గాడితప్పిన పంచాయతీ పాలన
ఆరు నెలలుగా ఇన్‌చార్జే దిక్కు
కార్యాలయాల్లో సిబ్బంది హవా
నూతన డీపీవో రాకతోనైనా పాలన చక్కబడేనా!
మచిలీపట్నం : పంచాయతీల్లో పాలన గాడి తప్పింది. జిల్లా పంచాయతీ అధికారి పోస్టు ఆరు నెలలుగా ఖాళీగా ఉండటంతో పాలనను పట్టించుకునే వారే కరువయ్యారు. కీలక ఫైళ్లు అన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇన్‌చార్జ్ డీపీవోగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎన్.వి.వి.సత్యనారాయణ కొనసాగుతున్నారు. రెగ్యులర్ డీపీవో లేకపోవడంతో పంచాయతీ కార్యాలయ సిబ్బంది తమ చిత్తానుసారం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాసులు ఇస్తేనే ఫైళ్లు కదిలే విధంగా డీపీవో కార్యాలయంలో పరిస్థితి తయారైంది.
గత నెలలో జరిగిన పంచాయతీ కార్యదర్శుల బదిలీల్లో కార్యాలయ సిబ్బంది తమ ఇష్టానుసారం వ్యవహరించి లక్షలాది రూపాయలు వెనకేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో డీపీవోగా పనిచేసిన నాగరాజువర్మ ఏసీబీకి చిక్కడంతో ఆ పోస్టు ఖాళీ ఏర్పడింది. ఆరు నెలలుగా డీపీవోగా రెగ్యులర్ అధికారి లేకపోవడంతో కార్యాలయంలో పనిచేసే సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు చెప్పిందే వేదంగా నడిచిందనే ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయంలో ఎవరికి వారు పెత్తనం చేయడం, ఇష్టానుసారంగా ఫైళ్లను నడపడం, అందినకాడికి దండుకోవడం నిత్యకృత్యమనే వాదనలు ఆశాఖ అధికారులు, సిబ్బంది నుంచే వినిపిస్తున్నాయి.
నెలల తరబడి పెండింగ్‌లోనే ఫైళ్లు
జిల్లాలో 970 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 153 మేజర్ పంచాయతీలు. గత ఏప్రిల్ నుంచి పారిశుధ్య కార్మికులు, పంపు ఆపరేటర్లు, కాంట్రాక్టు విద్యుత్ కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలకు సంబంధిం చిన ఫైళ్లన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయ. రూ.2 లక్షల్లోపు పంచాయతీ ఖర్చు ఉంటే డీపీవో స్థాయిలో బిల్లులు చేసే అధికారం ఉంది. రూ.2 లక్షలకు మించి బిల్లులు చెల్లించాల్సి వస్తే కలెక్టర్‌కు ఈఫైళ్లను పంపి ఆమోదం పొందాల్సి ఉంది. గత ఆరు నెలలుగా ఇన్‌చార్జ్ డీపీవోనే ఉండటంతో మేజర్ పంచాయతీలకు సంబంధించిన బిల్లులకు సంబంధించిన ఫైళ్లు పెండింగ్‌లోనే ఉన్నట్లు ఆశాఖ సిబ్బంది చెబుతున్నారు.
పంచాయతీ సాధారణ నిధుల్లో 30 శాతానికి మించి పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకూడదని ప్రభుత్వం నిబంధన విధించింది. ప్రస్తుతం స్వచ్ఛభారత్ తదితర కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో మేజర్, మైనర్ పంచాయతీల్లో పారిశుధ్య చర్యలకు 30శాతాని కన్నా మించి ఖర్చులు అవుతున్నాయని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. పంచాయతీలకు సంబంధించిన బిల్లులు పెండిం గ్‌లో ఉండడం, కొన్ని పంచాయతీల్లో సిబ్బందికి జీతభత్యాలు ఇవ్వడం తదితర అంశాలపై కలెక్టర్‌కు పూర్తిస్థాయిలో వివరించి ఆ బిల్లులు పాసయ్యేలా ఒప్పించే అధికారి లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పంచాయతీల్లో ఏమైనా పనులు చేయాలంటే ముందు, వెనుక ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.
డీపీవో రాకతోనైనా పరిస్థితి మారేనా!
జిల్లా పంచాయతీ అధికారిగా వి.కృష్ణకుమారిని ప్రభుత్వం నియమించింది. ఆమె మంగళవారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు పంచాయతీ వర్గాలు తెలిపాయి. అయితే కలెక్టర్ బాబు.ఎ అందుబాటులో లేకపోవడంతో గురువారం డీపీవో బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. గతంలో మచి లీపట్నం డీఎల్‌పీవోగా ఆమె పనిచేశారు. డీపీవో కార్యాలయం నుంచే పాలన కొనసాగించడంతో ఈ కార్యాలయంలో సిబ్బంది వ్యవహారశైలి తదితర అంశాలపై అవగాహన ఉంది.
ప్రస్తుతం డీపీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ల హవా కొనసాగుతోంది. ఇటీవల పంచాయతీరాజ్ విభాగంలోని ఉద్యోగులందరికీ బదిలీ జరిగినా ఈ ఇద్దరు మాత్రం ఇక్కడే కొనసాగుతున్నారు. వారు వచ్చిన ప్రతి అధికారిని ప్రసన్నం చేసుకుని తమ హవా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పంచాయతీల్లో పాలన గాడిలో పెట్టేం దుకు డీపీవో కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బం దిని ముందస్తుగా ప్రక్షాళన చేస్తే కొంత ప్రయోజనం ఉంటుందనే వాదన వ్యక్తమవుతోంది. నూతన డీపీవోగా బాధ్యతలు స్వీకరించనున్న కృష్ణకుమారి ఏ మేరకు వ్యవహరిస్తారో వేచి చూడాల్సిందే.
ఎక్కడి ఫైళ్లు అక్కడే!
Published Wed, Sep 30 2015 3:49 AM | Last Updated on Sun, Sep 3 2017 10:11 AM