తెలంగాణకు రూ.67వేల కోట్లు, సీమాంధ్రకు రూ.93వేల కోట్ల అప్పు
తాత్కాలిక లెక్కల ప్రకారం అంచనా వేసిన ఆర్థిక శాఖ అధికారులు
జనాభా ప్రాతిపదికన రెండు రాష్ట్రాలకు అప్పుల పంపిణీ
ఎవరు ఏ అప్పు ఎంత వడ్డీతో కట్టాలో చెప్పనున్న ఆర్‌బీఐ
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పులను కొన్నింటిని ప్రాజెక్టుల వారీగా ఏ ప్రాంతానికి వినియోగిస్తే ఆ ప్రాంతానికి పంపిణీ చేయనున్నారు. ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి మాత్రమే అప్పు తెచ్చినట్లు నిర్ధారించలేమని జనాభా ప్రాతిపదికన రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నా రు. అప్పుల పంపిణీకి సంబంధించి తాత్కాలికంగా ఆర్థికశాఖ అంచనాలను వేసింది. ఇప్పటి వరకు ఉమ్మడిరాష్ట్రంలో అన్ని రకాల అప్పులు కలిపి రూ.1.60లక్షల కోట్లుగా తేల్చారు. ఇందులో తెలంగాణకు రూ.67వేల కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.93 వేల కోట్ల అప్పు ఉంటుందని ప్రాథమిక అంచనాలో తేల్చింది. ఇందులో ప్రత్యేకంగా ఒక ప్రాంతంలోని ప్రాజెక్టులకు తెచ్చిన విదేశీ, స్వదేశీ అప్పులను ఆయా ప్రాంతాలకే కేటాయించారు. అలాగే సాగునీటి ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రాజెక్టులకు వెచ్చించిన అప్పులను మాత్రం జనాభా ప్రాతిపదికనే పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ప్రణాళిక పద్దు కింద ఆస్తుల కల్పన వ్యయం కోసం సెక్యూరిటీల విక్రయం ద్వారా ప్రభుత్వం అప్పులు చేస్తుంది. ఈ అప్పులను బడ్జెట్ ద్వారా సాగునీటి ప్రాజెక్టులతో పాటు ఇతర ఆస్తుల కల్పన కోసం వ్యయం చేస్తారు.
మొత్తం బడ్జెట్ ఆధారంగా వ్యయం చేస్తున్నందున ప్రాంతాల వారీగా ప్రాజెక్టుల వ్యయం తీయడంలేదని అధికార వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టుల వారీగా వ్యయం తీయాలంటే ప్రణాళిక పద్దు కింద ఏ జిల్లాల్లో ఏ ఆర్థిక సంవత్సరంలో ఎంత వ్యయం చేసిందీ గత 30 సంవత్సరాల నుంచి లెక్కలు తీయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ కోసం తెచ్చిన అప్పులను రెండు రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. విదేశీ సంస్థలు, నాబార్డు నుంచి తెచ్చిన అప్పులను ప్రత్యేకంగా ప్రాజెక్టుల వారీగా తెచ్చినందున ఆ అప్పులను ఏ ప్రాంతంలో ఆ ప్రాజెక్టు ఉంటే ఆ ప్రాంతానికి అప్పులను లెక్కకట్టినట్లు వివరించాయి. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చే అప్పులు కొన్ని 20 సంవత్సరాల్లో, కొన్ని 15 సంవత్సరాల్లో, కొన్ని పది సంవత్సరాల్లో, మరికొన్ని ఐదు సంవత్సరాల్లో తీర్చాల్సిన అప్పులు ఉంటాయని, వాటిలోను వడ్డీ శాతాల్లో వ్యత్యాసం ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అప్పులు తీర్చే సమయం, వడ్డీ శాతాలను పరిగణనలోకి తీసుకుని ఏ రాష్ట్రంలో ఎంత కాలంలో, ఎంత వడ్డీ అప్పులను తీర్చాలో ఆర్‌బీఐ నిర్ధారించనుందని తెలిపారు.
తేలిన అప్పుల లెక్క
Published Sun, May 25 2014 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM
Advertisement