కదులుతున్న స్థానాలు... | duties as SC Corporation ED | Sakshi
Sakshi News home page

కదులుతున్న స్థానాలు...

Published Wed, Nov 12 2014 4:31 AM | Last Updated on Thu, Aug 16 2018 5:07 PM

కదులుతున్న స్థానాలు... - Sakshi

కదులుతున్న స్థానాలు...

జిల్లాలో ఉన్నతాధికారుల స్థానాలు కదులుతున్నాయి. జన్మభూమి కార్యక్రమం ముగియడంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు బదిలీ పర్వం ప్రారంభమైంది. ఇప్పటికే జెడ్పీసీఈఓ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీలకు బదిలీ అయింది.  ఆరోగ్యశాఖ ఉద్యోగులకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. తాము కోరుకున్న స్థానం లభిస్తుందో లేదో తెలియక టెన్షన్ పడుతున్నారు. మరో పక్క పైరవీల స్పీడ్ పెంచారు. కానుకలు సమర్పించుకుంటూ కావలసిన సీటు కొట్టేయాలని చూస్తున్నారు.
 
* ప్రారంభమైన బదిలీల పర్వం
* కోరుకున్న స్థానం కోసం  జోరుగా యత్నాలు
* తిరుమల వెళ్లేందుకు జేసీ ప్రయత్నాలు
* డీఆర్వో మళ్లీ ఇక్కడేనా?

విజయనగరం కంటోన్మెంట్: ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న బదిలీలు, వాటికోసం చేసే యత్నాలు మళ్లీ జోరందుకున్నాయి.   ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా విధులు నిర్వహిస్తున్న హెచ్‌వీ ప్రసాదరావుకు తూర్పుగోదావరి జిల్లా డీఆర్‌డీఏ ఏపీడీగా బదిలీ అయింది. ఆయన మంగళవారం రిలీవ్ అయ్యారు.  ఈయన స్థానంలో కేఆర్‌పీసీ డిప్యూటీ కలెక్టర్ శ్రీలతను ఇన్‌చార్జ్‌గా నియమించారు. జెడ్పీ సీఈఓ మోహన్‌రావు, పంచాయతీరాజ్ ఎస్‌ఈ వేణుగోపాల్‌కు బదిలీలు అయ్యాయి. వీరితో పాటు ఆరోగ్యశాఖలో కిందిస్థాయి ఉద్యోగుల బదిలీలకు మంగళవారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభించారు.  ఇంతకుముందే బదిలీలు జరుగుతాయని అనుకున్నా జన్మభూమి కార్యక్రమాలు రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది.  

11వ తేదీతో జన్మభూమి కార్యక్రమం ముగియడంతో  బదిలీల ప్రక్రియకు కదలిక వచ్చింది.  జాయింట్ కలెక్టర్ నుంచి జిల్లాలో ఇతర అధికారుల వరకూ అందరూ బదిలీలపై దృష్టి సారించారు. కొందరు ఇప్పటికే రిటెన్షన్ (బదిలీకాకుండా నిలుపుకోవడం) తెచ్చుకున్నారు.   మరికొందరు తాము ఎన్నాళ్లనుంచో ఎదురు చూస్తున్న స్థానాల కోసం ప్రయత్నాలు చే సుకుంటున్నారు. జిల్లాలో చాలా మంది ఉన్నతాధికారులు  కలెక్టరేట్‌లో  స్థానాల కోసం పైరవీలు చేస్తున్నారు.  అధికారులు తమ ఆప్షన్లు తెలియజేసేందుకు ఈనెల 15 తుది గడువు  కావడంతో వారంతా చాలా బిజీగా ఉన్నారు.  ఎమ్మెల్యేలు, మంత్రుల ద్వారా పైరవీలు సాగిస్తున్నారు.  అయితే బదిలీలు ఎవరికి జరిగాయనే విషయం మాత్రం బుధ,గురువారాల్లో  ఒక కొలిక్కి రావచ్చనేది  భోగట్టా.  

ఇప్పటికే  రిలీవ్ అయి ఉంటే ప్రభుత్వం వారిని అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్‌లో ఎప్పుడైనా నియమించే అవకాశం ఉంది. ఏజేసీగా ఇక్కడ చేరేందుకు  నర్సింగరావు ఏలూరులో రిలీవ్ అయి  వచ్చారు.  కానీ ఆయనకు ఇక్కడ పోస్టు ఖాళీగా లేకపోవడంతో వెనుక్కు తిరిగి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వానికి  రిపోర్టు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ఇక్కడ ఆయన చేరితే జిల్లాలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశాలొచ్చాయి.

కానీ నాగేశ్వరరావు విధుల నుంచి రిలీవ్ కాకుండా నేరుగా హైదరాబాద్ వెళ్లి తనకు తెలిసిన వారితో మాట్లాడి బదిలీ అయితే పడే ఇబ్బందుల దృష్ట్యా  తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారని, ఇక్కడే కొనసాగేందుకు రిటెన్షన్ తెచ్చుకున్నారని,  దీంతో ఆయన బదిలీ ప్రస్తుతానికి ఆగిపోయిందని చెబుతున్నారు.   అయితే నర్సింగరావు పదోన్నతిపై బదిలీ అయిన ఉద్యోగి కనుక ఎక్కడ వేసినా పదోన్నతికి సంబంధించిన పోస్టే ఆయనకు ఉంటుందని చెబుతున్నారు.  జిల్లాలోని ఎస్‌డీసీలు, జిల్లా స్థాయి అధికారులు తమకు దగ్గరలోని శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాలకు బదిలీలు చేయించుకునేందుకు యత్నాలు ముమ్మరం చేశారు.

శ్రీకాకుళం వెళ్లేందుకు అక్కడి స్థానికత ఓ కారణంగా చెబుతుంటే, లోకల్ ఏరియాకు ట్రాన్స్‌ఫర్ అంటే నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటున్నారని, అందువల్ల ఆలోచించుకోవాలని హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులు బదిలీ కోరిన వారికి  ఉపదేశిస్తున్నారు.  విశాఖపట్నం వెళ్లేందుకు కూడా చాలా మంది ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎందుకంటే అక్కడ అన్ని రకాల సౌకర్యాలూ అందుబాటులో ఉంటాయన్నది వారి ఆలోచన. విజయనగరం వచ్చి వెళ్లేందుకు ప్రయాణసాధనాలు కూడా విరివిగా ఉండటంతో పాటు గంట ప్రయాణం మాత్రమే ఉండటంతో చాలా మంది ఉద్యోగులు విశాఖ పట్నం బదిలీ అయితే బాగుంటుందని కోరుకుంటున్నారు.
 
తిరుమల జేఈఓ పోస్టుపై ఆసక్తి చూపుతున్న జేసీ  ?
జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న బి రామారావు తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ పోస్టుపై ఆసక్తి కనబరుస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం తనకు తెలిసిన సీనియర్ ఐఏఎస్ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారని వినికిడి. ఇప్పటికే ఆయన పలువురు అధికారులతో మాట్లాడి అక్కడకు బదిలీ చేసుకునేందుకు ప్రయత్నాలు చేశారనీ అంటున్నారు. అంతే కాకుండా  బుధవారం నుంచి ఆయన మూడు రోజుల పాటు సెలవు పెట్టారు. జేఈఓ పోస్టుసాధించేందుకునేందుకు   సెలవు పెట్టారని సమాచారం.
 
మళ్లీ డీఆర్వోగా హేమసుందర్?
జిల్లాలో డీఆర్వోగా పనిచేస్తున్న హేమసుందర్‌ను  కలెక్టర్ నాయక్ మందలించడంతో కినుక వహించి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. పలుమార్లు ఆయన తన సెలవును పొడిగించుకున్నారే తప్ప విధుల్లో చేరలేదు. ఈ లోగా ఆయన పలు పోస్టుల కోసం ప్రయత్నించారు. అయితే అవేవీ సఫలం కాకపోవడంతో మళ్లీ విజయనగరంలోనే డీఆర్వో పోస్టులో చేరే అవకాశముందని  అంటున్నారు. దీనికోసం   ఆదివారం  వచ్చి వెళ్లినట్టు తెలిసింది  
 
పైరవీలతో పాటు సంభావనలూ ..
కోరుకున్న ప్రాంతాలకు బదిలీలు చేయించుకునేందుకు పైరవీలతో పాటు సంభావనలూ ముట్టజెబుతున్నట్టు తెలుస్తోంది. నలుగురు అధికారులు ఒక చోట చేరితే ఈ విషయమే చర్చించుకుంటున్నారు. ఓ జిల్లా స్థాయి అధికారి తనకు బదిలీకాకుండా ఉండేందుకు   రూ.15 లక్షలు ఇచ్చారని తెలిసింది.  కింది స్థాయి ఉద్యోగులు రూ.లక్షల్లో సమర్పించుకుంటున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement