అధ్యయనం తర్వాతే ఎస్టీ జాబితాపై సర్కారుకు నివేదిక
ప్రగతినగర్(నిజామాబాద్): సుదీర్ఘ అద్యయనం తర్వాతే కాయతీ లంబాడీలు, వాల్మీకీ బోయలను షెడ్యూల్డ్ కులాల (ఎస్టీ) జాబితాలో చేర్చే విషయమై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని, ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ చెల్లప్ప తెలిపారు. బుధవారం ఆయన నిజామాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కాయతీ లంబాడీ,వాల్మీకీ బోయ, బంజారా సేవా సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించారు. తాము నివేదిక ఇచ్చిన అనంతరం ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 33 తెగలకు ఆరు శాతం రిజర్వేషన్ మాత్రమే ఉండేదని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర విభజన అనంతరం జనాభా ప్రాతిపదికన ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని అనుకుంటున్నారని చెప్పారు.
ఈ మేరకే ఎస్టీ కమిషన్ తెలంగాణ ప్రాంతంలో విచారణ జరుపుతోందన్నారు. ఇందుకోసం ఆరు నెలల గడువు ఇచ్చిందని, గడుపు లోపు తెలంగాణలోని అన్ని జిల్లాలో ఉన్న కాయతీ లంబాడీ, వాల్మీకి బోయలకు సంబంధించి ఆర్థిక స్థితిగతులు, ఆచార సాంప్రదాయాలు తదితర విషయాలపై సమగ్ర అధ్యయనం చేస్తామని చెప్పారు. కాయతీ లంబాడీలు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు.