ఎన్నికల ప్రచారంలో చాటి చెబుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు
తన హయాంలో అమరావతిలో భూముల ధర పెరిగిందని బీరాలు
ఇప్పుడు పడిపోయాయంటూ గగ్గోలు
అమరావతి నిర్మాణాన్ని చేపట్టి సంపద సృష్టిస్తానంటూ ఇప్పుడు గొప్పలు
దీనివల్ల సంపద సృష్టించేది రాష్ట్రానికి కాదు.. చంద్రబాబు, బినామీలు, వందిమాగధులకే
గతంలో హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ పేరుతోనూ ఇదే దందా
2014లో ఓత్ ఆఫ్ సీక్రసీని తుంగలో తొక్కి ఇన్‌సైడర్ ట్రేడింగ్
తన గ్యాంగ్‌తో కలిసి వేలాది ఎకరాల భూములు కాజేసిన బాబు
ఆ తర్వాత రాజధానిగా అమరావతి ప్రకటన.. దాంతో భూముల ధరలకు రెక్కలు
సింగపూర్ ప్రైవేటు కన్సార్షియం చేతికి రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు
1691 ఎకరాలు కట్టబెట్టి.. రాష్ట్ర ఖజానా నుంచి రూ.5,500 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన
ఆ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.లక్ష కోట్లు కాజేసేందుకు స్కెచ్
బాబు లెక్కల ప్రకారం మౌలిక సదుపాయాల కల్పనకే రూ.లక్ష కోట్లు అవసరం
ఆ స్థాయిలో ఖర్చు చేయడానికి సహకరించని ఆర్థిక పరిస్థితి
అందుకే సమగ్రాభివృద్ధే లక్ష్యంగా మూడు రాజధానుల అభివృద్ధికి సీఎం జగన్ నిర్ణయం
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి
అమరావతి రాజధాని నిర్మాణాన్నిచేపడతానని 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబు.. సంపద సృష్టించి, సంక్షేమ పథకాలను అమలు చేస్తానని బీరాలు పలికారు. కానీ.. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకే చంద్రబాబు లెక్క ప్రకారం రూ.లక్ష కోట్లు అవసరం. జాప్యం జరిగితే ఆ వ్యయం మరింత అధికం కావచ్చు. రాష్ట్ర బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే మౌలిక సదుపాయాల కల్పనకే 20 ఏళ్లు పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మిగతా ప్రాంతాల ప్రజల నోట్లో మట్టి కొట్టి, అమరావతిలో మౌలిక సదుపాయాలకు ఆ స్థాయిలో నిధులు ఖర్చు చేసినా రాష్ట్రానికి సంపద పెరగదు.చంద్రబాబు, బినామీలు, వందిమాగధుల భూముల ధరలే పెరుగుతాయి. వాటిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని రూ.లక్షల కోట్లు కొల్లగొట్టాలన్నదే చంద్రబాబు ఎత్తుగడ.
సాక్షి, అమరావతి : నోరు తెరిస్తే చాలు సంపద సృష్టిస్తానని బీరాలు పలుకుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. అది తన బినామీల కోసమేనని ఎన్నికల ప్రచారంలో పరోక్షంగా చాటిచెబుతున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో భూముల ధరలు అమాంతం పెరిగితే.. ఇప్పుడు పడిపోయాయని గుంటూరులో బుధవారం నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేయడమే అందుకు నిదర్శనం.
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును 185 కి.మీల పొడవున నిర్మించడానికి ప్రణాళిక రచించానని చెబుతూ రాజధాని నిర్మాణం కొనసాగి ఉంటే ఈపాటికి ప్రపంచ స్థాయి నగరం కళ్ల ముందుకు వచ్చేదని గ్రాఫిక్స్ కథలు వల్లె వేశారు. సీఎం జగన్ తన కలలను వమ్ము చేశారని.. అధికారంలోకి రాగానే అమరాతి నిర్మాణం చేపట్టడమే తన సంకల్పమని పునరుద్ఘాటించారు.
అంటే.. ప్రభుత్వ ఖజానా నుంచి రూ.లక్ష కోట్లను వెదజల్లి అమరావతిలో మౌలిక సదుపాయాలను కల్పించి ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా తాను, తన బినామీలు, వందిమాగధులు కాజేసిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.లక్షల కోట్లు కొల్లగొట్టడానికి కట్టుబడి ఉన్నట్లుగా చంద్రబాబు తేటతెల్లం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ ముసుగులో మురళీమోహన్ వంటి బినామీలతో కలిసి కాజేసిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.వేలాది కోట్లు నొక్కేసిన తరహాలోనే ఇప్పుడూ అమరావతి పేరుతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. రహాలోనే ఇప్పుడూ అమరావతి పేరుతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు.
అంతర్జాతీయ కుంభకోణం
రాజధాని లేకుండా విభజించి రాష్ట్రాన్ని కేంద్రం సంక్షోభంలోకి నెట్టిందని.. దాన్ని అవకాశంగా మల్చుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మాణం మాటేమోగానీ ఆ ముసుగులో అంతర్జాతీయ కుంభకోణానికి పాల్పడ్డారు. 2014 జూన్ 8న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు.. ఓత్ ఆఫ్ సీక్రసీకి తుట్లూ పొడిచి, రాజధాని ఏర్పాటు చేసే ప్రాంతంపై బినామీలు, వందిమాగధులకు లీకులు ఇచ్చారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా రైతుల నుంచి తక్కువ ధరలకే తన గ్యాంగ్ ద్వారా భారీ ఎత్తున భూములు కాజేశాక రాజధానిని ప్రకటించారు.
ఆ ప్రాంతానికి కనీసం రహదారి సౌకర్యం కల్పించకుండానే.. భూముల ధరలు పెంచడం కోసం తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణం చేపట్టి కమీషన్లు దండుకున్నారు. స్విస్ ఛాలెంజ్ విధానానికి తూట్లు పొడుస్తూ 1691 ఎకరాల్లో రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు నిర్మాణ పనులను సింగపూర్ ప్రైవేటు సంస్థల కన్సార్షియంకు కట్టబెట్టి.. ఆ ప్రాజెక్టుకు ప్రభుత్వ ఖజానా నుంచి రూ.5,500 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అంగీకరించారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.లక్ష కోట్లు కాజేయడానికి స్కెచ్ వేశారు.
మూడు రాజధానులతో సమగ్రాభివృద్ధి
భూ సమీకరణలో రైతులు ఇచ్చిన 33 వేల ఎకరాలు, అటవీ భూములు సహా మొత్తం 50 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని గత టీడీపీ సర్కార్ నిర్ణయించింది. నల్లరేగడి భూములతో కూడిన ఆ ప్రాంతంలో రహదారులు, డ్రైనేజీలు, విద్యుత్ సౌకర్యం వంటి కనీస మౌలిక సదుపాయాలను కల్పించి, అభివృద్ధి చేయడానికి ఎకరాకు రూ.2 కోట్లు వ్యయం అవుతుందని అప్పటి సీఎం చంద్రబాబు ప్రకటించారు. అంటే అమరావతిలో కేవలం కనీస మౌలిక సదుపాయాల కల్పనకే రూ.లక్ష కోట్లు అవసరం.
కానీ.. రాష్ట్ర బడ్జెట్ నుంచి ఆ మేరకు కేటాయింపులు చేయడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ సూచనల మేరకు రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇదే అంశాన్ని 2024 ఎన్నికల మేనిఫెస్టోలోనూ సీఎం జగన్ పొందుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment