ట్రాన్స్‌కో పై ‘ఉచిత’ భారం!
Published Sun, Feb 2 2014 2:47 AM | Last Updated on Tue, Jul 24 2018 2:17 PM
బొబ్బిలి, న్యూస్‌లైన్ : ఎస్సీ, ఎస్టీలు 50 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తే.. ఆ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని పాలకులు ఏడు నెలల క్రితం ప్రకటించారు. ఈ మేరకు గత ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీన ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాలో ఎస్సీ, ఎస్టీల్లో ఎంతమంది 50 యూనిట్లు వాడుతున్నారు... దీని వల్ల ఎంత భారం అవుతుందన్న లెక్కలను ట్రాన్స్‌కో అధికారులు కట్టారు. జిల్లాలో ఉచిత విద్యుత్‌కు అర్హత ఉన్న వారిలో ఎస్సీల్లో 17,300 మంది, ఎస్టీల్లో 34,450 ఉన్నట్టు గుర్తించారు. వీరందరికీ ట్రాన్స్‌కో అధికారులు ఏప్రిల్ నెల నుంచే ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఆ భారాన్ని ప్రభుత్వం భరించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ట్రాన్స్‌కోకు పైసా కూడా చెల్లించలేదు. జిల్లావ్యాప్తంగా ప్రతి నెలా ఎస్సీ లబ్ధిదారులు వినియోగించిన విద్యుత్‌కు రూ. 25 లక్షలు, ఎస్టీ లబ్ధిదారులు వినియోగించిన దానికి రూ. 15 నుంచి రూ. 17 లక్షల వరకూ చెల్లించాల్సి ఉంది. గత ఏడాది నవంబరు నాటికి ఈ బకారుు రూ. 3.50 కోట్ల వరకూ ఉన్నట్టు ఆ శాఖాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
ఇప్పుడు ఈ రెండు నెలలకు దాదాపు మరో కోటి రూపాయలు అదనంగా పెరిగే అవకాశం ఉంది. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అసలు ఈ మొత్తం ప్రభుత్వం నుంచి ట్రాన్స్‌కోకి జమ అవుతుందా లేదా అన్న సందేహం ఉద్యోగుల్లో కలుగుతోంది. ప్రతినెలా ఎస్సీ వర్గానికి చెందిన వారికి ఉచిత విద్యుత్ వల్ల ప్రభుత్వం ఎంత కట్టాలన్నది ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌కు, ఎస్టీల కోసం వెచ్చించిన దానిపై ఐటీడీఏ పీఓకు విద్యుత్ శాఖాధికారులు లేఖలు రాస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం స్పందించడం లేదు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడుతున్నామంటూ ఇలా కోట్ల రూపాయలు నిధులు బకాయిలు ఉంచడంతో ప్రభుత్వం పథకాలు ఎన్నాళ్లు సాగుతాయోనన్న అనుమానాలు కలుగుతున్నాయి.
Advertisement
Advertisement