ఇదేమి చెలగాటం?
Published Fri, Apr 1 2016 1:10 AM | Last Updated on Tue, Jul 24 2018 2:17 PM
ఏలూరు (మెట్రో) : బలహీనవర్గాలకు చెందిన దాదాపు వెయ్యిమంది నిరుద్యోగులు స్వయంఉపాధి రుణాలు కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. వారిని గతంలో రెండుసార్లు ఇంటర్వ్యూల పేరుతో జిల్లా కేంద్రానికి పిలిపించిన అధికారులు ఆఖరిక్షణంలో ఇంటర్వ్యూలు రద్దు చేశారు. తాజాగా మూడోసారి బుధవారం ఇంటర్వ్యూలకు పిలిచారు. ఈసారి అందరినీ కాకుండా ఎంపిక చేసుకున్న కొందరినే పిలిచి గుట్టుగా ఎంపిక కానిచ్చేశారు. ఎస్సీ కార్పొరేషన్ తీరు తమ జీవితాలతో ఆడుకుంటోందని ఈ సందర్భంగా పలువురు ఆరోపిస్తున్నారు.
ఇదీ జరిగింది
జాతీయ బలహీనవర్గాల ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ) ఇచ్చే ఋణాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించారు. జిల్లావ్యాప్తంగా 980 మంది ధరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారులందరినీ ఇంటర్వ్యూలకు పిలిచి లబ్ధిదారులను ఎంపిక చేయాలి. అయితే కార్పొరేషన్ అధికారులు యూనిట్లకు సరిపడే సంఖ్యలోనే అభ్యర్థులను పిలిచారు. 233 యూనిట్లు ఉంటే కంటితుడుపుగా 247 మందిని బుధవారం ఇంటర్వ్యూలకు పిలిచారు.
ఉదయం సమాచారం... మధ్యాహ్నం ఇంటర్వ్యూ!
ఇంటర్వ్యూల కోసం అందించే సమాచారంలోనూ ఎస్సీ కార్పొరేషన్ అధికారులు అభ్యర్థులను గందర గోళానికి గురి చేస్తున్నారు. బుధవారం ఇంటర్వ్యూలు జరుగుతాయనే విషయాన్ని కనీసం మీడియా ద్వారా కూడా తెలపలేదు. అభ్యర్థులకు బుధవారం ఉదయం సమాచారం ఇచ్చి మధ్యాహ్నం ఇంటర్వ్యూలకు రమ్మన్నారు.
లోగడ రెండుమార్లు వాయిదా
గతంలో ఇవే ఇంటర్వ్యూల నిమిత్తం రెండుసార్లు జిల్లావ్యాప్తంగా అందరు అభ్యర్థులకు సమాచారం ఇచ్చి ఏలూరు పిలిపించారు. జిల్లా నలుమూలల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి ఏలూరు వచ్చిన అభ్యర్థులకు ఆఖరిక్షణంలో ఇంటర్వ్యూలు రద్దయినట్టు తెలిపారు. దీంతో అప్పట్లో అభ్యర్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వివరణకూ నిరాకరణ
ఎంపిక జరగనప్పుడు దరఖాస్తుదారులందరినీ రప్పించి ఆర్థికంగా నష్టపరచిన అధికారులు, ఎంపిక చేసేటపుడు కొందరినే పిలవడంలో మతలబు ఏమిటని ఈ సందర్భంగా పలువురు నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై వివరణ కోరేందుకు వెళ్లగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఝాన్సీరాణి మాట్లాడేందుకు నిరాకరించారు. అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తున్న ఫొటో తీసుకునేందుకు కూడా నిరాకరించారు.
Advertisement
Advertisement