NSFDC
-
ఉప్పులేటి కల్పనా.. మజాకానా !
సాక్షి, అమరావతి బ్యూరో : పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న పలు పథకాలను అధికార టీడీపీ ప్రజాప్రతినిధులు చేజిక్కించుకుని లక్ష్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కృష్ణాజిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కేంద్రప్రభుత్వ నిధులతో మంజూరైన రాయితీ వాహనాన్ని బినామీ పేరుతో తీసుకుని దర్జాగా వాడుకుంటున్న వైనం వెలుగుచూసింది. నిబంధనలకు పాతర.. కేంద్రప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ యువతకు ఉపాధి కోసం నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎస్ఎఫ్డీసీ) ద్వారా సబ్బిడీతో వాహనాలను అందజేస్తోంది. మొవ్వ గ్రామానికి చెందిన దగాని క్రాంతికిరణ్ ఎన్ఎస్ఎఫ్డీసీ పథకం ద్వారా దరఖాస్తు చేయగా సుమారు రూ.20 లక్షల విలువైన ఇన్నోవా వాహనాన్ని మంజూరు చేశారు. ఆ వాహనాన్ని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పేరుతో ఏపీ 16టీపీ 0661 నంబర్‌తో ఈ ఏడాది మార్చి ఒకటిన గుడివాడ ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు.అయితే రిజిస్ట్రేషన్ చేయడంలో నిబంధనలు పాటించలేదు. ట్యాక్సీ ట్రావెల్ కింద చూపితే ఎల్లో ప్లేట్ ఉండాలి. కానీ కారు యజమానిగా చూపి వైట్ ప్లేట్ వేయించుకుని నిబంధనలు ఉల్లంఘించారు. పామర్రు ఎమ్మెల్యే దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇన్నోవా వాహనంపై పామర్రు ఎమ్మెల్యేగా స్టిక్కర్ వేయించుకుని తిరుగుతున్నారు. దగాని క్రాంతికిరణ్ ఎమ్మెల్యే బినామీ మాత్రమేనని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. అతని పేరుతో రాయితీతో కూడిన భూమి కొనుగోలు పథకం, వ్యక్తిగత రుణాలు మంజూరు చేయించి వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ వెబ్సైట్లో కారు రిజిష్ట్రేషన్ వివరాలు. ఇందులోనే కారు యజమాని దగాని క్రాంతి కిరణ్ పేర్కొన్న దృశ్యం సొమ్మొకరిది సోకు మరొకరిది కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాలలో పేదవర్గాలకు ఎన్ఎస్ఎఫ్డీసీ పథకం కింద అందించే వాహనాలకు నిధులు పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఈ పధకం ద్వారా మంజూరైన వాహనానికి 35% సబ్సిడీ ఉంటుంది. 2% మాత్రం లబ్ధిదారుని వాటాగా చెల్లించాలి. మిగిలిన 63% రుణ సౌకర్యం కల్పిస్తారు. వాహనాన్ని ట్రావెల్స్‌లో తిప్పి రుణం చెల్లించాల్సి ఉంది. కానీ రాష్ట్రప్రభుత్వం ఈ వాహనాలను తామే ఇస్తున్నట్లు బిల్డప్ ఇచ్చేలా వాహనంపై థ్యాంక్యూ సీఎం సార్ పేరుతో స్టిక్కర్లు వేసి పంపిణీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ గతంలో వాహనంపై సీఎం స్టిక్కర్ తొలగిస్తే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పడం వివాదమైంది. గతంలోనూ నెల్లూరు జిల్లాలో టీడీపీ మాజీ మంత్రి తన డ్రైవర్ పేరుతో ఇన్నోవా వాహనం తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. పేదవర్గాల పేరుతో రాయితీ పథకాలను టీడీపీ నేతలు బొక్కేయడంపై దళితులు మండిపడుతున్నారు. పేదలకు పంపిణీ చేశాం కృష్ణా జిల్లాలో ఎన్ఎస్ఎఫ్డీసీ ద్వారా దరఖాస్తులు చేసుకున్న వారికి వాహనాలు పంపిణీచేశాం. నిబంధనల మేరకే వాహనాలను మంజూరు చేశాం. లబ్ధిదారుల్లో ప్రజాప్రతినిధుల బినామీలు ఉన్నారన్న విషయం మాకు తెలియదు. – సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, కృష్ణాజిల్లా -
81 మందికి ఎన్ఎస్ఎఫ్డీసీ రుణాలు
కర్నూలు(అర్బన్): జిల్లా షెడ్యూల్డు కులాల ఆర్థిక సేవా సహకార సంస్థ ఆధ్వర్యంలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 81 మందికి రూ.2.27 కోట్ల ఎన్ఎస్ఎఫ్డీసీ రుణాలు మంజూరైనట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎస్ సత్యం తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ పథకం కింద 246 మంది ఎంపిక కాగా, మొదటి విడత కింద 81 మందికి రుణాలు మంజూరు చేస్తు కార్పొరేషన్ ఎండీ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఇందులో రుణం రూ.1.35 కోట్లు, సబ్సిడీ రూ.80.80 లక్షలు, లబ్ధిదారుల వాట రూ.11.355 లక్షలు ఉంటుందన్నారు. మొదటి విడతలో ఇంటర్నెట్ షాపు ఏర్పాటుకు 45 మందికి, మినిడెయిరీకి 20, మెడికల్ క్లినిక్‌కు 2, ఆటో ట్యాక్సీకి 12, ఆటో ట్రాలీ గూడ్సు వెహికల్స్ 2 యూనిట్లకు రుణాలు మంజూరయ్యాయని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక గతంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సీ హరికిరణ్ ఆధ్వర్యంలో జరిగిందన్నారు. అప్పట్లో ఎంపికైన వారిలో ఇంకా 165 మందికి రుణంగా రూ.2.41 కోట్లు, సబ్సిడీగా రూ.1.59 కోట్లు త్వరలోనే మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. -
ఇదేమి చెలగాటం?
ఏలూరు (మెట్రో) : బలహీనవర్గాలకు చెందిన దాదాపు వెయ్యిమంది నిరుద్యోగులు స్వయంఉపాధి రుణాలు కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. వారిని గతంలో రెండుసార్లు ఇంటర్వ్యూల పేరుతో జిల్లా కేంద్రానికి పిలిపించిన అధికారులు ఆఖరిక్షణంలో ఇంటర్వ్యూలు రద్దు చేశారు. తాజాగా మూడోసారి బుధవారం ఇంటర్వ్యూలకు పిలిచారు. ఈసారి అందరినీ కాకుండా ఎంపిక చేసుకున్న కొందరినే పిలిచి గుట్టుగా ఎంపిక కానిచ్చేశారు. ఎస్సీ కార్పొరేషన్ తీరు తమ జీవితాలతో ఆడుకుంటోందని ఈ సందర్భంగా పలువురు ఆరోపిస్తున్నారు. ఇదీ జరిగింది జాతీయ బలహీనవర్గాల ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్ఎస్ఎఫ్డీసీ) ఇచ్చే ఋణాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించారు. జిల్లావ్యాప్తంగా 980 మంది ధరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారులందరినీ ఇంటర్వ్యూలకు పిలిచి లబ్ధిదారులను ఎంపిక చేయాలి. అయితే కార్పొరేషన్ అధికారులు యూనిట్లకు సరిపడే సంఖ్యలోనే అభ్యర్థులను పిలిచారు. 233 యూనిట్లు ఉంటే కంటితుడుపుగా 247 మందిని బుధవారం ఇంటర్వ్యూలకు పిలిచారు. ఉదయం సమాచారం... మధ్యాహ్నం ఇంటర్వ్యూ! ఇంటర్వ్యూల కోసం అందించే సమాచారంలోనూ ఎస్సీ కార్పొరేషన్ అధికారులు అభ్యర్థులను గందర గోళానికి గురి చేస్తున్నారు. బుధవారం ఇంటర్వ్యూలు జరుగుతాయనే విషయాన్ని కనీసం మీడియా ద్వారా కూడా తెలపలేదు. అభ్యర్థులకు బుధవారం ఉదయం సమాచారం ఇచ్చి మధ్యాహ్నం ఇంటర్వ్యూలకు రమ్మన్నారు. లోగడ రెండుమార్లు వాయిదా గతంలో ఇవే ఇంటర్వ్యూల నిమిత్తం రెండుసార్లు జిల్లావ్యాప్తంగా అందరు అభ్యర్థులకు సమాచారం ఇచ్చి ఏలూరు పిలిపించారు. జిల్లా నలుమూలల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి ఏలూరు వచ్చిన అభ్యర్థులకు ఆఖరిక్షణంలో ఇంటర్వ్యూలు రద్దయినట్టు తెలిపారు. దీంతో అప్పట్లో అభ్యర్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివరణకూ నిరాకరణ ఎంపిక జరగనప్పుడు దరఖాస్తుదారులందరినీ రప్పించి ఆర్థికంగా నష్టపరచిన అధికారులు, ఎంపిక చేసేటపుడు కొందరినే పిలవడంలో మతలబు ఏమిటని ఈ సందర్భంగా పలువురు నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై వివరణ కోరేందుకు వెళ్లగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఝాన్సీరాణి మాట్లాడేందుకు నిరాకరించారు. అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తున్న ఫొటో తీసుకునేందుకు కూడా నిరాకరించారు.