రామచంద్రపురం :బిల్లుల చెల్లింపులో కక్ష సాధింపులకు గురిచేస్తున్నారనే దళితుల ఫిర్యాదుపై స్పందించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు గృహ నిర్మాణ శాఖ మూడు జిల్లాల ప్రత్యేకాధికారి కుమార స్వామి స్థానిక హౌసింగ్ ఈఈ కార్యాలయంలో మంగళవారం విచారణ నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏడాదిన్నర కాలంగా తమకు హౌసింగ్ బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రామచంద్రపురం మండలం కందులపాలేనికి చెందిన పలివెల దుర్గాప్రసాద్, కోలమూరి నాగరాజు, కోలమూరి ముసలయ్య ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. దాంతో కమిషన్ ఆదేశాల మేర కు బాధితులతో విచారణ నిర్వహించి, రికార్డులను పరిశీలించేందుకు తాను వచ్చినట్టు కుమారస్వామి తెలిపారు.
ఇదే విషయాన్ని జిల్లాలోని గ్రీవెన్స్‌సెల్‌లో హౌసింగ్ ఏఈ, డీఈ, ఈఈలకు తెలిపినప్పటికీ పట్టించుకోలేదని కందులపాలేనికి చెందిన పది దళిత కుటుంబాలవారు పేర్కొన్నారు. దాంతో తాము లోకాయుక్తను ఆశ్రయించామన్నారు. అప్పుడు బేస్‌మెంట్ బిల్లులు చెల్లించిన అధికారులు ఆ తర్వాత తమకు బిల్లులు రాకుండా చేశారన్నారు. మొదటి బిల్లులు చెల్లించి ఏడాది కావస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి బిల్లులు చెల్లించలేదని బాధితులు దుర్గాప్రసాద్, నాగరాజు, ముసలయ్య వాపోయారు. తాము ఎస్సీ ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించడంతో హౌసింగ్ అధికారులు ఇప్పటికీ తమను బెదిరిస్తున్నారన్నారు. తమకు న్యాయం చేయాలని విచారణాధికారికి విన్నవించుకున్నట్టు వారు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిల్లి శేషగిరి, పెంకే వీరబాబు బాధితులతో కలసి విచారణలో పాల్గొన్నారు.
హౌసింగ్ ప్రత్యేకాధికారి విచారణ
Published Wed, Aug 13 2014 1:01 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
Advertisement
Advertisement