బ్యాక్‌లాగ్ పోస్ట్‌లు భర్తీ చేయండి!
బ్యాక్‌లాగ్ పోస్ట్‌లు భర్తీ చేయండి!
Published Thu, Sep 8 2016 9:26 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
సమీక్ష సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కారెం శివాజీ ఆదేశం
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అధ్యాపక, అధ్యాపకేతర ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ ఆదేశించారు. యూనివర్సిటీలోని పరిపాలన, కార్యనిర్వహణ, ఉద్యోగులు, పరిశోధకులు, విద్యార్థులకు సంబంధించిన అంశాల్లో ఎస్సీ, ఎస్టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పాయింట్లు తదితర అంశాలపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. యూనివర్సిటీలో ఉన్న పరిపాలనపరమైన పదవులు, పాలక మండలి సభ్యుల సంఖ్య, ఉద్యోగుల పదోన్నతుల అంశాలు, వారిలో ఎస్సీ, ఎస్టీలు ఎంత మంది ఉన్నారనే అంశాలను వర్సిటీ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్వీస్ రిజిస్టర్లు సక్రమంగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2009 నుంచి సర్వీస్ రిజిస్టర్లు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర అంశాలను సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో ఎందుకు ఆడిట్ చేయించలేదని ప్రశ్నించారు. చాలా కాలంగా వర్సిటీలో అధ్యాపక, అధ్యాపకేతర బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయటం లేదని, వాటి భర్తీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్‌కు సూచించారు. ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం, సమన్వయానికి వారం రోజుల్లో లైజన్ ఆఫీసర్‌ను నియమించాలని చైర్మన్ ఆదేశించారు. సమావేశంలో రెక్టార్ ఆచార్య కేఆర్‌ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య కె.జాన్‌పాల్, పలువురు పాలక మండలి సభ్యులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేస్తాం..
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు మూడు వేల ఎస్సీ, ఎస్టీ బ్యాగ్‌లాగ్ పోస్టులను ఆయా శాఖలో భర్తీ చేశారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కారెం శివాజి తెలిపారు. యూనివర్సిటీలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ కోసం మరో విడత ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. యూనివర్సిటీల్లో కుల వివక్షతను రూపుమాపాలని, అసమానతలకు తావివ్వకూడదని పేర్కొన్నారు. వర్సిటీల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు.
Advertisement
Advertisement