
29న సీఎం చంద్రబాబు జిల్లాకు రాక
ఏర్పాట్లపై సమీక్షించిన కలెక్టర్ కాంతిలాల్ దండే
గుంటూరు వెస్ట్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 29వ తేదీ జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలను ఖరారు చేసే విషయంపై గురువారం కలెక్టరేట్‌లోని డీఆర్‌సీ సమావేశ మందిరంలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో కలిసి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. గురజాల నియోజకవర్గంలోని గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి, మాచవరం మండలాల్లో మండలానికి 2,500 వంతున 10 వేల సేద్యం నీటి కుంటలను 28వ తేదీలోగా తవ్వించాలని నిర్ణయించారు.
గురజాల నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిగా ఉన్న ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె.బాలాజీనాయక్ గురజాల మండలానికి కూడా ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తారు. పిడుగురాళ్లకు రాజీవ్ విద్యామిషన్ పీవో రమేష్‌కుమార్, దాచేపల్లికి డ్వామా పీడీ శ్రీనివాసులు, మాచవరానికి డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు ప్రత్యేక అధికారులుగా వ్యవహరించనున్నారు.
అనంతరం కలెక్టర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం తన పర్యటనలో తొలుత గుంటూరులో ఐదు నక్షత్రాల హోటల్‌కు శంకుస్థాపన చేసి, తర్వాత గురజాల నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్-2 ముంగా వెంకటేశ్వరరావు, గురజాల ఆర్డీవో మురళి, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.