ఎస్సీ కార్పొరేషన్ రుణ ప్రణాళిక ఖరారు
విజయనగరం కంటోన్మెంట్ : ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరుకు రంగం సిద్ధమైంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణ ప్రణాళికను సంబంధింత అధికారులు ఖరారు చేశారు. జిల్లా వ్యాప్తంగా 11.91 కోట్ల రూపాయల రుణాలిచ్చేందుకు కమిటీ ఆమోదించింది. మొత్తం 1221 మంది లబ్ధిదారులకు 1060 యూనిట్లు మంజూరు చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కలెక్టర్ చైర్మన్‌గా, డీఆర్‌డీఏ పీడీ కన్వీనర్‌గా వ్యవహరించిన డీసీసీ కమిటీ ఈ రుణ ప్రణాళికకు ఇటీవలే ఆమోదం తెలిపింది.
మొత్తం 1060 యూనిట్లలో 863 యూనిట్లు బ్యాంకు లింకేజీ యూనిట్లు కాగా మిగతా 197 యూనిట్లు నాన్ బ్యాంకు లింకేజీ యూనిట్లుగా నిర్ణయించారు. దీని ప్రకారం జిల్లాల్లో వివిధ బ్యాంకులకు లక్ష్యాలు విధించారు. అదేవిధంగా మహిళలు, నిరుద్యోగులకు వ్యక్తిగత, గ్రూపు రుణాలు మంజూరు చేసేందుకు కమిటీ అమోదించింది. మంజూరు చేసిన రుణ ప్రణాళికలను మండలాభివృద్ధి కార్యాలయాలకు పంపించి ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఇక ఆయా మండలాల్లో ఉన్న ఎంపిక కమిటీలు దరఖాస్తులను పరిశీలించి ఆన్‌లైన్ చేయాల్సి ఉంది. రుణాల మంజూరు, సబ్సిడీ ప్రక్రియను ఎస్సీ కార్పొరేషన్ ఈడీ హనుమంతు వెంకట ప్రసాదరావు సాక్షి కి వివరించారు.
యూనిట్లు ఇవే ...
రూ. 75వేలు : ఎంబ్రాయిడరీ, టైలరింగ్, తోలు సేకరణ యూనిట్లు
రూ. లక్ష : ఫ్లోర్‌మిల్, కూరగాయల దుకాణాలు, టీ స్టాళ్లు
రూ. 2 లక్షలు : కాంక్రీట్ మిక్స్చర్, చిన్న కిరాణా దుకాణాలు
రూ. 3 లక్షలు : డీటీపీ, జిరాక్స్ యూనిట్, ఫొటో స్టూడియో
గ్రూపు రుణాలు :
రూ. 4 లక్షలు: టెంట్ హౌస్
రూ. 5 లక్షలు : చెప్పుల తయారీ వంటి చిన్న తరహా పరిశ్రమలు
రూ. 8 లక్షలు : ట్రాక్టర్ కొనుగోలు
వాహనాల యూనిట్లు:
ఆటో : రూ. 1.80 లక్షలు
మినీ వ్యాన్ : రూ. 2 లక్షలు
టాటా ఏస్: రూ. 4 లక్షలు
పశుసంవర్థక శాఖ ద్వారా
20 ఆడ, ఒక మగ గొర్రెల యూనిట్ : రూ. 2 లక్షలు
2 ముర్రా జాతి గేదెలు : రూ. లక్ష
2 జెర్సీ ఆవులు : రూ. 80 వేలు
గోపాల మిత్ర కిట్ : రూ. 75 వేలు
డ్వాక్రా మహిళలకు గ్రూపు రుణాల యూనిట్లు :
దుస్తులు కుట్టే యూనిట్ : రూ.4 లక్షలు
అడ్డాకుల తయారీ : రూ. 4 లక్షలు
కారం, తెల్లఉల్లి, అల్లం, తదిరత ఫౌడర్ల తయారీకి : రూ.4 లక్షలు
ఇవి కాకుండా నాన్ బ్యాంకింగ్ ద్వారా లైట్ వెహికల్ మోటార్ డ్రైవింగ్ శిక్షణ, వివిధ ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా హెచ్‌ఐవీ, పీహెచ్‌సీ, తక్కువ వయసులో విడో అయిన వారికి రూ.40వేలు మంజూరు చేయనున్నారు.
సబ్సిడీ :
ప్రతి యూనిట్‌కూ 60 శాతం సబ్సిడీ లేదా లక్ష రూపాయలకు మించకుండా సబ్సిడీని విడుదల చేస్తారు. అయితే గ్రూపు రుణాల్లో మాత్రం ప్రతి లబ్ధిదారునికీ 60 శాతం సబ్సిడీ ఉంటుంది. గ్రూపు రుణాలు ముగ్గురితో కూడా ప్రారంభించుకునేలా ఈ ఏడాది వెసులుబాటు కల్పించారు.
దరఖాస్తు ఇలా....
మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కన్వీనర్‌గా ఒక ఎంపిక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ద్వారా లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంకు విల్లింగ్‌తో పాటు తాను డిపాజిట్ చేసిన మొత్తంతో పాటు (వారు కోరుతున్న రుణాన్ని బట్టి ఉంటుంది) దరఖాస్తును పూర్తిగా నింపి ఆధార్ కార్డుతో సహా పొందుపరచాలి.
మంజూరు చేసే పద్ధతి....
మండల కార్యాలయాల్లోని దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. సమర్పించి న దరఖాస్తును ఎంపీడీఓ, బ్యాంకర్, ఐకేపీ సభ్యుడు, ఎస్సీ సొసైటీ సభ్యుడు, మరో ముగ్గురు సోషల్‌వర్కర్లు సభ్యులుగా ఉండే కమిటీ పరిశీలించి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఈ వివరాలను కలెక్టర్ కమిటీ అప్రూవల్ చేసి ఎస్సీ కార్పొరేషన్‌కు అందజేస్తారు. అక్కడ నుంచి యూనిట్ మంజూరు ఉత్తర్వులు వస్తాయి. సబ్సీడీ సొమ్ము నేరుగా లబ్ధిదారుడి ఖాతాకు జమ అవుతుంది.
మండలాలకు పంపించాం!
ఎస్సీ కార్పొరేషన్ రుణ ప్రణాళిక ఖరారైంది. ఇటీవలే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో బ్యాంకు ప్రతినిధులు, లీడ్‌బ్యాంకు మేనేజర్, డీఆర్‌డీఏ పీడీలతో సమావేశం నిర్వహించాం. జిల్లాలోని 34 మండలాలు, 4 మున్సిపాలిటీలకు లక్ష్యాలను నిర్దేశించి ఎన్ని యూనిట్లు మంజూరు చేయాలనే విషయమై రిపోర్టులు పంపించాం. ఎంపీడీఓ కార్యాలయాల్లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి. పూర్తి చేసిన దరఖాస్తులను కూడా అక్కడే సమర్పించాలి.
-హనుమంతు వెంకట ప్రసాదరావు,
ఈడీ, ఎస్సీ కార్పొరేషన్,
విజయనగరం.