
బాబు ‘ఎస్సీ’ వ్యాఖ్యలపై భగ్గుమన్న రాష్ట్రం
- మంచి అన్నది మాల అయితే.. మాల నేనౌతాను..
- మధ్యయుగాలను తలపించే అమానవీయ సమాజంలోనే మహాకవి గురజాడ కవితా పంక్తులివి.
- మరో జన్మంటూ ఉంటే హరిజనుడిగానే పుడతాను... జాతిపిత మహాత్మాగాంధీ ఆకాంక్ష ఇది..
- శతాబ్దాల క్రితమే ఇలా చైతన్యదీప్తిని రగిలించినవారెందరో....
- అలాంటిది.. ‘ఎస్సీగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అనే తిరోగామి వ్యాఖ్యలు నేటి కాలంలో ఊహించగలమా..?
ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వివక్షాపూరిత వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు మిన్నుముట్టాయి. ఒకవైపు ఆవేదన, మరోవైపు ఆగ్రహావేశాలతో దళితులంతా రగిలిపోతున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. రాష్ర్టవ్యాప్తంగా అనేక చోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. పలుచోట్ల ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్య చేయడమేమిటంటూ మేధావులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పక్షాలన్నీ ఈ వ్యాఖ్యలను ఖండించాయి. బాబు వ్యాఖ్యలపై ప్రొఫెసర్లు, అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు..... ఇలా అన్ని వర్గాల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ బాధ్యతారహితమైన ఈ వ్యాఖ్యను తక్షణం ఉపసంహరించుకుని దళితులందరికీ చంద్రబాబు క్షమాపణ చెప్పాలని అన్నివైపుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.
అంబేద్కర్ విగ్రహం కాళ్లు పట్టుకుని ఎస్సీలందరికీ చంద్రబాబు క్షమాపణలు చెప్పకుంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోక తప్పదని ప్రతిపక్ష వైఎస్సార్‌కాంగ్రెస్ హెచ్చరించింది. బాబు వ్యాఖ్యలు దళితులను కించపరచడమేకాక కులాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని విమర్శించింది. మరోవైపు చంద్రబాబు కులవివక్షాపూరిత వ్యాఖ్య చేయడానికి వ్యతిరేకంగా పలుచోట్ల న్యాయస్థానాలలో కేసులు దాఖలయ్యాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి.