చంద్రబాబు డైరెక్షన్‌లోనే రేవంత్ పాలన: ఎర్రోల్ల శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్‌లో రాజకీయ అవకాశాలు పొంది, పదవులు అనుభ వించి పార్టీలు మారుతున్న నేతలను రాళ్లతో కొట్టినా త ప్పులేదని బీఆర్‌ఎస్ నాయ కులు ఎర్రోల్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ రాజకీయ నాయకులు కొందరు రాజకీయ విలువలు లేని పవర్ బ్రోకర్లలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నేతలతో కలిసి శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలో అవకాశాలు లేక రాజకీయంగా వెంటిలేటర్‌పై ఉన్న నేతలకు కేసీఆర్ పదవులతో సంజీవని ఇచ్చి బతికించారు. ఎంతో మంది నేతలున్నా కడియం శ్రీహరికి కేసీఆర్ వరుస అవకాశాలు కల్పించారు. కడియం కారణంగానే తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్, పసునూరి దయాకర్ పార్టీకి దూరమయ్యారు. ఉద్యమంలో మేము త్యాగాలు చేస్తే కడియం లాంటి వాళ్లు భోగం అనుభవించారు.
బీఆర్‌ఎస్ ద్వారా సంక్రమించిన పదవులకు పార్టీ నుంచి బయటకు వెళ్లే వారు రాజీనామా చేయాలని, లేని పక్షంలో గతంలో రేవంత్‌రెడ్డి చెప్పినట్లు వారి ఇళ్ల ముందు చావు డప్పు కొట్టి, రాళ్లతో కొట్టాలి. కడియం లాంటి నేతల పట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండకపోతే మా తరహాలోనే నష్టపోతారు. కేసీఆర్‌ను తప్పు పట్టే అర్హత కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు లేదు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే కొందరు నేతలు కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. కేకే, కడియంకు బీఆర్‌ఎస్ పార్టీ ఏం తక్కువ చేసిందో చెప్పాలి’అని ఎర్రోల్ల శ్రీనివాస్ అన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తనకు అవకాశం ఇస్తే వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment