వయం చేయడంతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎస్టీ కమిషన్ పనితీరులో మైలు రాళ్లు.. ► కలెక్టరేట్లలో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తూ గిరిజనులకు సంక్షేమ పథకాలు అందుతున్న తీరును ఎస్టీ కమిషన్ ఆరా తీస్తోంది. ► విశ్వవిద్యాలయాలను సందర్శించి విద్యార్థులు, పరిశోధకుల అడ్మిషన్లతోపాటు టీచింగ్, నాన్ టీచింగ్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కచ్చితంగా అమలయ్యేలా ప్రభుత్వానికి నివేదించింది. ► శాఖల వారీగా సమావేశాలు నిర్వహించి గిరిజన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. ► ప్రభుత్వ శాఖల్లో నియామకాలు, పదోన్నతులు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, గిరిజనులకు భూమి పట్టాల (ఆర్ఓఎఫ్ఆర్, డీ పట్టా) పంపిణీపై ప్రభుత్వానికి నివేదించింది. ► గిరిజనులపై అఘాయిత్యాలు, భూ సమస్యలు, సర్వీసు వ్యవహారాలపై విచారణ చేపట్టి తగిన చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి నివేదించింది. ► గిరిజన ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి సామాజిక, ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసి ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. ► కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం చీమలపాడు పెద్ద తండ, మాన్సింగ్ తండా, మత్రియ తండా తదితర తండాల్లో పర్యటించి కిడ్నీ బాధితుల సమస్యలపై ప్రభుత్వానికి నివేదించింది. కృష్ణా నది నుంచి పైపులైను ద్వారా నేరుగా మంచినీరు అందించేలా ప్రతిపాదించింది. మారుమూల ప్రాంతాలకూ ప్రయోజనం సీఎం జగన్ ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్‌ను నియమించి గిరిజనులకు ఎంతో మేలు చేశారు. గిరిజనులకు ఎక్కడ సమస్య తలెత్తినా కమిషన్ అక్కడికి వెళుతోంది. సమస్యలను గుర్తించి పరిష్కరించేలా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాం. మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులకు సైతం విద్య, వైద్యం, సంక్షేమ పథకాలను అందించేలా సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం గిరిజనులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. –వడిత్యా శంకర్ నాయక్, ఏపీ ఎస్టీ కమిషన్ సభ్యుడు నీటి తిప్పలు తీర్చారు గతంలో మా ప్రాంతానికి కనీసం మంచినీటి సదుపాయం కూడా ఉండేది కాదు. దూరంగా ఉన్న తోటల్లోకి వెళ్లి నీళ్లు తెచ్చుకునే వాళ్లం. పనికి వెళితేనే అక్కడి రైతులు నీరు ఇచ్చేవారు. అధికారులు మా గ్రామాన్ని సందర్శించి బోరు వేయడంతో నీటి తిప్పలు తీరాయి. –ఎం.సరోజమ్మ, జగనన్న ఎస్టీ కాలనీ, బావికాడపల్లె గ్రామం తుప్పలు తొలగించి రహదారి సౌకర్యం మార్గమే లేని మా ప్రాంతానికి తుప్పలు తొలగించి రహదారి సౌకర్యం కల్పించారు. త్వరలో పక్కా రోడ్డు వేస్తామన్నారు. పరిశుభ్రంగా ఉండేలా పారిశుధ్య పనులు చేశారు. బడికెళ్లే పిల్లల కోసం ఆటో ఏర్పాటు చేశారు. మాకు ఆధార్, ఓటర్లుగా నమోదు చేయడంతోపాటు రేషన్ కార్డులు, ఇళ్లు ఇచ్చేలా ప్రతిపాదనలు రూపొందించారు. –టి.నాగరాజు, జగనన్న ఎస్టీ కాలనీ, బావికాడపల్లె గ్రామం జగనన్న ఎస్టీ కాలనీగా నామకరణం గతంలో యానాదుల కాలనీకి పేరు కూడా లేదు. గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు జగనన్న ఎస్టీ కాలనీగా బోర్డు ఏర్పాటు చేశాం. వారికి అవసరమైన వసతులు కల్పించడంతోపాటు సమస్యలు పరిష్కరించేలా శ్రద్ధ వహిస్తున్నాం. –గంగాధర్, బావికాడపల్లె పంచాయతీ కార్యదర్శి బాక్స్‌లో హైలెట్ చేయగలరు ► జగనన్న ఎస్టీ కాలనీలో యానాదుల సంఖ్య 40 ► గతంలో ఇద్దరికి మాత్రమే ఆధార్ ఉండగా ప్రత్యేక క్యాంపుతో 30 మందికి ఆధార్ కార్డులిచ్చారు. ► ఇప్పటివరకు ఎవరికీ ఓట్లు లేవు. తాజాగా 21 మందిని (10 మంది మహిళలు, 11 మంది పురుషులు)కి ఓటర్లుగా నమోదు చేశారు. ► ఆధార్ కార్డులు రావడంతో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేశారు. ► పెన్షన్లు కూడా అందించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ► ఐదేళ్ల లోపు పిల్లలకు పుట్టిన తేదీ సర్టిఫికెట్ నమోదు చేసి ముగ్గురిని బడిలో చేర్చారు. -
ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు..
