నిరుపేద దళిత నిరుద్యోగుల స్థానంలో ధనికులు పాగా వేశారు.
వారికి కేటాయించాల్సిన దుకాణాల్లో బినామీలు అడ్డా పెట్టారు.
ఫలితంగా అర్హుల స్థానంలో అనర్హులు లబ్ధిపొందుతున్నారు.
దుకాణాల కేటాయింపుల్లో అక్రమాలు జరిగినట్టు నిరుపేద దళితులు మొత్తుకుంటున్నా పట్టించుకునే దిక్కు లేదు.
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటూ దళిత సంఘాల నేతలు మండిపడుతున్నారు.
- మెదక్
* దళితుల దుకాణాలు ధనికుల పాలు
* అర్హులైన ఎస్సీలకు అన్యాయం
* అనర్హులకు కొమ్ముకాస్తున్న అధికారులు!
* ఆందోళనలు చేసినా పట్టించుకోని వైనం
* కలెక్టర్‌కు ఫిర్యాదుచేసినా ఫలితం శూన్యం
ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2006లో మెదక్ పట్టణంలో ప్రభుత్వం సుమారు రూ.20 లక్షలు వెచ్చించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించింది. స్థానిక జీకేఆర్ కాంప్లెక్స్ సమీపంతోపాటు రామాలయ సమీపంలో 20 షాపులకు మున్సిపల్ అధికారులు వీటిని నిర్మించారు. ఈ షాపులను అర్హులైన దళితులకు అద్దెకు ఇవ్వాలి. ఆ మడి గెలో ఏదైన వ్యాపారం చేసుకుని జీవనోపాధి పొందాలి. కానీ వాటిని కొందరు రాజకీయ పలుకుబడితో దక్కించుకున్నారు. సదరు వ్యక్తులు ఇతరులకు అద్దెకిచ్చి అధికంగా వసూలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఆ కాంప్లెక్స్‌లు అన్ని బినామీల పేర్లపైనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆ షాపుల్లో కిరాయికి ఉంటున్న వారంతా ధనికులే కావడం గమనార్హం. ఆ షాపుల నుంచిబినామీలను పంపించి వేయాలని పలువురు నిరుపేద దళితులు మున్సిపల్ అధికారులతోపాటు కలెక్టర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీలకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితంలేక పోవడంతో ఈనెల 6న రాస్తారోకో చేశారు. అయినా మున్సిపల్ అధికారులు బినామీలకే కొమ్ముకాస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారుల తీరుతో ఎందరో నిరుపేద దళితులు అన్యాయానికి గురవుతున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. ఇ ప్పటికైనా అధికారులు స్పందించి బినామీలను ఖాళీ చేయించి అర్హులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
అనర్హుల చేతిలో కాంప్లెక్స్‌లు...
దళితుల కోసం కేటాయించిన దుకాణాల్లో అగ్రవర్ణాల వారితోపాటు ధనికులు అద్దెకుం టున్నారు. దీంతో అర్హులైన నిరుద్యోగ దళితులకు అన్యాయం జరుగుతుంది. బి నామీలను ఖాళీ చేయించి అర్హులకు ఇవ్వాలని రాస్తారోకో చేపట్టినా స్పందించడం లేదు. కలెక్టర్ స్పందించి అక్రమంగా అద్దెకు ఉంటున్న వారిని ఖాళీ చేయించాలి.
- బాల్‌రాజ్, మాదిగ యువసేన జిల్లా అధ్యక్షుడు
ఆందోళనలు చేపడతాం..
దళితుల కోసం కేటాయించిన షాపుల్లోంచి అనర్హులను ఖాళీ చేయిం చాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం. కళ్లముందే అక్రమాలు కన్పిస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అనర్హులను ఖాళీచేయించి అర్హులకు కేటాయించాలి.
- యాదగిరి, ఎమ్మార్పీఎస్ పట్టణ కార్యదర్శి
బినామీల అడ్డా!
Published Wed, Jan 20 2016 12:37 AM | Last Updated on Sun, Sep 3 2017 3:55 PM
Advertisement
Advertisement