► దళిత, గిరిజనుల వెనుకబాటుకు అవే కారణం
► రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ శివాజీ ధ్వజం
కాకినాడ సిటీ: ప్రభుత్వరంగ బ్యాంకులు మార్వాడీ వ్యవస్థను తలపిస్తూ వ్యాపారం చేస్తున్నాయే తప్ప ప్రజల సంక్షేమం పట్టించుకోవడం లేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ విమర్శించారు. గురువారం కాకినాడ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దళిత, గిరిజనుల వెనుకబాటుతనానికి ప్రభుత్వ రంగంలోని బ్యాంకింగ్ వ్యవస్థే కారణమన్నారు. కార్పొరేట్‌లకు ఇష్టానుసారం రుణాలిచ్చే ప్రభుత్వరంగ బ్యాంకులు నిరుపేద ఎస్సీ, ఎస్టీ తదితర వర్గాలను బ్యాంకుల చుట్టూ తిప్పించుకుంటూ పొట్ట కొడుతున్నాయన్నారు.
బ్యాంకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను సైతం పట్టించుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కులవివక్ష నిర్మూలనకు కమిషన్ చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. పోలీసులు అట్రాసిటీ కేసుల విషయంలో దోషులకు కొమ్ము కాస్తున్నారని వ్యాఖ్యానించారు. పోలీసు, రెవెన్యూ శాఖల ప్రక్షాళనకు కమిషన్ చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై వైఖరిని చెప్పాలని విలేకరులు కోరగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం ఎంతైనా ఉందని, హోదా రాకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు. విలేకరుల సమావేశంలో మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు ధనరాశి శ్యామ్‌సుందర్ తదితరులు పాల్గొన్నారు.
'సంక్షేమం పట్టని ప్రభుత్వరంగ బ్యాంకులు'
Published Thu, May 19 2016 8:30 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
Advertisement