సాక్షి, విజయవాడ: ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఆమోదంతో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం.. ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్ విడుదల చేసింది. (చదవండి: ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు: సీఎం జగన్) ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మాట్లాడుతూ, ప్రత్యేక ఎస్టీ కమిషన్ కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. గిరిజనులకు ఇచ్చిన హామీ నెరవేర్చారని, గిరిజన హక్కులు కాపాడేందుకు ఎస్టీ కమిషన్ తీసుకొచ్చారని ఆమె తెలిపారు. సీఎం జగన్‌కు గిరిజనులంతా రుణపడి ఉంటారని పుష్పశ్రీవాణి పేర్కొన్నారు.(చదవండి: నా ఇంటి నెంబరు 305..) -
‘వారిది తప్ప.. అందరి మద్దతు ఉంది’
సాక్షి, సింహాచలం: మూడు ప్రాంతాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ తో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. మంగళవారం గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజుతో కలిసి ఆయన సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. రెండు రాజధానులు అనే ప్రక్రియ బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు ఉచ్చులో పడిన 29 గ్రామాల ప్రజలు మినహా ప్రజలందరూ మూడు రాజధానులకు మద్దతుగా ఉన్నారని ఆయన తెలిపారు. పేదలకు ఆస్తి ఇవ్వబోతున్నాం.. ఇళ్ల స్థలాల పంపిణీ ద్వారా పేదలకు ఆస్తి ఇవ్వబోతున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలోనే భారీస్థాయిలో ఇళ్ల పట్టాలివ్వడం దేశంలోనే ప్రథమం అని తెలిపారు. 25 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ ప్రపంచ రికార్డు అని పేర్కొన్నారు. పేదలకు పట్టాలు పంపిణీ చేస్తుంటే టీడీపీకి ఎందుకంత బాధ అని ప్రశ్నించారు. టీడీపీ నేతల విమర్శలు దారుణమన్నారు. పేదలకి ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని వెల్లడించారు. తమ ప్రభుత్వం కన్నీళ్లు తుడిచే ప్రభుత్వమే కానీ.. కన్నీళ్లు పెట్టించే ప్రభుత్వం కాదన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీలో నిబంధనలకి విరుద్దంగా వ్యవహరించటం లేదని సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. చంద్రబాబు, యనమల రామకృష్ణుడు తమ వైఫల్యాలను ప్రభుత్వం రుద్దాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడానికి టీడీపీ కుట్రలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. నిబంధనలకి విరుద్దంగా వ్యవహరిస్తే ఎలా..? విచక్షణాధికారాల పేరుతో మండలి చైర్మన్ నిబంధనలకి విరుద్దంగా వ్యవహరిస్తే ఎలా చెల్లుబాటు అవుతుందని సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటే తప్పనిసరిగా ఓటింగ్ జరగాలన్నారు. అలా కాకుండా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడం కుదరదన్నారు. ఈ నిబంధనలు తెలియకపోతే యనమల మరోసారి రూల్స్ బుక్ చదువుకోవాలని సూచించారు. ఉద్యోగులను బెదిరిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. తప్పు చేయని ఉద్యోగులందరికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సింహాచలంలో ఎస్టీ కమిషన్ పర్యటన రాష్ట్ర ఎస్టీ కమిషన్ కమిటీ సభ్యులు మంగళవారం సింహాచలం కొండపై పర్యటించారు. సింహాచలంపై ఉద్యోగాల రిజర్వేషన్ అమలుపై ఏపీ ఎస్టీ శాసన సభా కమిటీ చైర్మన్ బాలరాజు, సభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ ఆరా తీశారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధితో పాటు, రిజర్వేషన్ల అమలుపై సమగ్ర అధ్యయనం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు విశాఖ జిల్లాలో రెండు రోజులు పర్యటిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలో రోస్టర్ విధానంలో ఎస్టీ రిజర్వేషన్ అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఎస్సీ ఎస్టీ బిల్లుకూ అడ్డుపడతారా?
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు బిల్లుపై చర్చ జరగకుండా ప్రతిపక్ష టీడీపీ అడుగడుగునా అడ్డుపడటం మంగళవారం శాసనసభలో తీవ్ర వాగ్యుద్ధానికి దారి తీసింది. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలతో సభను అడ్డుకునేందుకు ప్రయత్నించగా దళితుల హక్కులను కాలరాసేలా వ్యవహరించడంపై వైఎస్సార్ సీపీ సభ్యులు మండిపడ్డారు. స్పీకర్ అనుమతితో మంత్రి విశ్వరూప్ ఈ బిల్లును సభ ముందుంచారు. దీనిపై మాట్లాడేందుకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌కు అవకాశం ఇచ్చారు. చంద్రబాబు దళిత ద్వేషి: వరప్రసాద్ బిల్లుపై చర్చను అడ్డుకుంటూ టీడీపీ ఆందోళనకు దిగడంపై ఎమ్మెల్యే వరప్రసాద్ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలను అవమానించిన చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు. ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా? అని చులకనగా మాట్లాడిన వ్యక్తి రాజకీయాల్లో కొనసాగేందుకు అర్హుడేనా అని ప్రశ్నించారు. నవరత్నాలు పేదలకు ఎలా ఉపయోగపడుతున్నాయో టీడీపీ నేతలు ఆలోచన చేయాలన్నారు. పేదలు ఉన్నత చదువులు చదవకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. పసుపు కుంకుమ పేరుతో టీడీపీ ఖజానాను ఖాళీ చేసిందని మంత్రి అనిల్ అన్నారు. ఎస్సీలను తొలగించిన చరిత్ర బాబుది: పుష్ప శ్రీవాణి దళితులంటే టీడీపీకి ఎంత వ్యతిరేకత ఉందో బిల్లుపై చర్చను అడ్డుకోవడం ద్వారా తెలుస్తోందని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి చెప్పారు. మంత్రివర్గం నుంచి ఎస్సీలను తొలగించిన చరిత్ర చంద్రబాబుదన్నారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో సగం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. ఐదుగురు ఎస్సీలకు మంత్రి పదవులు ఇచ్చారని, ఎస్టీల్లో ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారన్నారు. కాగా, దళితుల సంక్షేమం టీడీపీకి పట్టదని ఎమ్మెల్యే నాగార్జున విమర్శించారు. మహిళా మంత్రులను అవమానిస్తున్నారు: రోజా ఎస్సీ ఎస్టీ బిల్లుపై మాట్లాడుతున్న మహిళా మంత్రిని అడ్డుకోవడం టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతంలో చంద్రబాబు ఎందుకు శాశ్వత కట్టడాలు చేపట్టలేదని ప్రశ్నించారు. తనను కేసీఆర్ పొగిడినట్లు చంద్రబాబు చెబుతున్నారని అయితే నిజానికి చంద్రబాబు లాంటి డర్టీ పొలిటీషియన్ లేరని ఆయన అన్నారని తెలిపారు. మహిళా మంత్రులు మాట్లాడుతుంటే టీడీపీ నేతలు అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాలు బతికే దాన్ని సామాజిక రాజధాని అంటారని, సామాజిక వర్గానికి ఒక రాజధాని కావాలని వీళ్లు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంతంలో ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబ సభ్యులు భూములు కొన్నారని, నక్కా ఆనంద్‌బాబు ఎందుకు కొనలేదని ప్రశ్నించారు. అనంతపురం నుంచి వచ్చి పయ్యావుల కేశవ్ భూములు కొన్నారని, కానీ యామినిబాల ఎందుకు కొనుగోలు చేయలేదని నిలదీశారు. బిల్లుకు అడ్డుపడుతున్న టీడీపీ తీరుపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కె.కన్నబాబు, సుధాకర్‌బాబు, గొల్ల బాబూరావు, జోగారావు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. -
ఎరుకల స్థితిగతులపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తా
హైదరాబాద్: కోయలు, గోండులు, చెంచులు, ఎరుకల, పెంట కులస్తుల స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక నివేదికనిస్తానని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో పందుల పెంపకానికి ఎరుకల కులస్తులకు ఉపయోగపడే విధంగా ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మంగళవారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం(టీపీవైఎస్) ఆధ్వర్యంలో 35మంది ఎరుకల కులస్తులకు ఏకలవ్య అవార్డులను ఆయన ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరుకల కులస్తుల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. ఎస్సీ, ఎస్టీ, కమిషన్‌లో 27,033 కేసులు పెండింగ్‌లో ఉండగా వాటిలో 26వేల కేసులను పరిష్కరించామన్నారు. అణగారిన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూతాడి కుమార్, ప్రధాన కార్యదర్శి లోకిని రాజు, నాయకులు వి.రమణ, రమేశ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పిట్టలగూడేనికి తరలిన యంత్రాంగం
రఘునాథపల్లి : ఎస్సీ, ఎస్టీ కమిషన్ అంటే అంత చులకనా..? చైర్మన్ వచ్చినా పట్టించుకోరా.. అధికారులు ఎక్కడ..? చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తా అంటూ ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రొళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. మండలంలోని భాంజీపేట శివారు పిట్టలగూడెంలో చైర్మన్ నిద్రిస్తున్నారని తెలిసి గురువారం తెల్లారేసరికి ఆగమేఘాల మీద అక్కడికి చేరుకున్నారు. అధికారులతో కలిసి చైర్మన్ పిట్టలగూడెం వాసుల పరిస్థితిని పరిశీలించారు. దాదాపు 78 కుటుంబాలు గుడిసెల్లో నివసించడం, మరుగుదొడ్లు, కనీసం విద్యుత్ సరఫరా కూడ లేక పోవడంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పిట్టలగూడెం వాసులు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు. వారి సమస్యలు అధికారుల సమావేశంలో చైర్మన్ వివరించగా కలెక్టర్ నోట్ చేసుకున్నారు. చైర్మన్ మాట్లాడుతూ మినీ అంగన్వాడీ కేంద్రం మంజూరైనా ప్రారంభంకాకపోవడం, ఉపాధి పథకం అమలు కావడం లేదని, రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డు, ఆసరా పింఛన్లు, సీసీ రోడ్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి ఒక్క పెళ్లి మాత్రమే చేసుకోవాలని, ఇద్దరు పిల్లలే ముద్దు అని, మూఢ నమ్మకాలను విశ్వసించవద్దని, దైవభక్తి ఉండడంలో తప్పు లేదని, బలుల పేరుతో డబ్బులు వృథా చేయకుండా ఉన్నంతలో పండుగలు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని గూడెంవాసులకు సూచించారు. స్థానికుల సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను చైర్మన్ ఆదేశించారు. వారంలోపే సమస్యలు పరిష్కరిస్తాం ఏనెబావి, భాంజీపేట శివారు పిట్టలగూడెంలలో స్థానికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు వారం రోజుల్లో పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. భాంజీపేట పిట్టలగూడెంలో పదో తరగతి చదివిన మహిళలు లేనందున , ఏడో తరగతి చదివిన వారికి మినీ అంగన్వాడి టీచర్‌గా అవకాశం కల్పిస్తామని, అర్హులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. సీసీ రోడ్లు, వేయిస్తామని, అందుబాటులో ఉన్న స్థలంలో 78 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపుతామని చెప్పారు. మిషన్ భగీరథలో ఇంటింటికి నల్లా నీటిని సరఫరా చేస్తామన్నారు. మరుగుదొడ్లు నిర్మిస్తామని, అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన వారికి పట్టాలు అందజేస్తామని, పాడి గేదెలు, ఆధార్, రేషన్ కార్డులు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. లేఅవుట్, కమ్యునిటి భవనం కోసం రూ 10 లక్షలు డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరుకు ముందే ప్రభుత్వ స్థలంలో లేఔట్ చేసేందుకు అవసరమయ్యే రోడ్లకు రూ.5 లక్షలు, కమ్యునిటి భవన నిర్మాణానికి రూ.5 లక్షలు తన నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే రాజయ్య ప్రకటించారు. ప్రభుత్వ భూములను మూడు ఎకరాల చొప్పున పంపిణీ చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాజారపు ప్రతాప్ మాట్లాడుతూ తాను దత్తత తీసుకున్న పిట్టలగూడెం గ్రామానికి కేసీఆర్ నగర్‌గా నామకరణం చేశామన్నారు. గూడెంలో పూర్తి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముఖ్య మంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి బంగారు కేసీఆర్ నగర్‌గా రూపొందిస్తామని ఆయన పేర్కొన్నారు. కమిషన్ సభ్యుడు రాంబల్‌నాయక్, బుడిగ జంగాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింతల మల్లికా ర్జున్, ఎస్సీ కార్పొరేషన్ అధికారి గట్టుమల్లు, తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, ఎంపీడీఓ సరిత, ఈఓపీఆర్డీ గంగాభవాని, డాక్టర్ సుగుణాకర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శివకుమార్, మాజీ ఉప సర్పంచ్ రాంచందర్, నాయకులు మారుజోడు రాంబాబు, రవి, ప్రభాకర్ పాల్గొన్నారు. -
నిర్వాసితులకు రాళ్ల భూములిచ్చారు : ఎస్టీ కమిషన్
సాక్షి, న్యూఢిల్లీ : ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్టు వల్ల ప్రభావితమయ్యే గిరిజనులకు కల్పించాల్సిన పునరావాసంపై రాష్ట్రపతికి జాతీయ గిరిజన కమిషన్ మంగళవారం నివేదిక అందజేసింది. పోలవరం కమాండ్ ఏరియాలో గిరిజనులకు సాగుభూమి ఇవ్వాలని సిఫారసు చేసింది. భూ సేకరణ చట్టం ప్రకారం గిరిజనులకు నష్టపరిహారం చెల్లించాలని సూచించింది. ఈ మేరకు ఆర్టికల్ 338 ఎ(5) ప్రకారం ఏపీ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను కమిషన్ సూచించింది. రాజ్యాంగ రక్షణలు, సంక్షేమం, సామాజిక ఆర్థికాభివృద్ధి అంశాలను సమర్ధవంతంగా అమలు చేయాలని చెప్పింది. ఈ ఏడాది మార్చి 26 నుంచి 28 వరకూ పోలవరం ప్రాజెక్టు ప్రాంతాలను గిరిజన కమిషన్ సభ్యులు సందర్శించిన విషయం తెలిసిందే. నివేదికలోని ముఖ్యాంశాలు : - గిరిజనుల వద్ద భూమి తీసుకుని సాగుకు అనుకూలత లేని, రాళ్లు రప్పలతో కూడిన భూమిని ఇచ్చారు. వీరికి పోలవరం కమాండ్ ఏరియాలో సాగుభూమిని ఇవ్వాలి. - కనీసం 2.5 ఎకరాల సాగుభూమిని ప్రాజెక్టు కింద ఇవ్వాలి. - అటవీ ఉత్పత్తులపై ఆధారపడి గిరిజనులకు ప్రత్యామ్నాయ జీవనోపాధిని కల్పించాలి. - వరదల్లో కూలిపోయిన ఇద్దికులకొట్ట గ్రామంలోని ఇళ్లను తిరిగి నిర్మించి ఇవ్వాలి. - గిరిజనులకు పరిహారం అంశాన్ని సుమొటోగా స్వీకరించి పునఃసమీక్షించాలి. - సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా భూ సేకరణ చట్టం ప్రకారం తగిన పరిహారాన్ని అందజేయాలి. - పునరావాస చర్యల్లో భాగంగా గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. - కాలేజీలు, యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలి. - పరిహార, పునరావాస కార్యక్రమాల బాధ్యతలు అన్నీ ఆర్ అండ్ ఆర్ కమిషనర్‌కే ఇవ్వాలి. - ప్రాజెక్టుకు పూర్తి కావడానికి నాలుగు నెలల ముందే ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేయాలి. - ప్రాజెక్టు ప్రభావితులకు పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించాలి. - వీటన్నిటి పర్యవేక్షించే ఆర్ అండ్ ఆర్ అధికారులను బదిలీ చేయకూడదు. ప్రాజెక్టు పూర్తైన ఐదేళ్ల వరకూ అక్కడే సేవలందించాలి. -
ప్రతినెలా 30న సివిల్ రైట్స్ డే
సాక్షి, హైదరాబాద్: ప్రతినెలా 30న జిల్లా కేంద్రాల్లో సివిల్ రైట్స్ డే నిర్వహించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా స్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీల ఆధ్వర్యంలోనే సివిల్ రైట్స్ డే నిర్వహించాలని పేర్కొంది. సివిల్ రైట్స్ డేని మండల, గ్రామ స్థాయిలో నిర్వహిస్తే ప్రజల సమస్యలపై యంత్రాంగానికి స్పష్టత వస్తుందని, పథకాల అమలులో సత్వర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. శనివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అధ్యక్షతన స్వయం ఉపాధి, బ్యాంకు లింకు పథకాలపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాయితీ పథకాల లబ్ధిదారులకు సకాలంలో నిధులు మంజూరు చేయాలని, కాలయాపన చేస్తే గ్రౌండింగ్ కష్టమవుతుందన్నారు. పథకాల అమలుపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని, క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. -
ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలి
మంగళగిరి: రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే ఎస్టీ కమిషన్ వేసి తమ సమస్యలు పరిష్కరించాలని స్టద్వా (షెడ్యూల్ ట్రైబల్స్ అవేర్నెస్ డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోషియేషన్) అధ్యక్షుడు ఎం.కొండలరావు డిమాండ్ చేశారు. కొత్తపేటలోని స్టద్వా కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కొండలరావు మాట్లాడుతూ.. ఎస్టీ కమిషన్ ఏర్పాటుచేయడమే కాక గిరిజనులకే గిరిజన మంత్రిత్వ శాఖ కేటాయించి వారి అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు మొగిలి మధు మాట్లాడుతూ.. గిరిజనుల ఆస్తులను ఆక్రమించినవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యవర్గ సమావేశంలో చేసిన తీర్మానాలను ప్రభుత్వానికి పంపి అమలయ్యే వరకు పోరాడతామని హెచ్చరించారు. -
బ్యాక్లాగ్ పోస్ట్‌లు భర్తీ చేయండి!
సమీక్ష సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కారెం శివాజీ ఆదేశం ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అధ్యాపక, అధ్యాపకేతర ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ ఆదేశించారు. యూనివర్సిటీలోని పరిపాలన, కార్యనిర్వహణ, ఉద్యోగులు, పరిశోధకులు, విద్యార్థులకు సంబంధించిన అంశాల్లో ఎస్సీ, ఎస్టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పాయింట్లు తదితర అంశాలపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. యూనివర్సిటీలో ఉన్న పరిపాలనపరమైన పదవులు, పాలక మండలి సభ్యుల సంఖ్య, ఉద్యోగుల పదోన్నతుల అంశాలు, వారిలో ఎస్సీ, ఎస్టీలు ఎంత మంది ఉన్నారనే అంశాలను వర్సిటీ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్వీస్ రిజిస్టర్లు సక్రమంగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2009 నుంచి సర్వీస్ రిజిస్టర్లు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర అంశాలను సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో ఎందుకు ఆడిట్ చేయించలేదని ప్రశ్నించారు. చాలా కాలంగా వర్సిటీలో అధ్యాపక, అధ్యాపకేతర బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయటం లేదని, వాటి భర్తీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్‌కు సూచించారు. ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం, సమన్వయానికి వారం రోజుల్లో లైజన్ ఆఫీసర్‌ను నియమించాలని చైర్మన్ ఆదేశించారు. సమావేశంలో రెక్టార్ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య కె.జాన్‌పాల్, పలువురు పాలక మండలి సభ్యులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తాం.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు మూడు వేల ఎస్సీ, ఎస్టీ బ్యాగ్‌లాగ్ పోస్టులను ఆయా శాఖలో భర్తీ చేశారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కారెం శివాజి తెలిపారు. యూనివర్సిటీలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం మరో విడత ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. యూనివర్సిటీల్లో కుల వివక్షతను రూపుమాపాలని, అసమానతలకు తావివ్వకూడదని పేర్కొన్నారు. వర్సిటీల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు. -
త్వరలో ఎస్టీ కమిషన్ మధ్యంతర నివేదిక
సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలోనే.. సాక్షి, హైదరాబాద్: కాయతీ లంబాడా, వాల్మీకి బోయలను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చే అంశంపై జరిపిన పరిశీలనకు సంబంధించి ప్రభుత్వానికి త్వరలో ఎస్టీ కమిషన్ మధ్యంతర నివేదిక సమర్పించనుంది. పూర్తిస్థాయి నివేదికకు సమయం పట్టనుండటంతో మధ్యంతర నివేదికను సమర్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. జూలై ఆఖరులోగా నివేదిక సమర్పించాలని కమిషన్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించడంతో మధ్యంతర నివేదికను రూపొందించడంలో నిమగ్నమయ్యారు. గురువారం సచివాలయంలో ఎస్టీ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎస్.చెల్లప్ప, సభ్యులు సమావేశమయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10% వరకు ఎస్టీల జనాభా ఉన్నందున, కొత్త కులాలను కలిపి 12 శాతానికి పెంచాలన్న ప్రభుత్వ ఆలోచనను పక్కనపెట్టి 10% రిజర్వేషన్లు కల్పించాలని కొన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు కొన్ని ఎస్టీ సంఘాలు ఈ విషయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. -
'సంక్షేమం పట్టని ప్రభుత్వరంగ బ్యాంకులు'
► దళిత, గిరిజనుల వెనుకబాటుకు అవే కారణం ► రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ శివాజీ ధ్వజం కాకినాడ సిటీ: ప్రభుత్వరంగ బ్యాంకులు మార్వాడీ వ్యవస్థను తలపిస్తూ వ్యాపారం చేస్తున్నాయే తప్ప ప్రజల సంక్షేమం పట్టించుకోవడం లేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ విమర్శించారు. గురువారం కాకినాడ ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దళిత, గిరిజనుల వెనుకబాటుతనానికి ప్రభుత్వ రంగంలోని బ్యాంకింగ్ వ్యవస్థే కారణమన్నారు. కార్పొరేట్లకు ఇష్టానుసారం రుణాలిచ్చే ప్రభుత్వరంగ బ్యాంకులు నిరుపేద ఎస్సీ, ఎస్టీ తదితర వర్గాలను బ్యాంకుల చుట్టూ తిప్పించుకుంటూ పొట్ట కొడుతున్నాయన్నారు. బ్యాంకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను సైతం పట్టించుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కులవివక్ష నిర్మూలనకు కమిషన్ చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. పోలీసులు అట్రాసిటీ కేసుల విషయంలో దోషులకు కొమ్ము కాస్తున్నారని వ్యాఖ్యానించారు. పోలీసు, రెవెన్యూ శాఖల ప్రక్షాళనకు కమిషన్ చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై వైఖరిని చెప్పాలని విలేకరులు కోరగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం ఎంతైనా ఉందని, హోదా రాకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు. విలేకరుల సమావేశంలో మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు ధనరాశి శ్యామ్‌సుందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి
రాయచూరు రూరల్ : ఆంధ్రప్రదేశ్‌లో ఎస్టీలకు సామాజిక న్యాయం కోసం కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ అధ్యక్షుడు కారెం శివాజీ తెలిపారు. ఆదివారం ఆయన రాయచూరులో విలేకరులతో మాట్లాడారు. దళితులకు సమాన న్యాయం కోసం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి అన్ని రంగాల్లో రిజర్వేషన్ కల్పించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బలిజ సమాజానికి అధికంగా స్థానాలు కేటాయించామన్నారు. మరోవైపు దళితులకు కేటాయించిన భూములు కూడా సక్రమంగా పంపిణీ కాకుండా ఉన్నాయని, దానిపై కూడా చర్యలు చేపట్టి పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని దళితులకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా సదాశివ కమిషన్ నివేదిక సిఫార్సులను త్వరితగతిన అమలు పర్చేందుకు సంబంధించి ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు సమర్పించారని, వాటిని అమలు పర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్న విషయంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. -
ఎయిర్ ఇండియాపై ఎయిర్ హోస్టెస్ ఫిర్యాదు
♦ విధులు కేటాయించలేదని ఎస్టీ కమిషన్‌కు ఆవేదన ♦ 2008 నుంచి వేతనం ఇవ్వలేదని ఆందోళన సాక్షి, న్యూఢిల్లీ: తనకు అకారణంగా ఎయిర్ హోస్టెస్‌గా విధులు కేటాయించకుండా తీవ్ర మానసిక వేదనకు గురిచేశారని ఎయిర్ ఇండియా ఉద్యోగిని బి.ఝాన్సీరాణి సంబంధిత సంస్థపై జాతీయ ఎస్టీ కమిషన్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా.. ‘నేను షెడ్యూలు తెగకు చెందిన కోయ సామాజిక వర్గానికి చెందిన మహిళను. భద్రాచలం ఏజెన్సీ నుంచి వచ్చి ప్రస్తుతం సికింద్రాబాద్‌లో నివసిస్తున్నా. నేను ఎయిర్ఇండియాలో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేశా. దాదాపు 27 ఏళ్ల పాటు పనిచేసిన నాకు ఎయిర్ హోస్టెస్‌గా విధులు కేటాయించడం మానేశారు. 2008 నుంచి నాకు ఇప్పటి వరకు వేతనం చెల్లించలేదు. వైద్య ప్రయోజనాలు కల్పించలేదు. ఇప్పటివరకు అటు పీఎఫ్ గానీ, గ్రాట్యుటీ చెల్లింపు విషయంగానీ తేల్చలేదు. నాపై ఆధారపడిన నా ఇద్దరు కూతుళ్లకు నేను చదువుకునేందుకు డబ్బులు చెల్లించలేకపోతున్నా. ఇప్పటివరకు నా కుటుంబాన్ని పోషించుకునేందుకు నానాకష్టాలు పడ్డా. ఈ వయసులో నేను కొత్తగా ఉద్యోగాన్ని పొందలేక పోతున్నా. అందువల్ల నాకు రావాల్సిన వేతనం ఇప్పించాలని వేడుకుంటున్నా. నన్ను ఇన్నాళ్లు వేధించినందుకు నాకు పరిహారం ఇప్పించాలని కోరుకుంటున్నా. నా తోటి ఉద్యోగులకు ఇచ్చిన తరహాలో అన్ని రకాల పదోన్నతులతో సహా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నా. నాకు, నాకుటుంబానికి మనోవేదన కలిగించినందుకు రూ. 5 కోట్ల పరిహారం ఇప్పించాలని ప్రార్థిస్తున్నా.. ’ అని ఆమె తన ఫిర్యాదులో ఎస్టీ కమిషన్‌కు వేడుకున్నారు. -
ఎస్టీ కమిషన్ చైర్మన్‌తో చెల్లప్ప భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని బోయ, ఖైతీ లంబాడ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చే విషయమై అధ్యయానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెల్లప్ప కమిటీ సోమవారం జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ రామేశ్వర్ ఓరమ్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి తరుణ్ ఝాతో భేటీ అయింది. అనంతరం తెలంగాణ భవన్లో ఎస్టీ విచారణ కమిషన్ సభ్యులు నాగు, జగన్నాథరావు, కమిషన్ కార్యదర్శి వీరమల్లుతో కలసి చెల్లప్ప విలేకరులతో మాట్లాడారు. బోయ, ఖైతీ లంబాడ కులాలను ఎస్టీ జాబితాలో కలిపే విషయంలో వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శాస్త్రీయంగా, సాంకేతికంగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని, మేధావులు, నిపుణులతో చర్చించి సిఫార్సులు చేయాలని ఎస్టీ కమిషన్ చైర్మన్ రామేశ్వర్ ఓరమ్ సూచించారన్నారు. బోయ, ఖైతీ లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చే విషయంలో క్షేత్రస్థాయిలో గిరిజనుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పారు. రెండు కులాల జీవన స్థితిగతులు, ప్రజాభిప్రాయసేకరణ, ఇతర వివరాలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందచేస్తామని, రాష్ట్రం కేంద్రానికి అందజేస్తుందన్నారు. కేంద్ర హోంశాఖ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. -
అధ్యయనం తర్వాతే ఎస్టీ జాబితాపై సర్కారుకు నివేదిక
ప్రగతినగర్(నిజామాబాద్): సుదీర్ఘ అద్యయనం తర్వాతే కాయతీ లంబాడీలు, వాల్మీకీ బోయలను షెడ్యూల్డ్ కులాల (ఎస్టీ) జాబితాలో చేర్చే విషయమై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని, ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ చెల్లప్ప తెలిపారు. బుధవారం ఆయన నిజామాబాద్‌లోని ప్రగతి భవన్లో కాయతీ లంబాడీ,వాల్మీకీ బోయ, బంజారా సేవా సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించారు. తాము నివేదిక ఇచ్చిన అనంతరం ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 33 తెగలకు ఆరు శాతం రిజర్వేషన్ మాత్రమే ఉండేదని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర విభజన అనంతరం జనాభా ప్రాతిపదికన ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని అనుకుంటున్నారని చెప్పారు. ఈ మేరకే ఎస్టీ కమిషన్ తెలంగాణ ప్రాంతంలో విచారణ జరుపుతోందన్నారు. ఇందుకోసం ఆరు నెలల గడువు ఇచ్చిందని, గడుపు లోపు తెలంగాణలోని అన్ని జిల్లాలో ఉన్న కాయతీ లంబాడీ, వాల్మీకి బోయలకు సంబంధించి ఆర్థిక స్థితిగతులు, ఆచార సాంప్రదాయాలు తదితర విషయాలపై సమగ్ర అధ్యయనం చేస్తామని చెప్పారు. కాయతీ లంబాడీలు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. -
వాల్మీకిబోయ, కాయతీ లంబాడాలపై సర్వే
- దానిపై న్యాయనిపుణుల సలహాలు స్వీకరిస్తాం - ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎస్.చెల్లప్ప వెల్లడి హైదరాబాద్: రాష్ర్టంలోని వాల్మీకిబోయ, కాయతీ లంబాడాల వెనకబాటుకు సంబంధించిన వివరాలను తాజా సర్వే ద్వారా సేకరించాల్సి ఉందని ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.ఎస్.చెల్లప్ప వెల్లడించారు. ఈ రెండు కులాలను ఎస్టీ జాబితాలో చేర్చే విషయంపై ప్రభుత్వం తమ కమిషన్‌ను ఏర్పాటు చేసినందున తాము స్వతంత్రంగా పరిశీలన చేపట్టాల్సి ఉందన్నారు. సోమవారం ఎస్టీ కమిషన్ సభ్యులు కె.జగన్నాథరావు, హెచ్.కె.నాగుతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగంలోని 15(4), 16(4) ప్రకారం ఆయా కులాలు సామాజిక , ఆర్థిక, విద్యాపరంగా ఎంత మేరకు వెనుకబడి ఉన్నాయనేది తేల్చడమే కమిషన్ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. న్యాయనిపుణులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసి ఏయే అంశాల ప్రాతిపదికన సర్వే నిర్వహించాలనే దానిపై ఒక అభిప్రాయానికి వస్తామన్నారు. ఆ తర్వాత దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. వాల్మీకిబోయలకు సంబంధించి మహబూబ్నగర్జిల్లాలో పరిశీలన జరిపామని, ఇంకా ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వాల్మీకిబోయలున్నారని చెప్పారు. కాయతీ లంబాడీల జనాభా ఎక్కువగా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉందని, మంగళవారం నుంచి (5-7 తేదీల మధ్య) నిజామాబాద్ జిల్లాలో పరిశీలన జరుపుతామన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై సరైన సర్వే జరగకపోవడాన్ని కోర్టు తప్పుబట్టడంతో సమస్య వచ్చిందని చెప్పారు. ఎస్టీ కమిషన్‌కు చట్టబద్ధత పై వివిధసంఘాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలపై ప్రశ్నించగా, 1968లో నియమించిన అనంతరామన్ కమిషన్ జ్యుడీషియల్ కమిషన్ కాకపోయినా.. 27 శాతం బీసీ రిజర్వేషన్లపై వారు చేసిన సిఫార్సు ఇప్పటికీ ప్రాతిపదికగానే ఉందని చెల్లప్ప జవాబిచ్చారు. రాష్ర్టంలో మొత్తం 3.6 లక్షల జనాభా ఉన్న వాల్మీకిబోయల్లో, మహబూబ్నగర్జిల్లాలోనే 2.5 లక్షలున్నట్లు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తెలుస్తోందన్నారు. -
హౌసింగ్ ప్రత్యేకాధికారి విచారణ
రామచంద్రపురం :బిల్లుల చెల్లింపులో కక్ష సాధింపులకు గురిచేస్తున్నారనే దళితుల ఫిర్యాదుపై స్పందించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు గృహ నిర్మాణ శాఖ మూడు జిల్లాల ప్రత్యేకాధికారి కుమార స్వామి స్థానిక హౌసింగ్ ఈఈ కార్యాలయంలో మంగళవారం విచారణ నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏడాదిన్నర కాలంగా తమకు హౌసింగ్ బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రామచంద్రపురం మండలం కందులపాలేనికి చెందిన పలివెల దుర్గాప్రసాద్, కోలమూరి నాగరాజు, కోలమూరి ముసలయ్య ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. దాంతో కమిషన్ ఆదేశాల మేర కు బాధితులతో విచారణ నిర్వహించి, రికార్డులను పరిశీలించేందుకు తాను వచ్చినట్టు కుమారస్వామి తెలిపారు. ఇదే విషయాన్ని జిల్లాలోని గ్రీవెన్స్‌సెల్‌లో హౌసింగ్ ఏఈ, డీఈ, ఈఈలకు తెలిపినప్పటికీ పట్టించుకోలేదని కందులపాలేనికి చెందిన పది దళిత కుటుంబాలవారు పేర్కొన్నారు. దాంతో తాము లోకాయుక్తను ఆశ్రయించామన్నారు. అప్పుడు బేస్మెంట్ బిల్లులు చెల్లించిన అధికారులు ఆ తర్వాత తమకు బిల్లులు రాకుండా చేశారన్నారు. మొదటి బిల్లులు చెల్లించి ఏడాది కావస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి బిల్లులు చెల్లించలేదని బాధితులు దుర్గాప్రసాద్, నాగరాజు, ముసలయ్య వాపోయారు. తాము ఎస్సీ ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించడంతో హౌసింగ్ అధికారులు ఇప్పటికీ తమను బెదిరిస్తున్నారన్నారు. తమకు న్యాయం చేయాలని విచారణాధికారికి విన్నవించుకున్నట్టు వారు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిల్లి శేషగిరి, పెంకే వీరబాబు బాధితులతో కలసి విచారణలో పాల్గొన్నారు.