
అనాలోచిత ‘తత్వం’!
ఉన్నవి రెండే కులాలు అని వ్యాఖ్యానించిన ఈ తత్వవేత్త తన మంత్రివర్గంలో ఇద్దరు దళితులకు అంటే పది శాతానికి మాత్రమే ఎందుకు స్థానమిచ్చాడు?
ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారు? అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాలేలవచ్చనుకుంటారు. కులం, మతం, ప్రాంతం మనం కోరుకుని పుట్టలా. ""that is gods destiny'’ అంటూ అతి దీర్ఘంగా ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు చేసిన తత్వచింతన చూశాక నాకు మొదట కలిగింది అమితమైన నిస్పృహ. కొంచెమైనా సామాజిక స్పృహ లేని వ్యక్తి ముఖ్య మంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారే అని. చంద్రబాబు మాట్లాడిన కర్మసిద్ధాంతం మీద అనేక చర్చలు జరిగి దళితులు ఆత్మగౌరవ ధిక్కార బావుటా ఎగురవేసిన తరువాత కూడా వెనుకబాటుతనంతో ఇలా ప్రేరేపిస్తున్నారే అని ఆశ్చర్యమూ వేసింది.
చంద్రబాబు చేసిన గందరగోళ తాత్విక చింతనలో ఆయన వేసిన ప్రశ్న ‘‘ఎస్సీలుగా పుట్టాలని ఎవరయినా కోరుకుంటారా’’అని. అసలు ఎస్సీలు అంటే ఎవరు? స్థూలంగా చెపితే భౌతిక శ్రమని చేసేవాళ్లు. ఋగ్వేదం చాతుర్వర్ణ విభజనతో ఆగిపోతే మనువు కలుగజేసుకుని సమాజాన్ని ఇంకా చీలికలు పేలికలూ చేయదలచి, బ్రాహ్మణ పురుషుడూ, శూద్రస్త్రీ కలిస్తే పుట్టినవారు నిషాదులని, శూద్రపురుషుడు, బ్రాహ్మణ, వైశ్య స్త్రీలతో కలిస్తే పుట్టేవారు చండాలురని, ఇలా మరొక పదిహేను నీచజాతులు అని పేర్లు చెప్పుకొచ్చేడు. అంటే ఎవరయితే వర్ణాంతర వివాహాలు చేసుకున్నారో వారి సంతానం వెలివేతకు గుర య్యారు. ""one is not born but rather becomes a woman’’ అని స్త్రీల తయారీ గురించి సిమోన్ దిబోవార్ చెప్పిన ట్లు మనుషుల భౌతికశ్రమలను కొందరిమీదకి తోసి చేతులు దులుపుకోవడం కోసం ఎస్సీలు అని చంద్రబాబు చెప్పిన వారు తయారు చేయబడ్డారు. పుట్టలేదు.
ఇక ముఖ్యమంత్రిగారు పోతు లూరి వీరబ్రహ్మంలా ఉన్నవి రెండే కులములు.. పేద, ధనిక అని చెప్పుకువచ్చారు. మార్క్సిస్టుల మధ్య, దళితుల మధ్య అనేక సంవత్సరాలుగా ఈ చర్చలు జరి గాయి. ‘‘ప్రతి కులంలోను ఉన్న వాళ్లు లేనివాళ్లు రెండుగా చీలిపోతున్నారు. కింది సెక్షన్ల మధ్య బంధం ఏర్పడుతున్నది’’ అని కమ్యూనిస్టులు అంటే ‘‘ఇండియాలోని పేదవారైన కార్మికవర్గం పేద ధనిక వర్గ విభేదాన్ని తప్ప మరే విభేదాలని పాటించరని చెప్పగలమా? అలాంటి భేద భావాలు ఎన్నో స్పష్టంగా వారు చూపెడుతున్నప్పుడు వారంతా కలసి ధనికవర్గానికి వ్యతిరేకంగా ఎలా పోరాడ గలరు?’’ అని అంబేడ్కర్ ఆ వాదాన్ని కొట్టి పడేశాడు. తరువాత ఇప్పుడిప్పుడు ""though caste is a super structure it has the force even to influence the base’’ అని భారత దేశంలో కులం శక్తిని ఒప్పుకున్నారు మార్క్సిస్టులు.
మూడో విషయం ‘‘అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాలేలవచ్చు అనుకుం టారు’’ అనడం. చంద్రబాబు ప్రకారం రాజుల కులం అంటే ఏది? ఈ ఆధునిక కాలంలో రాజ్యాలేలుతున్న వారి కులం అనా? ఇప్పుడు ఇక్కడ కమ్మకులం రాజకులం, పక్కన జయలలిత బ్రాహ్మణ కులం రాజకులం, కేంద్రంలోనూ మోదీ కులం రాజకులం, అంతకు ముందు మాయావతి దళిత కులం. మరి ఈ రాజకులాల్లో ఏ రాజ కులంలో పుట్టమంటాడో చంద్రబాబు చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా రాజుల కులాలని బహిరంగంగా మెడలు కత్తిరించి ప్రజాస్వామ్యం పీఠమెక్కిన ఈ కాలంలో ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్య మంత్రికి ఈ కనీసపాటి విషయాలు తెలుసుకుని ఉండకపోయినా పర్వాలేదు కాని పవన్ కల్యాణ్‌లా పబ్లిక్‌లో తాత్విక చింతన చేయకూడదన్న విషయాన్ని తెలుసుకుని ఉండాలి.
మరి ఉన్నవి రెండే కులాలు అని వ్యాఖ్యానించిన ఈ తత్వవేత్త తన మంత్రి వర్గంలో ఇద్దరు దళితులకి మాత్రమే అంటే కేవలం పదిశాతానికి మాత్రమే ఎందుకు స్థానమిచ్చాడు? దళితుడు కనుక సాంఘిక సంక్షేమశాఖను, స్త్రీ కనుక మహిళా సంక్షేమ శాఖను ఎందుకు కట్టబెట్టాడు? కీలక శాఖలు చేస్తున్న మిగిలిన మంత్రులు పేదకులం వారు కనుక చంద్రబాబు క్లియర్‌గా పేదకులం పక్షం వహించి మంచి మంత్రిత్వశాఖలు వారికి ఇచ్చాడా? అసలు మొత్తం భారతదేశం లెక్కలు అన్ని రంగాలలో తీసుకుంటే దళితులకి ఏం వస్తున్నాయి? మొన్న ఎన్ని పద్మ అవార్డ్‌లు వచ్చాయి? ఈ దేశంలో రానురాను అంబేడ్కర్ ప్రాసంగికత ఎందుకు పెరుగుతూ వస్తోందంటే, అంబేడ్కర్ అనేవాడే లేకపోతే చంద్రబాబు చెప్పిన కర్మ సిద్ధాంతమే ఇప్పటికీ తలుచుకుంటూ గోళ్ళు గిల్లుకుంటూ కూర్చునేవాళ్ళం కదా అని దళితులు గ్రహించడం వల్ల.
అదంతా అలా ఉంచితే ‘‘నేను బాధితుడ్ని కాదు ఎగిరే ధిక్కార పతాకాన్ని’’ అని కోట్లాది దళిత గొంతులు ధిక్కార స్వరంతో ప్రకటిస్తున్న కాలమిది. చంద్రబాబూ, ఈ రాష్ర్టంలోనే కాదు ఈ దేశంలో కూడా దళితులు, దళితులుగా పుట్టి, గుండె చరుచుకుని మళ్లీ దళితులుగానే పుడతామని చెబుతున్న కాలమిది, ఈసారి మాట్లాడేటప్పుడు కాస్త కాలమానాలు ఆలోచించి మాట్లాడండి.
వ్యాసకర్త రచయిత్రి మొబైల్: 80196 00900
- సామాన్య