ఎస్సీ, ఎస్టీల లెక్క తేలింది
తెలంగాణలో 59 ఎస్సీ, 32 ఎస్టీ కులాలు
మన్నెదొర, తోటి కులం కూడా ఉన్నట్లు గుర్తింపు
విభజన ఉత్తర్వుల్లో స్పష్టం చేసిన ప్రభుత్వం
హన్మకొండ, రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలోని షెడ్యూల్డ్ కులాల లెక్క తేల్చారు. ఎస్సీ, ఎస్టీ వాస్తవ కులాలు, వాటి ఉపకులాలెన్ని.. ఏ ప్రాంతంలో ఎక్కువ.. కొన్ని ప్రాంతాలకే పరిమితమైన కులాలు..వీటన్నిటిపై స్పష్టంగా నివేదికల్లో పొందుపర్చారు. తెలంగాణ వ్యాప్తంగా 59 షెడ్యూల్ కులాలుం డగా కొన్నింటికి ఉపకులాలు కూడా ఉన్నాయి. 32 షెడ్యూల్ తెగలకు గాను ఉప కులాలు మరిన్ని ఉన్నా యి. ఎస్టీలకు సంబంధించి రెండు కులాలు మాత్రం కొన్ని జిల్లాల్లోనే ఉన్నట్లు జాబితాల్లో పేర్కొన్నారు. అయితే వీరి సంఖ్యను తేల్చలేదు. ఎస్టీ కులాల్లో ఎక్కువగా ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో ఉన్నట్లు గుర్తించారు. వీటిలో తోటి అనే ఎస్టీ కులం ఉనికి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో మన్నదొర కులం కూడా ఈ జిల్లాల్లోనే ఉన్నట్లు గుర్తిం చారు. గోదావరి పరీవాహక ప్రాంతంలోనే ఎస్టీలు, వాటి ఉప కులాలు నివాసం ఉంటున్నట్లు పేర్కొన్నారు. విభజన నేపథ్యంలో ఆంధ్ర కంటే తెలంగాణ ప్రాంతంలోనే ఎస్సీ, ఎస్టీ కులాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చారు.ఈ మేరకు రెండు రోజుల క్రితం గవర్నర్ నుంచి ఆయా జిల్లాల అధికారులకు ఉత్తర్వులు అందాయి.
ఉప కులాలూ ఎక్కువే: తెలంగాణలోని పది జిల్లాల్లో 59 షెడ్యూల్ కులాలుండగా వాటికి ఉప కులాలు సైతం ఎక్కువగానే ఉన్నాయి. ఎస్సీల జాబితాలోని చమర్ కులం పరిధిలో మోచి, మూచి, చమర్-రావిదాస్, చమర్-రొహిదాస్ కులాలున్నాయి. డక్కలకు ఉపకులంగా డక్కలవార్, దోమ్‌కు దోంబేరా, పైడీ, పానో, ఎల్లమల్వార్‌కు ఎల్లమ్మలవాండ్లు, ఘాసీ కులానికి హద్దీ, రేలీ, చెంచడి ఉప కులాలున్నాయి. కొలుపువాళ్ల కులానికి పంబాడా, పంబండా, పంబాల కులాలు, మాదాసి కురువ, మాదారి కురువగా గుర్తించారు. మాదిగ దాసుకు మస్తీం, మాల కులానికి మాల అయ్యవారు మాలా సాలీ, నేతాని కులాలు ఉప కులాలుగా ఉన్నట్లు నివేదికల్లో పేర్కొన్నారు. ఎస్టీ కులాల్లోనూ ఉప కులాలు అధికంగానే ఉన్నాయని జాబితాలో లెక్కగట్టారు. ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ ప్రాంతాల్లో గోండు కులం ప్రత్యేకంగా నమోదై ఉన్నట్లు నివేదించారు. నాయక్ కులం కూడా కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఉన్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలోని మరో ప్రధాన కులం లంబాడాను కూడా ఉప కులంగానే ఉందన్నారు. ప్రధాన కులం సుగాలీలకు లంబాడీలు, బంజారాలను ఉప కులాలుగా చూపించారు. గదబ కులానికి ఉప కులంగా బోడో గదబ, గూడోబ్ గదబ, కల్ల్యాయి గదబ, పరంగి గదబ, కత్తెర గదబ, కాపు గదబ కులాలు ఉప కులంగా నమోదయ్యాయి. అదేవిధంగా గోండుకు నాయక్‌పోడ్, రాజ్‌గొండు, కోయితూర్ కులాలున్నాయి. ఒకప్పుడు అటవీ ప్రాంతాలకే పరిమితమైన కొన్ని కులాలు ఇప్పుడు అంతటా వ్యాపించాయని పేర్కొన్నారు. వాటిలో కొండ కులం ఉన్నట్లు లెక్కల్లో చెప్పారు.