
మంద కృష్ణ పప్పులుడకవ్
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి
చంద్రబాబుకు మాదిగజాతిని తాకట్టుపెట్టిన మంద కృష్ణ పప్పులు ఇక ఉడకవని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ఖమ్మంలో శనివారం జరిగిన తెలంగాణ మాదిగ జేఏసీ సభలో ఆయన మాట్లాడారు.
ఖమ్మం మామిళ్లగూడెం : మదిగల మనుగడను తాకట్టు పెట్టిన చరిత్ర మంద కృష్ణ మాదిగదేనని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి వ్యాఖ్యానించారు. వర్గీకరణ ఉద్యమం పేరుతో ఆయన చేసిన మోసాన్ని భరించామని, ఇక పప్పులు ఉడకవని అన్నారు. మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్‌లో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో మాదిగలు చేసి త్యాగం చిరస్మరణీయమన్నారు. మాదిగల రిజర్వేషన్‌పై రాజకీయ పార్టీలు స్పష్టమైన వైఖరి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన వైఖరిని చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణలో టీడీపీకి పట్టిన గతే బీజేపీకి కూడా పడుతుందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలోని మాదిగజాతిని సంఘటితం చేసేందుకు వాడవాడనా జేఏసీలు ఏర్పాటు చేస్తామన్నారు. అందులో భాగంగానే ఒకట్రెండు రోజుల్లో హైదరాబాద్‌లో రాష్ట్ర కమిటీని ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో మాదిగ జేఏసీ నాయకులు కోడారి వినాయకరావు, చేకూరి రమేష్, కలకోట సంపత్‌కుమార్, బుర్ర వీరబాబు, విజేత, జాంబవగర్జన్, రాయంకంటి రాందాస్, ఆమరణ శ్రీను, నరేందర్, రామకృష్ణ, మధుప్రభాకర్, సిద్ధార్థపూలే, సత్యప్రకాష్, నందిగామ రాజ్‌కుమార్, ఆరెంపుల వీరభద్రం, కొండ్రు హుస్సేన్, రాంమోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిడమర్తి రవిని ఘనంగా సన్మానించారు. సభకు ముందుగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.