‘వారిది తప్ప.. అందరి మద్దతు ఉంది’ | Deputy CM Pilli Subhash Chandra Bose Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం

Published Tue, Mar 3 2020 11:43 AM | Last Updated on Tue, Mar 3 2020 12:13 PM

Deputy CM Pilli Subhash Chandra Bose Comments On Chandrababu - Sakshi

సాక్షి, సింహాచలం: మూడు ప్రాంతాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ తో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. మంగళవారం గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజుతో కలిసి ఆయన సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ.. రెండు రాజధానులు అనే ప్రక్రియ బ్రిటిష్‌ కాలం నుంచి కొనసాగుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు ఉచ్చులో పడిన 29 గ్రామాల ప్రజలు మినహా ప్రజలందరూ మూడు రాజధానులకు మద్దతుగా ఉన్నారని ఆయన తెలిపారు.

పేదలకు ఆస్తి ఇవ్వబోతున్నాం..
ఇళ్ల స్థలాల పంపిణీ ద్వారా పేదలకు ఆస్తి ఇవ్వబోతున్నామని డిప్యూటీ  సీఎం తెలిపారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలోనే భారీస్థాయిలో ఇళ్ల పట్టాలివ్వడం దేశంలోనే ప్రథమం అని తెలిపారు. 25 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ ప్రపంచ రికార్డు అని పేర్కొన్నారు. పేదలకు పట్టాలు పంపిణీ చేస్తుంటే టీడీపీకి ఎందుకంత బాధ అని ప్రశ్నించారు.  టీడీపీ నేతల విమర్శలు దారుణమన్నారు. పేదలకి ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని వెల్లడించారు. తమ ప్రభుత్వం కన్నీళ్లు తుడిచే ప్రభుత్వమే కానీ.. కన్నీళ్లు పెట్టించే ప్రభుత్వం కాదన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీలో  నిబంధనలకి విరుద్దంగా వ్యవహరించటం లేదని సుభాష్‌ చంద్రబోస్‌ స్పష్టం చేశారు. చంద్రబాబు, యనమల రామకృష్ణుడు తమ వైఫల్యాలను ప్రభుత్వం రుద్దాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.  వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడానికి టీడీపీ కుట్రలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. 

నిబంధనలకి విరుద్దంగా వ్యవహరిస్తే ఎలా..?
విచక్షణాధికారాల పేరుతో మండలి చైర్మన్ నిబంధనలకి విరుద్దంగా వ్యవహరిస్తే ఎలా చెల్లుబాటు అవుతుందని సుభాష్‌ చంద్రబోస్‌ ప్రశ్నించారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటే తప్పనిసరిగా ఓటింగ్ జరగాలన్నారు. అలా కాకుండా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడం కుదరదన్నారు. ఈ నిబంధనలు తెలియకపోతే యనమల మరోసారి రూల్స్ బుక్ చదువుకోవాలని సూచించారు. ఉద్యోగులను బెదిరిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. తప్పు చేయని ఉద్యోగులందరికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

సింహాచలంలో ఎస్టీ కమిషన్‌ పర్యటన
రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ కమిటీ సభ్యులు మంగళవారం సింహాచలం కొండపై పర్యటించారు. సింహాచలంపై ఉద్యోగాల రిజర్వేషన్‌ అమలుపై  ఏపీ ఎస్టీ శాసన సభా కమిటీ చైర్మన్‌ బాలరాజు, సభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ ఆరా తీశారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధితో పాటు, రిజర్వేషన్ల అమలుపై సమగ్ర అధ్యయనం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు విశాఖ జిల్లాలో రెండు రోజులు పర్యటిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలో రోస్టర్‌ విధానంలో ఎస్టీ రిజర్వేషన్‌ అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement