న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లు గరిష్ట స్థాయుల్లో తిరుగుతున్న నేపథ్యంలో పబ్లిక్ ఇష్యూల జోరు కొనసాగుతోంది. నవంబర్‌లో 10 కంపెనీలు విజయవంతంగా ఐపీవోలను ముగించగా.. డిసెంబర్‌లోనూ మరో 10 కంపెనీలు లైన్‌లో ఉన్నాయి. ఇవి దాదాపు రూ. 10,000 కోట్ల పైగా సమీకరించనున్నాయి. ఇప్పటికే స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్, టెగా ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూలకు మార్కెట్లో సబ్‌స్క్రిప్షన్ కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో ట్రావెల్, హాస్పిటాలిటీ టెక్నాలజీ సేవల సంస్థ రేట్‌గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్, ఆర్థిక సేవల గ్రూప్ ఆనంద్ రాఠీలో భాగమైన ఆనంద్ రాఠీ వెల్త్, గ్లోబల్ హెల్త్, హెల్తియం మెడ్‌టెక్ మొదలైనవి డిసెంబర్ ఐపీవోల జాబితాలో ఉన్నాయి. రేట్‌గెయిన్ ఇష్యూ డిసెంబర్ 7–9 మధ్య ప్రారంభం కానుండగా, ఆనంద్ రాఠీ వెల్త్ ఐపీవో డిసెంబర్ 2న మొదలవుతుంది. ఇక మెడాంటా బ్రాండ్ ఆస్పత్రులను నిర్వహిస్తున్న గ్లోబల్ హెల్త్, ఫార్మసీ రిటైల్ చెయిన్ మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్, హెల్తియం మెడ్‌టెక్ కూడా ఐపీవోలకు సిద్ధమవుతున్నాయి. ఇవి కాకుండా మెట్రో బ్రాండ్స్, శ్రీరామ్ ప్రాపర్టీస్, ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్, శ్రీ బజరంగ్ పవర్ అండ్ ఇస్పాత్, వీఎల్‌సీసీ హెల్త్‌కేర్ హెల్త్‌కేర్ కూడా డిసెంబర్‌లోనే పబ్లిక్ ఇష్యూకి రానున్నాయని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు తెలిపారు.
బుల్ రన్ ఊతం..
పబ్లిక్ ఇష్యూల ద్వారా సమీకరించే నిధులను ఆయా కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాల విస్తరణ, రుణ భారాన్ని తగ్గించుకోవడం, ఇతర కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించుకుంటున్నాయి. కొన్ని ఇష్యూల ద్వారా ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, ప్రమోటర్లు తమ వాటాల్లో కొంత భాగాన్ని ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) విధానంలో విక్రయించి నిధులు సమీకరించుకున్నారు. ఐపీవోల జోరు కొనసాగడానికి ఈక్విటీ మార్కెట్లలో బుల్ రన్ కారణమని లెర్న్‌యాప్‌డాట్‌కామ్ వ్యవస్థాపకుడు, సీఈవో ప్రతీక్ సింగ్ చెప్పారు. ‘ఏ కంపెనీ అయినా పబ్లిక్ ఇష్యూకి వెళ్లాలంటే బుల్ మార్కెట్ అత్యంత అనువైనది. అందుకే చాలా కంపెనీలు ప్రస్తుతం లిస్టింగ్‌కు వస్తున్నాయి. ఇలాంటి మార్కెట్లలో సెంటిమెంటును తమకు ప్రయోజనకరంగా మల్చుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తాయి. విజయం కూడా సాధిస్తాయి‘ అని ఆయన పేర్కొన్నారు. చాలా మటుకు ఐపీవోలకు ఇన్వెస్టర్ల నుంచి బంపర్ స్పందన లభిస్తోంది కూడా. పలు ఇష్యూలు అనేక రెట్లు సబ్‌స్క్రయిబ్ అవుతుండటం ఇందుకు నిదర్శనం. మార్కెట్లు నెమ్మదించి, మళ్లీ పడే దాకా ఐపీవోల ట్రెండ్ కొనసాగుతుందని, సమీప భవిష్యత్‌లో మరిన్ని టెక్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధులు సమీకరించేందుకు ముందుకు వస్తాయని ప్రతీక్ సింగ్ తెలిపారు. భవిష్యత్‌లో మార్కెట్లు క్షీణిస్తే.. ఐపీవోలు కూడా తగ్గుతాయి అని పేర్కొన్నారు.
ఇప్పటిదాకా 51 కంపెనీలు..
ఎక్సే్ంజీల గణాంకాల ప్రకారం 2021లో ఇప్పటిదాకా 51 కంపెనీలు ఐపీవోలకు వచ్చాయి. రూ. 1 లక్ష కోట్ల పైగా సమీకరించాయి. ఇవి కాకుండా ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టులు (ఇన్‌విట్), రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టులు (రీట్) కూడా పబ్లిక్ ఇష్యూలకు వచ్చాయి. ఐపీవో ద్వారా పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన పవర్‌గ్రిడ్ ఇన్విట్ రూ. 7,735 కోట్లు, బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రీట్ రూ. 3,800 కోట్లు సేకరించాయి. 2020 మొత్తం మీద పబ్లిక్ ఇష్యూల ద్వారా 15 కంపెనీలు రూ. 26,611 కోట్లు సమీకరించాయి. 2017లో అత్యధికంగా ఐపీవోల సందడి కనిపించింది. అప్పట్లో 36 కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా ఏకంగా రూ. 67,147 కోట్లు సేకరించాయి. మళ్లీ ఆ స్థాయిని మించిన ఐపీవోల సందడి 2021లో కనిపిస్తోందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.
ఐపీవోకి స్నాప్‌డీల్
రూ. 1,870 కోట్ల సమీకరణ యోచన
ఈ–కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ వచ్చే ఏడాది ప్రథమార్ధంలో పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. సుమారు 250 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1,870 కోట్లు) సమీకరించాలని యోచిస్తోంది. దీని ప్రకారం సంస్థ విలువ సుమారు 1.5–1.7 బిలియన్ డాలర్లుగా ఉండనుంది. దీనికి సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను మరికొన్ని వారాల్లో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి స్నాప్‌డీల్ సమర్పించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డిసెంబర్–జనవరిలో ప్రాస్పెక్టస్ సమర్పించాలని, అనుమతులు వచ్చాక 2022 ప్రథమార్ధంలో ఐపీవోకి రావాలని కంపెనీ భావిస్తున్నట్లు వివరించాయి. పబ్లిక్ ఇష్యూ సందర్భంగా వ్యవస్థాపకులు తమ వాటాలను విక్రయించే యోచనలో లేరని పేర్కొన్నాయి. ఇతర ప్రధాన వాటాదారులు కూడా అదే అభిప్రాయంతో ఉండవచ్చని సంబంధిత వర్గాలు వివరించాయి. స్నాప్‌డీల్‌లో సాఫ్ట్‌బ్యాంక్, బ్లాక్‌రాక్, టెమాసెక్ హోల్డింగ్స్, ఈబే వంటి దిగ్గజాలు ఇన్వెస్ట్ చేశాయి. ఒకప్పుడు దేశీ ఈ–కామర్స్ రంగంలో స్నాప్‌డీల్ ఒక వెలుగు వెలిగింది. కానీ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి సంస్థల రాకతో.. పోటీలో వెనుకబడింది. ఒక దశలో ఫ్లిప్‌కార్ట్‌లో విలీన అవకాశం వచ్చినప్పటికీ ... డీల్ కుదుర్చుకోలేదు. స్వయంగా ఆర్థికంగా బలపడే లక్ష్యంతో స్నాప్‌డీల్ 2.0 వ్యూహాన్ని అమలుకు మొగ్గు చూపింది.
Comments
Please login to add a commentAdd a comment