దళిత యువతకు మినీ డెయిరీలు! | SC Corporation Plans To Provide Employment To Dalit Unemployed Youth Through Mini Dairies | Sakshi
Sakshi News home page

దళిత యువతకు మినీ డెయిరీలు!

Published Fri, Feb 19 2021 4:33 AM | Last Updated on Fri, Feb 19 2021 4:33 AM

SC Corporation Plans To Provide Employment To Dalit Unemployed Youth Through Mini Dairies - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దళిత నిరుద్యోగ యువతకు మినీ డెయిరీల ద్వారా ఉపాధి కల్పించాలని ఎస్సీ కార్పొరేషన్‌ కసరత్తు చేస్తోంది. హైదరాబాద్‌ మహానగరంలో పాల ఉత్పత్తులకు డిమాండ్‌ అధికంగా ఉండడం.. డిమాండ్‌కు తగిన విధంగా పాల దిగుబడి లేకపోవడంతో పాడిపరిశ్రమకు మంచి భవిష్యత్‌ ఉంటుందని ఎస్సీ కార్పొరేషన్‌ అంచనా వేస్తోంది. ఇందుకు సంబంధించి పశుసంవర్థక శాఖ అధికారులతో సమాలోచనలు చేసిన ఎస్సీ కార్పొరేషన్‌.. ఔత్సాహికులతో మినీ డెయిరీలు ఏర్పాటు చేయించాలని భావిస్తోంది. వాస్తవానికి గత ఏడాదే ఈ అంశంపై దృష్టిసారించిన ఎస్సీ కార్పొరేషన్, కరోనా నేపథ్యంలో ఆ ప్రయత్నాలను వాయిదా వే సింది. తాజాగా పరిస్థితులు సద్దుమణుగుతుండ డంతో మళ్లీ మినీ డెయిరీల ఏర్పాటుపై దృష్టి సారించింది. 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రభుత్వం ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు పొందుపరిచే అవకాశం ఉందని చెబుతున్నారు. 

గరిష్టంగా రూ.4 లక్షలతో.. 
హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న రెండు, మూడు జిల్లాల్లో ఈ ప్రాజెక్టును తొలుత ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని ఎస్సీ కార్పొరేషన్‌ యోచిస్తోంది.  జిల్లాకు సగటున 100 యూనిట్లు మంజూరు చేయా లని భావిస్తోంది. ఒక్కో యూనిట్‌ను రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల మధ్య బ్యాంకు అనుసంధానంతో రుణం ఇచ్చి ఇందులో 60 శాతం వరకు రాయితీ ఇవ్వనుంది. ప్రతి డెయిరీ యూనిట్‌కు 3 గేదెలు పంపిణీ చేస్తారు. అదేవిధంగా గేదెలకు షెల్టర్‌ కోసం ప్రత్యేక షెడ్‌ ఏర్పాటు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రాజెక్టు యూనిట్‌ కాస్ట్‌లో కొంత మొత్తాన్ని కేటాయిస్తారు. దీంతోపాటు ఆరునెలలకు సరిపడా పశుగ్రాసం కోసం అవసరమైన నిధులకు కూడా ప్రత్యేక మొత్తాన్ని నిర్దేశిస్తారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటున్న అధికారులు.. యూనిట్‌ విలువ కనీసం రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉండేలా అంచనాలు రూపొందిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నారు. 

త్వరలోనే సబ్సిడీ పాడిగేదెల పంపిణీ

పాడిపరిశ్రమ రంగాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు త్వరలోనే సబ్సిడీపై పాడిగేదెలను అందించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలి పారు. గురువారం మంత్రి కార్యాలయంలో విజయ డెయిరీ చైర్మన్‌ లోక భూమారెడ్డి అధ్యక్షతన బోర్డు సమావేశం జరిగింది. మంత్రి మాట్లాడుతూ సబ్సిడీ పాడిగేదెల కోసం 3,834 మంది లబ్ధిదారులు డీడీలు చెల్లించారని, గేదెల పంపిణీకి సంబం ధించి విజయ డెయిరీ సంస్థ నోడల్‌ ఏజెన్సీగా ఉం టుందని వెల్లడించారు. కాగా, గతంలో లబ్ధిదారులకు పంపిణీ చేసిన పాడిగేదెల్లో 2,691 గేదెలు చనిపోయాయని, వాటికి సంబంధించి పరిహారం కింద కొత్తగా పాడి గేదెలను కొనుగోలు చేసి వెంటనే పంపిణీ ప్రక్రియ చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇక నుంచి లీటర్‌ పాలకు ప్రభుత్వం రూ.3, ఆయా డెయిరీ సంస్థలు రూ.1 చొప్పున కలిపి రైతులకు ప్రోత్సాహకం కింద చెల్లిస్తామ న్నారు. ఇందులో భాగంగా కరీంనగర్, మదర్‌ డెయిరీ, ముల్కనూర్‌ డెయిరీలకు పాలుపోసే రైతులకు చెల్లించాల్సిన ప్రోత్సాహకం బకాయిలలో రూ.8 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.  

విజయ ఐస్‌క్రీంల విక్రయాలకు సైకిల్‌ రిక్షాలు..  
విజయ ఐస్‌క్రీంల విక్రయాల కోసం ప్రత్యేక పుష్‌ కార్ట్‌ (సైకిల్‌ రిక్షా)లను వినియోగంలోకి తీసుకురావాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు. ముందుగా 250 పుష్‌కార్ట్‌ల ద్వారా ఐస్‌ క్రీంల విక్రయాలు ప్రారంభించాలన్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్, నెక్లెస్‌ రోడ్, కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్, శిల్పారామం, గోల్కొండ కోట, దుర్గంచెరువు వంటి ప్రాంతాల్లో విక్రయాలు చేప ట్టాలన్నారు. విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాల కోసం జీహెచ్‌ఎంసీ పరిధిలో అనువైన ప్రాంతాలను గుర్తించి నూతన ఔట్‌లెట్‌లను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసి మార్చిలో వాటిని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు. సమావేశంలో పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, డెయిరీ ఎండీ శ్రీనివాసరావు, పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి, అదనపు డైరెక్టర్‌ రాంచందర్‌  పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement