వాల్మీకిబోయ, కాయతీ లంబాడాలపై సర్వే | survey tobe held on valmiki boya, katiya lambada says ST commission chairman | Sakshi
Sakshi News home page

వాల్మీకిబోయ, కాయతీ లంబాడాలపై సర్వే

Published Tue, May 5 2015 5:35 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM

వాల్మీకిబోయ, కాయతీ లంబాడాలపై సర్వే

వాల్మీకిబోయ, కాయతీ లంబాడాలపై సర్వే

- దానిపై న్యాయనిపుణుల సలహాలు స్వీకరిస్తాం
- ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎస్.చెల్లప్ప వెల్లడి
 
హైదరాబాద్:
రాష్ర్టంలోని వాల్మీకిబోయ, కాయతీ లంబాడాల వెనకబాటుకు సంబంధించిన వివరాలను తాజా సర్వే ద్వారా సేకరించాల్సి ఉందని ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.ఎస్.చెల్లప్ప వెల్లడించారు. ఈ రెండు కులాలను ఎస్టీ జాబితాలో చేర్చే విషయంపై ప్రభుత్వం తమ కమిషన్‌ను ఏర్పాటు చేసినందున తాము స్వతంత్రంగా పరిశీలన చేపట్టాల్సి ఉందన్నారు. సోమవారం ఎస్టీ కమిషన్ సభ్యులు కె.జగన్నాథరావు, హెచ్.కె.నాగుతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

రాజ్యాంగంలోని 15(4), 16(4) ప్రకారం ఆయా కులాలు సామాజిక , ఆర్థిక, విద్యాపరంగా ఎంత మేరకు వెనుకబడి ఉన్నాయనేది తేల్చడమే కమిషన్ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. న్యాయనిపుణులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసి ఏయే అంశాల ప్రాతిపదికన సర్వే నిర్వహించాలనే దానిపై ఒక అభిప్రాయానికి వస్తామన్నారు. ఆ తర్వాత దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. వాల్మీకిబోయలకు సంబంధించి మహబూబ్‌నగర్‌జిల్లాలో పరిశీలన జరిపామని, ఇంకా ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వాల్మీకిబోయలున్నారని చెప్పారు.

కాయతీ లంబాడీల జనాభా ఎక్కువగా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉందని, మంగళవారం నుంచి (5-7 తేదీల మధ్య) నిజామాబాద్ జిల్లాలో పరిశీలన జరుపుతామన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై సరైన సర్వే జరగకపోవడాన్ని కోర్టు తప్పుబట్టడంతో సమస్య వచ్చిందని చెప్పారు. ఎస్టీ కమిషన్‌కు చట్టబద్ధత పై వివిధసంఘాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలపై ప్రశ్నించగా, 1968లో నియమించిన అనంతరామన్ కమిషన్ జ్యుడీషియల్ కమిషన్ కాకపోయినా.. 27 శాతం బీసీ రిజర్వేషన్లపై వారు చేసిన సిఫార్సు ఇప్పటికీ ప్రాతిపదికగానే ఉందని చెల్లప్ప జవాబిచ్చారు. రాష్ర్టంలో మొత్తం 3.6 లక్షల జనాభా ఉన్న వాల్మీకిబోయల్లో, మహబూబ్‌నగర్‌జిల్లాలోనే 2.5 లక్షలున్నట్లు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తెలుస్తోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement