
దేశవ్యాప్తంగా డిసెంబర్ నెలలో విద్యుత్ వినియోగం (power consumption) గణనీయంగా పెరిగింది. 6 శాతం పెరిగి 130.40 బిలియన్ యూనిట్లుగా నమోదైంది. 2023 డిసెంబర్ నెలలో వినియోగం 123.17 బిలియన్ యూనిట్లుగా ఉంది. రోజువారీ గరిష్ట సరఫరా (గరిష్ట డిమాండ్) 224.16 గిగావాట్లుగా నమోదైంది.
2024 మే నెలలో 250 గిగావాట్లు ఇప్పటి వరకు గరిష్ట రోజువారీ రికార్డుగా ఉంది. 2024 వేసవి సీజన్‌కు గరిష్ట రోజువారీ డిమాండ్ 260 గిగావాట్లకు చేరుకోవచ్చని కేంద్ర విద్యుత్ శాఖ అంచనా వేయడం గమనార్హం. ఇక 2025 వేసవి సీజన్‌కు గరిష్ట డిమాండ్ 270 గిగావాట్లకు చేరుకోవచ్చని భావిస్తోంది.
రూమ్ హీటర్లు, వాటర్ హీటర్లు, గీజర్ల వాడకం డిసెంబర్‌లో విద్యుత్ వినియోగం పెరగడానికి కారణమై ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తరాదిన ఉష్ణోగ్రతలు మరింత కనిష్టానికి చేరుకునే అవకాశాలతో విద్యుత్ వినియోగం జనవరిలోనూ అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.